టీడీపీ హయాంలో అరాచకాలు కనపడలేదా? | Sakshi
Sakshi News home page

టీడీపీ హయాంలో అరాచకాలు కనపడలేదా?

Published Wed, Nov 29 2023 5:01 AM

MLA Saiprasad Reddy Fire on Ramoji rao  - Sakshi

ఆదోని సెంట్రల్‌/ఆదోని టౌన్‌: భూ దందాలు, భూ ఆక్రమణలు అంటూ తప్పుడు వార్తలు రాసి ప్రజలను మభ్యపెట్టలేరని కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్‌రెడ్డి ఈనాడు పత్రికను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ఎవ­రు కబ్జాలు చేసినా ఎమ్మెల్యే కుటుంబంపై అభాండాలు వేయడమే పనిగా ఆ పత్రిక పెట్టుకుందన్నారు. టీడీపీ హయాంలో ఎన్ని భూ ఆక్రమణలు చేశారో? ఎన్ని డబుల్‌ రిజిస్ట్రేషన్లు చేశారో రామోజీకి కనపడలేదా అంటూ ఆయన ప్రశ్నించారు.

తన స్వగృహంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు తప్పుడు కేసులు నమోదు చేస్తూ, మట్కాను ప్రోత్సహిస్తూ, గాంబ్లింగ్, మద్యం అమ్మకాల్లో భాగస్వాములైనప్పుడు ఏనాడైనా ఈనాడు వాటి గురించి ప్రచురించిందా అని ప్రశ్నించారు. 352 సర్వే నంబర్‌లో 4.54 ఎకరాలను ఓపెన్‌ ప్లేస్‌గా చూపించి 1992లో ఎవరో వెంచర్‌ వేసి అమ్ముకున్నారని.. ఆ స్థలానికి చెందిన అసలైన వారసులు కోర్టుకు వెళ్లి పూర్తి హక్కులు తెచ్చుకుంటే రామోజీకి కడుపుమంటగా ఉందన్నారు.

గతంలో ఎవరైతే ఆ స్థలాలను కొన్న లబ్దిదారులున్నారో వారికి అన్ని విధాలా న్యాయం చేస్తామని చెప్పడం కూడా తప్పేనా అంటూ సాయిప్రసాద్‌రెడ్డి ప్ర చారు. వాస్తవాలను తెలుసుకోకుండా ఏది పడితే అది రాసి ఎంతకాలం పబ్బం గడుపుతారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఏనాడైనా మంచిగా రాశావా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంపై అభాండాలు వేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. 

రోత రాతలు మానుకుంటే మంచిది.. 
ఇక వైఎస్సార్‌సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏనాడు మట్కా, మద్యం, బెట్టింగ్‌లను ప్రోత్సహించలేదని.. ఎవరి మీది కూడా అక్రమ కేసులు బనాయించలేదని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలను చేసి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్న విషయం కనపడలేదా అని ప్రశ్నించారు. ఒక ఐపీఎస్‌ అధికారి బదిలీ అయితే తనపై నెపం పెట్టడం తగదన్నారు. తాను ఏనాడు ఫలానా అధికారిని బదిలీ చేయమని, ఫలాన అధికారిని పంపించమని ఎవరినీ అడిగిన దాఖలాలు లేవన్నారు.

ఇప్పటికైనా రామోజీ రోత రాతలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. వివాదాస్పద స్థల యజమాని అలిమ్‌ బాషా మాట్లాడుతూ.. తమ స్థలం తమకు ఇప్పించాలని గతంలో ఎవరి దగ్గరకు వెళ్లినా న్యాయం జరగలేదన్నారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని కలిసి విన్నవించగా.. ఆయన కోర్టుకు వెళ్లమని సూచించారని.. కోర్టుకు వెళ్లడంతో మాకు అనుకూలంగా తీర్పునిచ్చిందని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement