నేతలకు ఆదాయ వనరుగా పెద్దాస్పత్రులు
స్థానిక మందుల కొనుగోళ్లలో పారదర్శకతకు పాతర
గోప్యంగా ఆఫ్‌లైన్‌లో టెండర్‌లు
టెండర్‌లలో ఎక్కువ మంది పాల్గొనకుండా గూడుపుఠాణి
సాక్షి, అమరావతి: పేదల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వాస్పత్రులనూ అధికార పార్టీ నేతలు ఆదాయ వనరులుగా మార్చేసుకున్నారు. బైక్ పార్కింగ్, క్యాంటిన్, మందుల దుకాణాలు, సెక్యూరిటీ, శానిటేషన్ ఇలా ఏ ఒక్కటి వదలకుండా దోపిడీకి తెగబడుతున్నారు. ఈ క్రమంలో ‘స్థానిక మందులు, సర్జికల్స్, ఇంప్లాంట్స్ కొనుగోళ్ల కాంట్రాక్ట్‌లు’ తామనుకున్న వారికే కట్టబెట్టి పెద్దాస్పత్రుల నిధులను కొల్లగొట్టేస్తున్నారు.
దోపిడీ దారిది..
బోధనాస్పత్రులకు మందులు, సర్జికల్స్ సరఫరా కోసం కేటాయించే బడ్జెట్‌లో 20 శాతం నిధులను స్థానిక కొనుగోళ్లకు కేటాయిస్తారు. వీటితో పాటు ఆరోగ్యశ్రీ, హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ (హెచ్‌డీఎస్) ఫండ్స్ నుంచి ఏటా రాష్ట్రవ్యాప్త డీఎంఈ ఆస్పత్రుల్లో రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల విలువైన సర్జికల్స్, మందులు స్థానికంగా కొనుగోలు చేస్తుంటారు. ఈ మందులను గత ప్రభుత్వంలో ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా కేంద్రీకృత టెండర్లు పిలిచి సరఫరా చేశారు. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల మేరకు గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్(జీఎంపీ) ద్వారా నాణ్యమైన మందులు సరఫరా చేశారు. ఈ విధానాన్ని బాబు గద్దెనెక్కిన వెంటనే గతేడాది రద్దు చేసి, పాత విధానాన్ని పునరుద్ధరించారు. దీంతో అధికార పార్టీ నేతలు, వారితో చేతులు కలిపిన ఆస్పత్రి అధికారులు నచి్చన సంస్థలకు సరఫరా కాంట్రాక్ట్‌లు కట్టబెట్టడం కోసం టెండర్‌లలో గూడుపుఠాణి చేస్తున్నారు.
అడ్డదారుల కోసం ఆఫ్‌లైన్
లక్షల రూపాయల విలువగల పనులకు సైతం ఈ–ప్రొక్యూర్‌మెంట్‌లో జిల్లా స్థాయిలో టెండర్లు పిలుస్తారు. కానీ బోధనాస్పత్రులకు రూ. కోట్ల విలువైన మందుల సరఫరాకు సంబంధించిన స్థానిక టెండర్‌లను ఆఫ్‌లైన్‌లో చేపడుతున్నారు. పారదర్శకంగా ఆన్‌లైన్‌లో టెండర్‌లు పిలిస్తే తమ ఆటలు సాగవని, ఆఫ్‌లైన్ టెండర్‌ల రూ పంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల విస్తృత స్థాయిలో సంస్థలు బరిలో నిలవడం కుదరదు. ఇక ఒక్కో ఆస్పత్రిలో 1,500 నుంచి 2 వేలు రకాలకు పైగా మందులు, సర్జికల్స్‌కు ఆఫ్‌లైన్‌లో టెండర్‌లు పిలుస్తున్నారు.
బిడ్‌లకు స్వల్ప సమయం
ఎంఎస్‌ఐడీసీలో రాష్ట్ర వ్యాప్త టెండర్‌లలో పాల్గొనే సంస్థలు బిడ్‌లు వేయడానికి రెండు వారాల పైబడి సమయం ఇస్తుంటే బోధనాస్పత్రుల్లో మాత్రం 10 రోజుల సమయం ఇస్తున్నారు. టెండర్‌లలో ఎక్కువ సంస్థలు పాల్గొనడానికి వీల్లేకుండా ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ)లు రూ.5లక్షలు.. రూ.మూడు లక్షలు.. ఇలా ఇష్టారాజ్యంగా పెట్టేస్తున్నారు. పెద్ద మొత్తంలో మందుల సరఫరా కోసం ఎంఎస్‌ఐడీసీ పిలిచే టెండర్‌లలోనే ఈఎండీ రూ.3 లక్షలు ఉంటుండగా, కేవలం ఆస్పత్రి స్థాయిలో సరఫరా కోసం పిలుస్తున్న టెండర్లలోనూ భారీ మొత్తంలో ఈఎండీలు పెట్టడం గమనార్హం.
ఇక్కడ ‘ఈ–గవర్నెన్స్’ ఏమైంది బాబూ
ఉదయం లేచినప్పటి నుంచి ఏఐ, సాంకేతిక పరిజ్ఞానం, ఈ–గవర్నెన్స్ అంటూ సీఎం చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. అయితే పెద్దాస్పత్రుల విషయంలో ఆఫ్‌లైన్ టెండర్‌ల రూపంలో దోపిడీ జరుగుతుంటే మాత్రం మిన్నకుండిపోతున్నారు. వైద్య శాఖ ఉన్నతాధికారులు సైతం స్థానిక టెండర్‌లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోవడం లేదు. స్థానిక కొనుగోళ్లలో పారదర్శకత ఉండేలా ఆన్‌లైన్ విధానంలో టెండర్‌లు పిలవడం.. నాణ్యత లేని మందులు, సర్జికల్స్ సరఫరా చేసిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడం.. సకాలంలో సరఫరా చేయని వారిపై పెనాలీ్టలు విధింపు వంటి అంశాల విషయంలో ఏకీకృత విధానం తీసుకొచ్చేలా కనీసం ఆలోచన చేయడం లేదు. పై స్థాయిలో కనీస పర్యవేక్షణ, సమీక్ష కూడా లేకపోవడంతో మందుల మాటున దోపిడీకి పట్టపగ్గాలు లేకుండా పోతోంది.
కొటేషన్‌ల దోపిడీ సరేసరి..
శ్రీకాకుళం, కేజీహెచ్, కాకినాడల్లో ఇప్పటికే స్థానిక టెండర్ ప్రక్రియ ముగియగా, గుంటూరులో కొనసాగుతోంది. కర్నూల్‌లో స్థానిక మందుల కొనుగోళ్లకు ఇంకా టెండర్‌లే పిలవలేదు. ప్రస్తుతం కొనసాగుతున్నా, ముగిసిన టెండర్‌ల ప్రక్రియపై పలు ఆరోపణలున్నాయి. ఇలా మరికొన్ని ఆస్పత్రుల్లో టెండర్‌లు పిలవకుండా కొటేషన్ మీద మందులు కొనుగోళ్ల రూపంలో ప్రజాధనం లూటీ జరుగుతోంది. సాధారణంగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే కొటేషన్ విధానంలో కొనుగోళ్లు చేస్తుంటారు. తాజాగా కొటేషన్‌ల దోపిడీ సాగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.


