50 దేశాలతో మిలాన్‌–2024 | Milan 2024 with 50 countries | Sakshi
Sakshi News home page

50 దేశాలతో మిలాన్‌–2024

Published Mon, Dec 4 2023 5:30 AM | Last Updated on Mon, Dec 4 2023 8:44 AM

Milan 2024 with 50 countries - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా మిలాన్‌–2024 నిర్వహించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించినట్టు తూర్పు నావికా దళాధిపతి, వైస్‌ అడ్మిరల్‌ పెంథార్కర్‌ వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి 27 వరకూ మిలాన్‌ విన్యాసాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఏ సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారన్నారు.

ఈ భరోసాతో 50 దేశాలతో రికార్డు స్థాయిలో మిలాన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అన్ని దేశాలకు ఆహ్వానాలు పంపించామని.. ఇప్పటివరకూ 27 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్స్, ఎయిర్‌క్రాఫ్టŠస్‌ విన్యాసాల్లో పాల్గొననున్నట్లు స్పష్టమైన సమాచారం ఉందని వివరించారు.

నేవీ డే సందర్భంగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. తుపాను కారణంగా నేవీ డేను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేశామన్నారు. ఆ రోజున ముఖ్య అతిథిగా గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ హాజరవుతారని, ఈ విన్యాసాల్లో తొలిసారిగా స్వావలంబన్‌ పేరుతో టెక్నికల్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు.  

విశాఖ కేంద్రంగా నావికాదళం బలోపేతం 
విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న తూర్పు నౌకాదళం మరింత బలోపేతం కానుందని వైస్‌ అడ్మిరల్‌ పెంథార్కర్‌ పేర్కొన్నారు. ఐఎన్‌ఎస్‌ ఢిల్లీ, ఐఎన్‌ఎస్‌ ముంబై, ఐఎన్‌ఎస్‌ మైసూర్‌ యుద్ధ నౌకలు త్వరలోనే విశాఖ నుంచే కార్యకలాపాలు ప్రారంభించనున్నాయన్నారు. తూర్పు నౌకాదళం ప్రపంచ రక్షణ దళాల్లో కీలకంగా వ్యవహరించనుందని చెప్పారు.

భవిష్యత్‌లో భారత నౌకాదళంలో కీలక ప్రాంతంగా విశాఖపట్నం అభివృద్ధి చెందనుందని తెలిపారు. సముద్ర జలాల పరిరక్షణ, ప్రపంచ వాణిజ్య కార్యకలాపాలు సాగించే కీలకమైన భద్రతకు అవసరమైన షిప్‌లు, జలాంతర్గాములు, సర్వే వెస్సల్స్‌ వంటివి తూర్పు నౌకాదళంలో కేంద్రీకృతం కానున్నాయని వివరించారు. 

20కి పైగా స్వదేశీ యుద్ధ నౌకలు 
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న 20 నుంచి 25 యుద్ధ నౌకలు 2037 నాటికి తూర్పు నౌకాదళ అమ్ముల పొదిలో చేరనున్నాయని వైస్‌ అడ్మిరల్‌ చెప్పారు. ఇందులో నీలగిరి క్లాస్‌ ఫ్రిగేట్, నెక్స్‌ట్‌ జనరేషన్‌ కార్వెట్‌ క్లాస్‌ షిప్, డైవింగ్‌ సపోర్ట్‌ వెస్సల్స్, సర్వే వెస్సల్స్, యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్, వాటర్‌ క్రాఫ్ట్, న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ వంటివి రాబోతున్నాయని వివరించారు.

మల్టీ రోల్‌ 60ఆర్‌ 60ఆర్, అప్‌గ్రేడ్‌ చేసిన యాంటీ సబ్‌మెరైన్‌ కమోవ్‌ 28 హెలికాప్టర్లు, మీడియం లిఫ్ట్‌ ఇ–295 ఎయిర్‌క్రాఫ్ట్‌లు కూడా విశాఖలో కేంద్రీకృతం కానున్నాయన్నారు. సర్వే వెసెల్స్‌లో మొదటిది సంధాయక్‌ వచ్చే ఏడాది ప్రారంభంలో తూర్పు నౌకాదళ అమ్ముల పొదిలో చేరనుందన్నారు.

చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న దృష్ట్యా ఆ దేశ యుద్ధ నౌకలు, పరిశోధన నౌకలు, శాటిలైట్స్, ఇంటెలిజెన్స్‌ సమాచార షిప్స్, సబ్‌మెరైన్లను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. చైనా నుంచి ప్రతి కదలికనూ పసిగడుతున్నామన్నారు. డ్రగ్స్‌ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement