మరుగుజ్జు గెలాక్సీల్లోనూ భారీగా బ్లాక్‌హోల్స్‌! | Massive black holes also exist in dwarf galaxies | Sakshi
Sakshi News home page

మరుగుజ్జు గెలాక్సీల్లోనూ భారీగా బ్లాక్‌హోల్స్‌!

Feb 23 2025 5:10 AM | Updated on Feb 23 2025 5:10 AM

Massive black holes also exist in dwarf galaxies

1,15,000 మరుగుజ్జు గెలాక్సీలలో 2 శాతం బ్లాక్‌ హోల్స్‌ గుర్తింపు  

భారతీయ ఖగోళ శాస్త్రవేత్త రాగదీపిక అద్భుత ఆవిష్కరణ 

గెలాక్సీలు, బ్లాక్‌ హోల్స్‌లలో ఏవి ముందన్న అంశంలో కీలక ముందడుగు 

తన పరిశోధన వివరాలను ‘సాక్షి’తో పంచుకున్న గుంటూరు జిల్లా తెనాలి వాసి    

తెనాలి: అమెరికాలోని సాల్ట్‌లేక్‌ సిటీలోని  ఉటా విశ్వవిద్యాలయంలో పోస్ట్‌ డాక్టోరల్‌ పరిశోధన చేస్తున్న  గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్‌ రాగదీపిక పుచ్చా బ్లాక్‌హోల్స్‌కు సంబంధించిన అద్భుతమైన అంశాన్ని ఆవిష్కరించారు. దాదాపు అన్ని భారీ గెలాక్సీల కేంద్రాల్లోనూ సూపర్‌ మాసివ్‌ బ్లాక్‌హోల్స్‌ ఉన్నట్టు ఇప్పటికే కనుగొనడం జరిగింది. అయితే  మరుగుజ్జు గెలాక్సీల్లోనూ  పెద్దసంఖ్యలో 2,500 బ్లాక్‌హోల్స్‌ను కనుగొని, వాటిల్లోనూ బ్లాక్‌హోల్స్‌ సర్వసాధారణమని రాగదీపిక తేల్చారు. 

‘గెలాక్సీలు ముందా? బ్లాక్‌హోల్స్‌ ముందా?’ అనే శాస్త్ర ప్రపంచం ఎదుట ఉన్న పెద్ద పజిల్‌ అన్వేషణలో ఇదో పెద్ద ముందడుగని రాగదీపిక చెప్పారు. తన పరిశోధన అంశాలను ఇటీవల అమెరికాలో విడుదల చేసిన ఆమె, ఈ సందర్భంగా ఆయా వివరాలను ‘సాక్షి’కి  పంపారు. కొన్ని వివరాలను పరిశీలిస్తే..

» ఆరిజోనా, మాయల్‌ టెలిస్కోపీలోని ‘డార్క్‌ ఎనర్జీ స్పె్రక్టాస్కోపిక్‌ ఇన్‌స్ట్రుమెంట్‌’ (దేశీ) ప్రాజెక్టు 30 మిలియన్‌ గెలాక్సీలను పరిశీలిస్తోంది.  

» ఈ క్రమంలో ఎప్పటికప్పుడు డేటాను భద్రపరుస్తోంది. 

» ‘మరుగుజ్జు గెలాక్సీలు’ వ్యవస్థల్లో బ్లాక్‌హోల్స్‌ (కృష్ణబిలాలు) అన్వేషణలో ఉన్న డాక్టర్‌ రాగదీపిక నేతృత్వంలోని బృందం ‘దేశీ’ సేకరణలోని అంశాలను పరిశోధించింది.  

» ఆ అధ్యయనంలో భాగంగా దాదాపు 1,15,000 మరుగుజ్జు గెలాక్సీల్లో దాదాపు రెండు శాతం క్రియాశీల బ్లాక్‌హోల్స్‌ను కనుగొంది.  

» భారతదేశానికి చెందిన నోబెల్‌ బహుమతి గ్రహీత ఎస్‌.చంద్రశేఖర్‌ 50 ఏళ్ల క్రితం తొలిసారి బ్లాక్‌హోల్స్‌ సమాచారాన్ని అందించారు.  

