Sakshi News home page

శ్రీకాకుళం భాగ్యరేఖ.. మూలపేట పోర్టు 

Published Fri, Jan 5 2024 4:44 AM

Moolapet Port construction works at a fast pace - Sakshi

సాక్షి, అమరావతి: వెనుకబడ్డ ఉత్తరాంధ్ర తలరాతను మార్చే మరో పోర్టు వేగంగా రూపుదిద్దుకుంటోంది. వలస జిల్లా పేరు నుంచి ఉపాధి కల్పించే జిల్లాగా శ్రీకాకుళం పేరును మార్చే మూలపేట పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జిల్లాకు రెండు వేల కోట్ల రూపాయలకు మించి పెట్టుబడులు రాలేదు. కానీ ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏకంగా మూలపేట పోర్టు, మంచినీళ్లపేట, బుడగల్లపాలెం ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి రూ. 5,000 కోట్లు పైనే వ్యయం చేస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న నాలుగు పోర్టుల్లో ఒకటైన మూలపేట మన రాష్ట్రంతో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, దక్షిణ ఒడిశా ప్రాంతాల నుంచి ఎగుమతులు దిగుమతులకు అనువుగా ఉంటుందని.. ఇలాంటి కీలకమైన ప్రదేశంలో మూలపేట ఉందని ఏపీ మారిటైమ్‌ బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. ఈ పోర్టు ద్వారా ఐదు రాష్ట్రాల్లోని పరిశ్రమలు తమకు అవసరమైన ముడి సరుకులు దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంది. అలాగే ఇక్కడ నుంచి మినరల్‌ శాండ్, ముడి ఇనుము, జీడిపప్పు, సోయా మీల్, గ్రానైట్, ఫెర్రో ఉత్పత్తులు, జూట్, ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ఉత్పత్తుల ఎగుమతికి అవకాశాలు మెండుగా ఉన్నాయి.

మూలపేట పోర్టు పనులను ఏప్రిల్‌ 19న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అప్పటి నుంచి పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 25,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు పేర్కొంటున్నారు. 

అన్ని అనుమతుల తర్వాత
అన్ని అనుమతుల తర్వాతే నిర్మాణ పనులు ప్రారంభించడంతో పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. పోర్టులో కీలకమైన సౌత్‌ బ్రేక్‌ వాటర్‌ నిర్మాణానికి 19.40 లక్షల టన్నులు, నార్త్‌ బ్రేక్‌ వాటర్‌ నిర్మాణానికి 2.71 లక్షల టన్నుల బండరాళ్లు అవసరమవుతాయని అంచనా వేయగా ఇప్పటికే 8.3 లక్షల టన్నుల బండరాళ్లను తరలించారు. ఇదే సమయంలో జనరల్‌ బెర్త్‌ నిర్మాణ పనులు, తీర ప్రాంతం పటిష్టం చేయడం, ఎన్‌హెచ్‌ 16ను అనుసంధానం చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. 

తొలి దశలో నాలుగు బెర్తులు 
పోర్టు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,361.91 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ల్యాండ్‌ లార్డ్‌ మోడల్‌ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ పోర్టు నిర్మాణ పనుల కాంట్రాక్టును విశ్వసముద్ర కన్సార్టియం చేపట్టింది. రూ. 2,949.70 కోట్ల వ్యయంతో తొలిదశలో నాలుగు బెర్తుల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పనను విశ్వసముద్ర అభివృద్ధి చేయనుంది. మొత్తం పోర్టు వార్షిక సామర్థ్యం 83.3 మిలియన్‌ టన్నులు కాగా తొలిదశలో నాలుగు బెర్తుల నిర్మాణంతో 23.5 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో పోర్టును అభివృద్ధి చేయనున్నారు.

మొత్తం నాలుగు బెర్తుల్లో రెండు జనరల్‌ కార్గోకు, ఒకటి బొగ్గు, ఇంకొకటి కంటైనర్‌తోపాటు ఇతర ఎగుమతి దిగుమతులకు వినియోగించనున్నారు. ఈ పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూలపేట పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరుతో ప్రత్యేకంగా కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రుణరూపంలో సమీకరిస్తున్నారు.  

596 కుటుంబాల తరలింపు 
పోర్టు నిర్మాణం కోసం విష్ణుచక్రం, మూలపేట గ్రామాలకు చెందిన 596 కుటుంబాలకు పునరావాస ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరిని ఒక కుటుంబంగా పరిగణించి వారికి కస్త నౌపాడ వద్ద పునరావాస గ్రామం అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ. 149 కోట్లు్ల వ్యయం చేస్తోంది.

