
టీడీపీ ఎమ్మెల్యే బండారుని పడేసిన వైనం
తలో దిక్కుకు పరుగెత్తిన టీడీపీ నేతలు
ఆలమూరు: మూగజీవాలకూ తెలిసిపోయింది కూటమి హామీలు బూటకమని. టీడీపీ నేతల నాటకాలను జనం భరించినా మేం చూసి ఊరుకోలేమన్నట్లు రంకెలు వేశాయి. రైతు సంబరాల పేరిట టీడీపీ నిర్వహించిన కార్యక్రమం ఈ ఉదంతానికి వేదికగా నిలిచింది. టీడీపీ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఎడ్ల బండిపై నుంచి మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ హిట్, అన్నదాత సుఖీభవ అనగానే ఆ బండి ఎద్దులు ఒక్కసారిగా రంకెలు వేశాయి. కాడిని బలంగా గుంజుకున్నాయి. దీంతో బండిపై నుంచి కింద పడ్డ ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైతు సంబరాల కార్యక్రమంలో భాగంగా బుధవారం చొప్పెల్ల నుంచి ఆలమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వరకు టీడీపీ శ్రేణులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ నర్శిపూడి, నవాబుపేట, పెనికేరు, కలచవర్ల మీదుగా ఆలమూరుకు చేరుకుని సభకు వెళుతున్న తరుణంలో టీడీపీ నేతలు ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్.. అన్నదాత.. సుఖీభవ..’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఎక్కిన బండి లాగుతున్న ఎద్దులు ఒక్కసారిగా రంకెలేశాయి.
వెనక్కు తిరిగి పక్కనున్న వారిని ఎగిరి కాళ్లతో తంతూ పరుగుతీశాయి. దీంతో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పీఏసీఎస్ చైర్‌పర్సన్ ఆకుల రామకృష్ణ, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్‌రాజు కింద పడిపోయారు. వారిని కార్యకర్తలు పక్కకు తీసుకెళ్లి సపర్యలు చేశారు. తీవ్రంగా గాయపడ్డ సతీష్రాజును రావులపాలెం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రభుత్వంలో రైతులకు ఏం మేలు జరిగిందని ‘అన్నదాత.. సుఖీభవ’ అంటూ నినాదాలు చేశారని.. రైతులకు ఏం మేలు జరగలేదని మూగజీవాలకు కూడా తెలిసిపోయిందని పలువురు గుసగుసలు పోయారు.