
వైఎస్ జగన్‌కు వినతిపత్రం అందజేస్తున్న రేషన్ వాహనాల డ్రైవర్ల యూనియన్ కృష్ణా జిల్లా నాయకులు
రైతులు, రేషన్ వాహనాల డ్రైవర్లకు వైఎస్ జగన్ భరోసా
తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ అధినేతను కలిసి గోడు వెళ్లబోసుకున్న బాధితులు
పంటలకు గిట్టుబాటు ధర లేదని వాపోయిన అన్నదాతలు.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన
వైఎస్సార్‌సీపీ రైతుల పక్షాన పోరాడుతుందని అభయమిచ్చిన జగన్
ఇంటింటికీ సరుకులివ్వాలన్న గొప్ప ఉద్దేశంతో రేషన్ వాహన వ్యవస్థను తెచ్చింది మీరే
కానీ, కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది.. జీవనోపాధి లేకుండా చేసింది
జగన్‌తో మొరపెట్టుకున్న రేషన్ వాహన డ్రైవర్లు
సాక్షి, అమరావతి: ‘మీరు ఎవరూ అధైర్యపడొద్దు... వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది’ అని రైతులు, ఇంటింటికీ రేషన్ వాహనాల(ఎండీయూ) డ్రైవర్లకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయనను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కోకో, అయిల్‌పామ్, పొగాకు రైతులు, రేషన్ వాహనాల(ఏపీ ఎండీయూ–మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) డ్రైవర్ల యూనియన్ కృష్ణా జిల్లా ప్రతినిధులు కలిశారు. ‘మేం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది’ అని రైతులు వాపోయారు. దీంతో అన్నదాతలకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ భరోసాగా ఉంటుందని, వారి పక్షాన పోరాడుతుందని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
⇒ ఇంటింటికీ నిత్యావసర సరుకులు అందించాలన్న గొప్ప ఉద్దేశంతో రేషన్ వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసి... 9,260 మంది కుటుంబాలకు ఉపాధి కల్పించి, తమను ఆదుకున్నది మీరేనంటూ వైఎస్ జగన్‌కు రేషన్ వాహనాల డ్రైవర్లు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని, రేషన్ వాహనాల డ్రైవర్లను తొలగించి జీవనోపాధి లేకుండా చేసిందని వాపోయారు. తమతోపాటు దాదాపు 10 వేలమంది హెల్పర్ల కుటుంబాలు కూడా కూటమి ప్రభుత్వ నిర్వాకంతో రోడ్డున పడ్డాయని గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి అండగా ఉంటామని వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు.
ఆయిల్‌పామ్ రైతులకు ఏమీ మిగలడం లేదు
నాకు నాలుగెకరాల ఆయిల్‌పామ్ తోట ఉంది. గతంలో సీజన్ లేనప్పుడు పామాయిల్ టన్ను రూ.21,400 ఉండేది. ఇప్పుడు రూ.18,600కు పడిపోయింది. పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులకు ఏం మిగలడం లేదు. ఇంకా ధర తగ్గితే మేం పూర్తిగా నష్టపోతాం. దయచేసి టన్నుకు కనీసం రూ.20 వేల మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లాం. అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.
– అన్నవరపు గణేష్, రైతు, రావికంపాడు, చింతలపూడి నియోజకవర్గం, ఏలూరు జిల్లా
ధర్నాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు
మేం కోకో రైతులం. వైఎస్ జగన్‌కు మా సమస్యను వివరించాం. కోకోను ప్రైవేట్ కంపెనీలు గతంలో కేజీ రూ.వెయ్యికి కొనుగోలు చేశాయి. ఈసారి సీజన్ ప్రారంభంలో కేజీకి రూ.750 ఇచ్చి.. ఇప్పుడు రూ.400కి తగ్గించేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం కేజీ రూ.850కి అమ్ముతుంటే ఇక్కడ మాత్రం సిండికేట్ అయి రూ.300–400 మధ్య కొంటున్నారు. అదికూడా టీడీపీకి చెందిన రైతుల దగ్గరే కొంటున్నారు. పైగా నిరుడు ధర పలికిందని ఈ ఏడు కౌలు రేట్లు కూడా పెంచడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. రైతులంతా ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలాగైతే ఏం కావాలి? వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులం అని మా దగ్గర కొనడం లేదు. ఇవన్నీ వైఎస్ జగన్‌కు వివరించాం. మా సమస్యలు విన్న ఆయన తప్పనిసరిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. – తాతా రవి, రైతు, బాదరాల గ్రామం, ఏలూరు జిల్లా

కూటమి ప్రభుత్వం నిలువునా ముంచేసింది
కూటమి ప్రభుత్వం రేషన్ వాహనాల డ్రైవర్లను నిలువునా ముంచింది. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రేషన్ వాహనాలు ఉన్న సమయంలో బియ్యం పక్కదోవ పట్టాయన్నారు. కానీ.. ఈ నెలలో రేషన్ షాప్‌ల ద్వారా పంపిణీ చేస్తున్నా రాష్ట్రంలో అనేకచోట్ల బ్లాక్ మార్కెట్‌కు తరలుతూ పట్టుబడ్డాయి. ప్రభుత్వ పెద్దలు ఇప్పుడేం సమాధానం చెబుతారు? మాకు వాహన రుణాలు క్లియర్ చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థను నిరీ్వర్యం చేశారు. ప్రజలు రేషన్ షాప్‌ల వద్ద క్యూలైన్లలో నిల్చోలేకపోతున్నామని వాపోతున్నారు. పైగా సర్వర్లు పనిచేయడం లేదని డీలర్లు మళ్లీమళ్లీ తిప్పించుకుంటున్నారు. మేం వైఎస్ జగన్‌ను కలిసి సమస్యలు వివరించాం. తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. – పి.శ్యాంబాబు, రేషన్ వాహనాల డ్రైవర్ల యూనియన్ కృష్ణా జిల్లా ప్రెసిడెంట్