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద అక్కడ 13 రకాల మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తోంది. ఇప్పటికే స్థలాన్ని చదును చేసి విద్యుత్, తాగునీరు కనెక్షన్లను ఏర్పాటు చేయడం పూర్తయింది. త్వరలోనే లాటరీ విధానంలో ప్లాట్‌ను కేటాయించి ఇంటి నిర్మాణాలను ప్రారంభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  

మూలపేట పోర్టు స్వరూపం
ప్రాజెక్టు వ్యయంరూ.4,361.91 కోట్లు 
తొలి దశ పోర్టు:23.5 ఎంటీపీఏ 
తుది దశ పోర్టు:83.3 ఎంటీపీఏ 
తొలి దశలో బెర్తుల సంఖ్య 4
నౌక పరిమాణం:1,20,000 డీడబ్ల్యూటీ 
అవసరమైన భూమి:1,254.72 ఎకరాలు 
దక్షిణ బ్రేక్‌ వాటర్‌:2,455 మీటర్లు 
ఉత్తర బ్రేక్‌ వాటర్‌: 580 మీటర్లు 
తీరం రక్షణ:1,000 మీటర్లు 
డ్రెడ్జింగ్‌: 15.85 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు 
అప్రోచ్‌ చానల్‌:3.3 కి.మీ 
నీరు: గొట్టా బ్యారేజీ నుంచి 0.5 ఎంఎల్‌డీ నీటి సరఫరా 
రైల్‌: 10.6 కి.మీ రైల్వే లైన్‌ నిర్మాణం 
రహదారి: ఎన్‌హెచ్‌16ను అనుసంధానం చేస్తూ 13.8 కి.మీ. నాలుగులేన్ల రహదారి నిర్మాణం 
కార్యకలాపాలు ప్రారంభం:    అక్టోబర్, 2025 

శ్రీకాకుళం ఇక సిరుల జిల్లా 
ఇంతకాలం శ్రీకాకుళం అంటే వలసలు గుర్తుకు వచ్చేవి. కానీ మూలపేట పోర్టు రాకతో స్థానికులు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. అంతేగాక వేరే ప్రాంతం వారికి కూడా ఇక్కడ ఉపాధి కల్పించే సిరుల జిల్లాగా రూపాంతరం చెందుతుంది. కేవలం పోర్టులే కాకుండా వాటిపక్కనే పోర్టు ఆధారిత పరిశ్రమలను ప్రమోట్‌ చేస్తున్నాం. కొత్తగా వస్తున్న నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్‌ హార్బర్లతో రాష్ట్రం గుజరాత్, మహారాష్ట్రలతో పోటీ పడుతుంది. రెండు లక్షల టన్నుల బరువు ఉండే భారీ ఓడలను తీసుకువచ్చే విధంగా ఈపోర్టులను అభివృద్ధి చేస్తున్నాం.  – కాయల వెంకటరెడ్డి, చైర్మన్‌ ఏపీ మారిటైమ్‌ బోర్డు 

6 నెలలు ముందుగానే అందుబాటులోకి పోర్టు 
శంకుస్థాపన జరిగిన 8 నెలల్లో రికార్డు స్థాయిలో పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే నార్త్‌ బ్రేక్‌ వాటర్‌ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. సౌత్‌ బ్రేక్‌ వాటర్‌ పనులు 50 శాతంపైగా పూర్తయ్యాయి. వాస్తవంగా ఈ ప్రాజెక్టును అక్టోబర్‌ 2025 నాటికి పూర్తి చేయాల్సి ఉండగా సీఎం ఆదేశాలు మేరకు ఆరు నెలలు ముందుగానే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఆ మేరకు ప్రణాళికలను సిద్ధం చేశాం. డ్రెడ్జింగ్‌ పనుల కోసం ప్రత్యేకంగా రూ. 350 కోట్లతో చైనా నుంచి డ్రెడ్జింగ్‌ మిషన్‌ కొనుగోలు చేశాం. త్వరలోనే డ్రెడ్జింగ్‌ పనులు ప్రారంభించనున్నాం.  –చావల బాబురావు, ఎండీ, మూలపేట పోర్టు  

భావితరాలకు మేలు చేకూరుతుంది 
భావితరాలకు మేలు చేకూరుతుందని మూలపేట పోర్టుకు మాభూములు, ఇళ్లు, గ్రామాన్ని ఇచ్చాము. జిల్లా అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యంగా ఉన్నందుకు గర్వంగా ఉంది. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. చెన్నై, హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్లకుండా ఇక్కడే పని దొరుకుతుంది. – గిన్ని భైరాగి, విష్ణుచక్రం గ్రామం 

పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది 
మూలపేట పోర్టు రావడం వల్ల మరికొన్ని అనుబంధ పరిశ్రమలు ఈ ప్రాంతానికి వస్తాయి. దీంతో పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది. యువకులకు ఉద్యోగ, ఉపాధి కలిగి వలసనివారణ జరుగుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని మా భూములను ప్రభుత్వానికి ఇచ్చాము.      – కనిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నౌపడ 

పోర్టుతో భూముల ధరలు పెరిగాయి 
మూలపేట పోర్టుతో ఈ ప్రాంత భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. సెంటు భూమి రూ. 1.50లక్షల నుంచి రూ. 2లక్షలు వరకు పెరిగింది. పోర్టు పూర్తి అయితే ఈ ప్రాంతం అంతా పారిశ్రామిక వాడగా మారుతుంది. నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి.  – కర్రి కాంతారావు, రైతు, నౌపడ  

Advertisement

What’s your opinion

Advertisement