దేశం తరఫున ఏకైక తెలుగమ్మాయి... 
మరుగుజ్జు నక్షత్ర మండలాల (డ్వార్ఫ్‌ గెలాక్సీస్‌)పై భారతదేశం నుంచి పరిశోధన చేస్తున్న ఏకైక తెలుగమ్మాయి రాగదీపిక పుచ్చా. సొంతూరు తెనాలి. తండ్రి రాజగోపాల్‌ కేంద్ర సర్వీసులో విశ్రాంత సివిల్‌ ఇంజినీరు. తల్లి కనకదుర్గ శాస్త్రీయ సంగీతం (వీణ) గురువు. పశ్చిమబెంగాల్‌లోని శాంతినికేతన్‌ విశ్వవిద్యాలయం విశ్వభారతిలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్‌లో టాపర్‌గా నిలిచారు రాగదీపిక.  

అహ్మదాబాద్, నైనిటాల్, ముంబైలోని ప్రసిద్ధ పరిశోధన సంస్థల్లో సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ చేసి, చివరి ఏడాది బెంగళూరులోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌’లో ‘సూర్యుడి మచ్చలు’పై  థీసిస్‌ చేశారు. జర్మనీలోని ‘మాక్స్‌ ఫ్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సోలార్‌ సిస్టమ్‌ రీసెర్చ్‌’లో గెస్ట్‌ సైంటిస్ట్‌గా సూర్యుడిపై పరిశోధనలు కొనసాగించారు. 

యూనివర్శిటీ ఆఫ్‌ ఆరిజోనాలో ‘ఆ్రస్టానమి అండ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌’లో ఎంఎస్‌ చేశారు. 2023లో అదే యూనివర్శిటీ నుంచి ‘మరుగుజ్జు గెలాక్సీలు–బ్లాక్‌హోల్స్‌’పై డాక్టర్‌ స్టెఫానీ జునో, డాక్టర్‌ అర్జున్‌ డే మార్గదర్శకత్వంలో సమర్పించిన థీసిస్‌కు పీహెచ్‌డీ స్వీకరించారు.  

శాస్త్ర ప్రపంచంలో ఇదే తొలిసారి 
మరుగుజ్జు గెలాక్సీల్లో బ్లాక్‌హోల్స్‌ను ఇంత భారీ సంఖ్యలో కనుగొనటం శాస్త్ర ప్రపంచంలో ఇదే ప్రథమం. మా బృందం నాలుగు వేలకన్నా ఎక్కువ గెలాక్సీల్లోని బ్లాక్‌హోల్స్‌ ద్రవ్యరాశిని కూడా నిర్ణయించింది. సూర్యుడి కంటే దాదాపు 1,000 నుంచి మిలియన్‌ రెట్ల ద్రవ్యరాశి కలిగిన ఇంటర్మీడియట్‌ బ్లాక్‌హోల్స్‌నూ శోధించింది.  

‘దేశీ’ డేటాతో మా బృందం దాదాపు 300 డిటెన్షన్లను ఆవి­ష్క­రించింది.  దీని ఫలితంగా విశ్వంలో మొదటి బ్లాక్‌çహోల్స్‌ సాపేక్షికంగా తేలికైనవని తెలుస్తోంది. ‘దేశీ’తో ఇప్పటివరకు గెలాక్సీలలో అతి తక్కువ ద్రవ్యరాశి గల 2,500 బ్లాక్‌హోల్స్‌ను మేం కనుగొన్నాం. ఇది ఉత్తేజకరమైన ఫలితం. గెలాక్సీలు...బ్లాక్‌హోల్‌...వీటిలో ఏది ముందు? అనేది శాస్త్ర ప్రపంచానికి పెద్ద ప్రశ్న. 

గెలాక్సీలు, బ్లాక్‌హోల్స్‌ పరిణామ క్రమాన్ని విశ్లేషించటానికి, విశ్వంలో తొలి బ్లాక్‌హోల్స్‌ ఎలా ఏర్పడ్డాయనేది తెలుసుకునేందుకు మా అధ్యయనం ఉపకరిస్తుంది.  బ్లాక్‌హోల్స్‌ను విడిగా కాకుండా ఒక సమూహంగా అధ్యయనం చేయడాన్ని ఇక ప్రారంభించవచ్చు.   – డాక్టర్‌ రాగదీపిక పుచ్చా, ఖగోళ శాస్త్రవేత్త   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement