వంద ఎల్లో చానళ్లు వచ్చినా ఆ కుటుంబంతో బంధాన్ని విడదీయలేవు 

MLA Kethireddy Pedda Reddy seriously condemns stories telecasted in Yellow Media - Sakshi

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

సాక్షి, యల్లనూరు: ‘పచ్చ కామెర్లు వచ్చిన వాళ్లకు  లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట! అలా ఉంది ఏబీఎన్‌ చానల్‌ తీరు. తాడిపత్రి మునిసిపల్‌ చైర్మన్‌  జేసీ ప్రభాకర్‌రెడ్డి మోసాల గురించి నేను మాట్లాడిన మాటలను సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినట్లు ఆపాదించడం ఎంత వరకు సమంజసం’ అని  తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. సోమవారం ఏబీఎస్‌ చానల్‌లో ప్రసారమైన కథనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. యల్లనూరు మండలం తిమ్మంపల్లిలోని స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఆదివారం తాడిపత్రి ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ఆసరా సంబరాల్లో డ్వాక్రా మహిళలకు జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించానన్నారు. అదే సమయంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రజలకు చేసిన మోసాల గురించి కూడా చెప్పానన్నారు.

అయితే.. జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన మాటలను సీఎం గురించి మాట్లాడినట్లు ఆపాదించి.. తల, తోక లేని వీడియో క్లిప్పింగులను జత చేసి ఏబీఎన్‌ చానల్‌లో ప్రసారం చేయడం శోచనీయమన్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వీడియోను  ప్రసారం చేయాలని, అందులో తమ నాయకుడు వైఎస్‌ జగన్‌ పై తాను విమర్శలు చేసినట్లు  ఉంటే  రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని, లేకపోతే ఏబీఎన్‌ చానల్‌ను మూసేసుకోవడానికి సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. ఏబీఎన్‌లో ప్రసారమైన అసత్య కథనంపై చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. 

చదవండి: (పోలీసులపై నక్కా ఆనందబాబు జులం)

వంద చానళ్లు వచ్చినా వేరు చేయలేవు.. 
‘వైఎస్‌ కుటుంబం పట్ల కేతిరెడ్డి కుటుంబాలు ఏళ్లుగా విధేయత చూపుతున్నాయి. సాధారణ ఎన్నికల సమయంలో నా ఆరోగ్య పరిస్థితి బాగో లేకపోయినా మా నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాపై నమ్మకంతో ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారు. నాపై అంతటి నమ్మకం పెట్టుకున్న వ్యక్తిపై నేను విమర్శలు చేసినట్లు  అసత్య కథనాన్ని ప్రసారం చేయడం చాలా బాధ కలిగించింది. ఏబీఎన్‌ లాంటి వంద ఎల్లో చానళ్లు కలసి కట్టుగా పని చేసినా మా కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని వేరు చేయలేవు’ అని ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కంచం రామ్మోహన్‌ రెడ్డి, నాయకులు శివారెడ్డి, ఆర్‌సీ ఓబుల్‌ రెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top