మున్సిపల్‌‌ గ్రాంట్లు విడుదల చేయండి

MP Vijay Sai Reddy Letter To Cabinet Minister Hardeep Singh Puri - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలకు గ్రాంట్ల కింద విడుదల చేయాల్సిన మొత్తాల్లో కేంద్ర ప్రభుత్వం బకాయిపడిన రూ.581.60 కోట్ల త్వరితగతిన విడుదల చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 2015-16 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను ఏపీలోని మున్సిపాలిటీలకు రూ. 3,635.80 కోట్ల గ్రాంట్లుగా అందించాలని 14వ ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫార్సు చేసిందని విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. మొత్తం నిధులను పట్టణాలు, నగరాల్లో రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా, ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాల సంరక్షణ, ఆట స్థలాల అభివృద్ధి వంటి పౌర సేవలు, మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాల్సించి ఉంటుందన్నారు. మున్సిపాలిటీలకు ఆర్థిక సంఘం మంజూరు చేసిన మొత్తం గ్రాంట్లలో ఇప్పటి వరకు రూ.3054.20 కోట్లు విడుదలైనట్లు ఆయన తెలిపారు. తదుపరి గ్రాంట్ల విడుదలకు అవసరమైన అన్ని నియమ నిబంధనలను ఏపీ ప్రభుత్వం పాటించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు.

కేంద్రం ఇప్పటి వరకు విడుదల చేసిన గ్రాంట్లకు సంబంధించి వినిమయ పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి సమర్పించిందన్నారు. అలాగే ఆర్థిక సంఘం నిర్దేశించిన మూడు ప్రధాన సంస్కరణలు సైతం అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆడిట్‌ చేసిన వార్షిక అకౌంట్లను సమర్పించిందని వివరించారు. మున్సిపాలిటీల ఆదాయ వనరులను పెంపొందిచేలా పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. నిర్దేశిత స్థాయిలో పౌర సేవల ఉండేలా చర్యలు తీసుకున్నట్లు విజయసాయి రెడ్డి లేఖలో మంత్రికి వివరించారు. ఇదే విషయమై ఏపీ ప్రభుత్వం సైతం కేంద్ర ప్రభుత్వానికి సవివరమైన లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పౌర సేవలు నిరాటంకంగా కొనసాగించేందుకు, వారికి కనీస సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తాలను ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న రూ. 581.60 కోట్ల మున్సిపల్‌ గ్రాంట్లను త్వరితగతిన విడుదల చేయాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు. బకాయిపడిన గ్రాంట్లను సకాలంలో విడుదల చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలను నిరాటంకంగా కొనసాగించేందుకు దోహదం చేస్తుందని లేఖలో ప్రస్తావించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top