ఏపీ భవన్‌లో గౌతమ్‌రెడ్డి సంతాపసభ

Mekapati Goutham Reddy Mourning ceremony At AP Bhavan - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి సంతాప సభను న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీలు సత్యవతి, రెడ్డప్ప, తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్, సిబ్బంది పుష్పాంజలి ఘటించారు.

గౌతమ్‌రెడ్డి అకాల మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. బుధవారం నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌(మెరిట్స్‌) వద్ద అంత్యక్రియలు జరగనున్నాయి.

సంతాప సభలో ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. చురుకైన మంత్రిని కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మేకపాటి కుటుంబం, గౌతమ్‌రెడ్డి చేసిన కృషి అనన్య సామాన్యమని ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి మరణవార్త నిజం కాకుంటే బాగుండని అన్నారు. 

ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ.. అత్యంత క్రమశిక్షణ, ఎనర్జీ కలిగిన నేత గౌతమ్‌రెడ్డి, పాలిటెక్నిక్, ఐటిఐలను ఇంటిగ్రేట్ చేయాలన్న ఆలోచన చేశారని గుర్తుచేసుకున్నారు.  ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. తనను ఒక తమ్ముడి లాగా చూసేవారని, అనేక విషయాల్లో తనను గైడ్ చేశారని తెలిపారు. తిరుపతి ఎంఆర్ఓ సెంటర్ తీసుకురావడంలో ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. 

రాష్ట్రానికి అయిదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకువచ్చి నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని ఎంపీ రెడ్డప్పా గుర్తు చేసుకున్నారు. గౌతమ్ రెడ్డి మృతి అత్యంత దురదృష్టకరమని, చిన్న పరిశ్రమల బాగుకోసం పరితపించిన వ్యక్తి అని ఎంపీ చంద్రశేఖర్ అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. అందరికంటే ఫిట్‌గా ఉండే వ్యక్తి హఠాత్తుగా మృతిచెందడం జీర్ణించుకోలేకపోతున్నానని, ఈ వార్త అబద్దం అయితే బాగుండని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top