మాత, శిశు మరణాల కట్టడికి పటిష్ట చర్యలు

Medical department strong measures to prevent maternal child deaths - Sakshi

మరణాలపై ఆన్‌లైన్‌ పర్యవేక్షణ

ఎంపీసీడీఎస్‌ఆర్‌ పోర్టల్‌లో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు లాగిన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మాత, శిశు మరణాల కట్టడికి వైద్య శాఖ పటిష్ట చర్యలు చేపడుతోంది. మాత, శిశు మరణాల నమోదు, విశ్లేషణలో కచ్చితత్వం ఉండేలా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రవేశపెట్టిన ‘మెటర్నల్, పెరినాటల్‌ డెత్‌ సర్వేలెన్స్‌ అండ్‌ రెస్పాన్స్‌’ (ఎంపీసీడీఎస్‌ఆర్‌) పోర్టల్‌లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ఎన్‌రోల్‌ చేశారు. ఈ పోర్టల్‌కు సంబంధించి రాష్ట్ర స్థాయిలో డ్యాష్‌ బోర్డును ఏర్పాటు చేశారు. మాత, శిశు మరణాలకు సంబంధించి వివరాలు నమోదుకు ప్రతి ఆస్పత్రి, జిల్లాకు రెండు రకాల లాగిన్‌లు ఉంటాయి.

మాతృ మరణాలకు సంబంధించి లాగిన్‌లు కేటాయింపులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూలై  నెలల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 127 మాతృ మరణాలు సంభవించాయి. ఈ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. గతంలో మాత, శిశు మరణాలు సంభవిస్తే ఆఫ్‌లైన్‌ విధానంలోనే నమోదు ఉండేది. వీటిపై జిల్లా స్థాయిలో కలెక్టర్, డీఎంహెచ్‌వోలు మరణాలు సంభవించడానికి గల కారణాలపై సమీక్షించి.. తదుపరి ఆ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకుని చర్యలు తీసుకునేవారు.

అయితే నూతన విధానంలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సంభవించిన మాత, శిశు మరణాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ విధానంలో రాష్ట్రంలో ఏ జిల్లా, మండలం, గ్రామంలో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నది సులువుగా తెలుసుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా సంబంధిత జిల్లా అధికారులు మరణాల కట్టడిపై సమీక్షలు నిర్వహించారా లేదా అన్న అంశాలు రాష్ట్ర అధికారులకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది.

మరణాలు యాంటేనేటల్, పోస్ట్‌నేటల్‌లో సంభవిస్తున్నాయా, మరణాలు సంభవించడానికి గల కారణాలేమిటి, గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత, పౌష్టికాహారం లోపం, ఇతర కారణాలేమిటనేది సులువుగా విశ్లేషించడానికి వీలు కలుగుతోంది. ఆన్‌లైన్‌ విధానం వల్ల వివరాల నమోదు, సమాచార మార్పిడిలో గతంలో ఉండే కాలయాపన తగ్గడంతోపాటు, కచ్చితత్వం ఉండనుంది. 

ఏపీకి నాలుగో స్థానం
ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధతో ఇప్పటికే రాష్ట్రంలో మాత, శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. జాతీయ సగటు కన్నా రాష్ట్రంలో తక్కువగా మరణాలు ఉంటున్నాయి. ప్రతి లక్ష ప్రసవాలకు తల్లుల మృతుల సంఖ్య 70కి మించకూడదనేది నిబంధన. అయితే, జాతీయ స్థాయిలో సగటున ప్రతి లక్ష ప్రసవాలకు ప్రసూతి మరణాలు రేటు (ఎంఎంఆర్‌) 112గా ఉంది. రాష్ట్రంలో మాత్రం లక్ష ప్రసవాలకు ఇది 58గా నమోదైంది. ఈ క్రమంలో మాతృ మరణాల కట్టడిలో దేశంలోనే నాలుగో స్థానంలో మన రాష్ట్రం ఉంది. అదే విధంగా సగటున వెయ్యి ప్రసవాల్లో జాతీయ స్థాయిలో 30 మంది శిశువులు మరణిస్తున్నారు. రాష్ట్రంలో ఈ సంఖ్య 25గా ఉంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top