బాబు పాలనలో వెంటిలేటర్‌పై వైద్యశాఖ | Minister Vidadala Rajini Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో వెంటిలేటర్‌పై వైద్యశాఖ

Oct 10 2022 7:45 AM | Updated on Oct 10 2022 10:12 AM

Minister Vidadala Rajini Slams Chandrababu Naidu - Sakshi

మార్కాపురం ఆస్పత్రిని ప్రారంభిస్తున్న మంత్రి రజిని. చిత్రంలో సురేశ్, బాలినేని తదితరులు

మార్కాపురం(ప్రకాశం జిల్లా): చంద్రబాబు పాలనలో వైద్య, ఆరోగ్యశాఖను వెంటిలేటర్‌పై ఉంచారని ఆ శాఖ మంత్రి విడదల రజిని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ శాఖకు జీవం నింపుతున్నారని, పేదలకు మేలుచేసే విషయంలో ఎవరైనా ఆయన తర్వాతనేనని చెప్పారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం, కొనకనమిట్ల, పొదిలి ఆస్పత్రుల్ని ఆదివారం ఆమె ప్రారంభించారు.

తొలుత మార్కాపురంలో రూ.80 లక్షలతో నిర్మించిన యూపీహెచ్‌సీని ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖకు చంద్రబాబునాయుడు చేసింది శూన్యమని, ఆయన రాష్ట్రానికి ఒక్క మెడికల్‌ కళాశాలను కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఆస్పత్రులు కట్టకుండా, ఉన్న ఆస్పత్రులను పట్టించుకోకుండా ఈ శాఖను నిర్వీర్యం చేశారన్నారు. అమరావతి రాజధాని పేరుతో పాదయాత్ర అంటూ ఓ బూటకపు నాటకానికి తెరలేపారని దుయ్యబట్టారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు మెరుగైన వైద్యం అత్యంత వేగంగా, సులువుగా, ఉచితంగా అందించేందుకు రూ.16 వేలకోట్లకు పైగా నిధులతో వైద్య వసతులు కల్పిస్తున్నారని చెప్పారు.

రూ.1,692 కోట్లతో గ్రామగ్రామాన వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు నిర్మిస్తున్నారన్నారు. రూ.8 వేలకోట్లకు పైగా నిధులతో 17 మెడికల్‌ కళాశాలలు నిర్మిస్తున్నారని తెలిపారు. 1,126 పీహెచ్‌సీలను కొత్తగా నిర్మించడం, లేదా ఆధునికీకరించడం కోసం రూ.665 కోట్లు ఖర్చుచేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా 184 యూహెచ్‌సీల ఆధునికీకరణ, 344 యూహెచ్‌ సీల నిర్మాణం కోసం రూ.392 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.  త్వరలో రానున్న ఫ్యామిలీ ఫిజిషియన్‌ విధానంలో ప్రభుత్వ వైద్యులు ఇళ్లకే వచ్చి వైద్యసేవలు అందిస్తారని ఆమె తెలిపారు. మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కె.పి.నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement