అర్హులైతే చాలు... ఇంటి పట్టా చేతికి

More than half of the house rails across AP have been distributed - Sakshi

కులాలు, మతాలు, పార్టీలకతీతంగా.. అర్హతే ప్రామాణికంగా..

తెనాలిలో బీజేపీ కౌన్సిలర్‌ అభ్యర్థినికి ఇంటి పట్టా

రాష్టవ్యాప్తంగా సగానికిపైగా పట్టాల పంపిణీ పూర్తి

సంక్రాంతితో పోటీగా కొనసాగుతున్న సంబరాలు

ఇదో మహా యజ్ఞం.. వడివడిగా నిర్విఘ్నంగా సాగుతున్న గొప్ప సంకల్పం... మరి దానికి సన్నద్ధత కూడా ఆ స్థాయిలోనే ఉండాలి. అందుకే 30 లక్షల పైచిలుకు ఇళ్ల పట్టాలివ్వటం,వాటిని నిర్మించి ఇవ్వటం అనే భగీరథ లక్ష్యాన్ని తలకెత్తుకున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. నిర్దేశించుకున్న సమయంలోగా అందుకోవాలంటే వినూత్న ఆలోచనలు, ప్రణాళికలతో పాటు కార్యాచరణ కూడా విభిన్నంగా ఉంటే తప్ప సాధ్యం కాదనేది సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్దేశం. అందుకే అనితర సాధ్యమైన ఈ లక్ష్యాన్ని అందుకోవటానికి ఇబ్బందులుండకూడదని.. కావాల్సిన భూమి మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందే కొనుగోలు చేసింది. మొత్తం 68,677 ఎకరాల్లో 25,433 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి. మిగిలిన భూమి మొత్తం ప్రైవేట్‌ వర్గాల నుంచి సేకరించిందే.

సాక్షి, అమరావతి, సాక్షి నెట్‌వర్క్‌: ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లుగానే ఎలాంటి వివక్షకు తావులేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ పండగ వాతావరణంలో కొనసాగుతోంది. అర్హులందరికీ పిలిచి మరీ ఇంటి పట్టాను అందచేస్తుండటం పట్ల అక్క చెల్లెమ్మలలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. తెనాలిలో కౌన్సిలర్‌ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తోన్న కొర్రా లక్ష్మీ కృష్ణవేణి ఇందుకు నిదర్శనం. పట్టణంలోని 13వ వార్డులో నివాసం ఉండే ఆమె ప్రభుత్వం మంజూరు చేసే నివేశన స్థలం కోసం అర్జీ పెట్టుకున్నారు. అధికారుల పరిశీలనలో ఆమె అర్హురాలిగా తేలడంతో అదే వార్డు నుంచి పోటీ చేస్తున్న వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిని కుర్రా సుజాత, శ్రీను దంపతుల సమక్షంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ చేతుల మీదుగా శనివారం ఇంటి పట్టాను అందుకున్నారు. కేవలం పేదలా.. కాదా? అన్న అంశాన్ని మాత్రమే పరిశీలించి పార్టీ గురించి పట్టించుకోకుండా తనకు ఇంటి పట్టా ఇవ్వడంపై లక్ష్మీ కృష్ణవేణి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

7 వరకు కొనసాగనున్న కార్యక్రమాలు..
రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమాలు సంక్రాంతి సంబరాలతో పోటీపడి సాగుతున్నాయి. దేశ చరిత్రలోనే ఎక్కడా, ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 30.75 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం నివాస స్థలాలు / ఇళ్లు మంజూరు చేయడంతో తమ జీవితకాల స్వప్నం సాకారమైందంటూ లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా తమకు గతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, ఇప్పుడు ఎవరినీ అడక్కుండానే ప్రభుత్వం నివాస స్థలాలు ఇవ్వడంతోపాటు ఇళ్లు కూడా మంజూరు చేసిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో తమకు కేటాయించిన ఇళ్ల స్థలాల వద్దకు వెళ్లి చూసుకోవడం ద్వారా సొంతింటి కల నెరవేరిందన్న ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఏ ఒక్క అర్హుడికీ ఇంటి స్థలం రాలేదనే మాట వినిపించరాదని సీఎం జగన్‌ పదేపదే చెప్పడం, అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయడమే కాకుండా ప్లాట్ల కేటాయింపు కూడా లాటరీల ద్వారా జరపడం పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు సగం వరకు పట్టాల పంపిణీ పూర్తైనట్లు అనధికారిక అంచనా. పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమాలు ఈనెల 7వతేదీ వరకు కొనసాగనున్నాయి. 
విజయవాడ పడమటలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన లబ్ధిదారులు 

రాష్ట్రవ్యాప్తంగా పట్టాల పంపిణీ..
గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండల పరిధిలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేదలకు శనివారం పట్టాలు అందజేశారు. మిగిలిన చోట్ల ఎంపీలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పట్టాల పంపిణీ కొనసాగింది. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా 2,559 మంది లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. తొమ్మిది రోజుల వ్యవధిలో 35,151 మందికి పట్టాలు అందాయి. విశాఖ జిల్లాలో పెందుర్తి, భీమిలి, గాజువాక నియోజకవర్గాల్లో నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా 22,256 మందికి పట్టాలు పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 9,697 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వగా తొమ్మిది రోజుల్లో మొత్తం 69,659 మందికి ఇళ్ల పట్టాలు అందచేశారు.

ఏలూరు నియోజకవర్గం పోణంగిలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని 3,385 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఆచంట నియోజకవర్గంలో గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధరాజు 1,248 మందికి పట్టాలు అందజేశారు. కృష్ణా జిల్లాలో 8,638 మందికి ఇళ్ల పట్టాలను అందచేశారు. మచిలీపట్నం నియోజకవర్గం తపసిపూడిలో సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని పట్టాలు అందజేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురం లేబర్‌ కాలనీలో దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్నారు. గుడ్లవల్లేరు మండలంలో మంత్రి కొడాలి నాని ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయిగూడెం, వెంకటాపురం, మండలపాడులో ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను పేదలకు పట్టాలు అందించారు.

విజయనగరం జిల్లాలో 17,438 పట్టాలు పంపిణీ చేశారు. ఇందులో ఇళ్ల పట్టాలు 12,479 కాగా టిడ్కో ఇళ్లు 2664, పీసీ/ఈఆర్‌ పట్టాలు 2295 ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 36,307 పట్టాలు పంపిణీ చేశారు. మొత్తం 1,08,830 పట్టాలు పంపిణీ చేయాల్సి ఉంది. ప్రకాశం జిల్లాలో 4,150 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా ఇప్పటి వరకు మొత్తం 36,744 మందికి పట్టాలిచ్చారు. మొత్తం 84,027 పట్టాలు పంపిణీ చేయాల్సి ఉంది. అనంతపురం జిల్లాలో తొమ్మిదో రోజు 6,021 మందికి పట్టాలు ఇచ్చారు. కర్నూలు జిల్లాలో శనివారం 9,988 ఇళ్ల పట్టాలను  లబ్ధిదారులకు అందజేశారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగా 13,661 ఇళ్ల  పట్టాలను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్‌ఆర్‌పురం మండలంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మదనపల్లి నియోజకవర్గంలో రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి లబ్దిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 3,917 మందికి ఇళ్ల పట్టాలు, 20 మందికి టిడ్కో ఇళ్ల పత్రాలను అందజేశారు. వైఎస్సార్‌ జిల్లాలో శనివారం 5,696 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 60,152 మందికి పట్టాల పంపిణీ పూర్తయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top