చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో పడిగాపులు కాస్తున్న రైతులు
మాటల్లోనే మద్దతు ధర
సిండికేట్‌గా మారిన ఫ్యాక్టరీలతో చంద్రబాబు ప్రభుత్వం కుమ్మక్కు!
గుజ్జు నిల్వలు లేకపోయినా కొనుగోలుకు ఫ్యాక్టరీలు విముఖత
ఫలితంగా ఈ ఏడాదీ కొనేవారు లేక తల్లడిల్లుతున్న మామిడి రైతులు
మార్కెట్‌లో మద్దతు ధర దక్కక తీవ్ర ఆందోళన
ర్యాంపుల వద్ద టన్ను రూ.3–5 వేలకు మించి పలకని ధర
టన్ను రూ.5–6 వేలకు మించి కొనుగోలు చేయని ఫ్యాక్టరీలు
ఇంకా ధర తగ్గించేలా దళారుల మాయాజాలం
మార్కెట్‌లో రూ.7 వేల ధర పలుకుతోందంటున్న ప్రభుత్వం
చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని 44 గుజ్జు ఫ్యాక్టరీల్లో 7 మాత్రమే ప్రాసెసింగ్
ప్రభుత్వ అనుకూల రైతులకే టోకెన్లు.. అయినా ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు
పెట్టుబడి, రవాణా ఖర్చు కూడా రావడం లేదని లబోదిబోమంటున్న అన్నదాతలు
ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని రైతుల డిమాండ్
మామిడి బోర్డు ఏర్పాటు చేయాలంటున్న రైతు సంఘాలు
సర్కారు నిర్వాకంతో ఇప్పటికే తీవ్ర నష్టాల్లో శనగ, మొక్కజొన్న, అరటి, పొగాకు రైతులు
ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేక ఉక్కిరిబిక్కిరి
రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు వ్యవసాయాన్ని దండగమారి పనిగా మార్చేసింది. రైతులను సాగుకు దూరం చేస్తోంది. వ్యాపారులు, దళారులకు మాత్రమే లాభాలొచ్చేలా వారికి అనుకూల చర్యలు తీసుకుంటోంది. చెప్పే మాటలకు, ఇచ్చే హామీలకు ఆచరణలో ఎక్కడా పొంతన లేకుండా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేకుండా చేసింది. తోతాపురి రైతులకు గత ఏడాది చుక్కలు చూపించి, పంటను రోడ్డుపాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఈ ఏడాదీ అదే వైఖరిని అవలంబిస్తోంది. ఫలితంగా తమది దళారీ మద్దతు ప్రభుత్వం అని చాటుకుంటోంది.
సాక్షి, అమరావతి: తోతాపురి మామిడి రైతులు మరోసారి చంద్రబాబు ప్రభుత్వం చేతిలో మోసపోయారు. గతేడాది కూడా సర్కారు నిర్లక్ష్యం వల్ల రవాణా చార్జీలు కూడా గిట్టుబాటు కాక రైతులు మామిడి కాయలను రోడ్లపై పారబోసి వెళ్లడం తెలిసిందే. ఈ ఏడాది కూడా తోతాపురి రకం మామిడి రైతులకు ప్రభుత్వం మొద్దు నిద్ర శాపంగా మారింది. నిజంగా మేలు చేసే ఆలోచన ఉంటే.. గతేడాది ఎదురైన అనుభవాలు పునరావృతం కాకుండా సీజన్ రాక ముందు నుంచే తగిన కార్యాచరణతో ముందుకెళ్లేది.
పంట కోతకొచ్చే వేళ రైతులు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేది. కానీ రైతుల సంక్షేమమే తమ లక్ష్యమని పైకి చెబుతూ ఆచరణలో మాత్రం దళారీలు, వ్యాపారులకు కొమ్ముకాస్తూ సంక్షోభంలో ఉన్న రైతులను గాలికొదిలేయడం పరిపాటిగా మారింది. ప్రస్తుత రబీ సీజన్‌లో ఇప్పటికే శనగ, మొక్కజొన్న, అరటి, పొగాకు రైతులు మద్దతు ధర లేక, కొనే వారు లేక తీవ్ర నష్టాల పాలై అప్పుల ఊబిలో కూరుకుపోయారు. విలవిల్లాడుతున్న వీరిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. ఇదే క్రమంలో తోతాపురి మామిడి రైతుల జీవితాలతో కూడా చలగాటమాడుతోంది.
ఈ ఏడాది కూడా ధర లేక, కొనేవారు ముందుకు రాక.. తీవ్రంగా నష్టపోతున్న తోతాపురి రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సిండికేట్‌గా మారిన గుజ్జు ఫ్యాక్టరీల దోపిడీకి అడ్డుకట్ట వేయకుండా వారికి వంతపాడడంతో తోతాపురి రైతులు మరోసారి నష్టాలపాలవుతున్నారు. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో ఆశించిన దిగుబడులు రాక ఓ వైపు సతమతమవుతూనే, మరో వైపు అరకొరగా చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.
మార్కెట్‌లో టన్ను రూ.7 వేలు ధర పలుకుతుందని ప్రభుత్వం చెబుతుండగా, క్షేత్ర స్థాయిలో ర్యాంపుల వద్ద టన్ను రూ.4 వేల నుంచి రూ.5 వేల మధ్య మాత్రమే ధర పలుకుతోంది. పంట కొనుగోలుకు మెజార్టీ ఫ్యాక్టరీలు ముఖం చాటేస్తుంటే.. మరికొన్ని ఫ్యాక్టరీలు రైతుల నుంచి సేకరించే మామిడికి ఎంత ధర చెల్లిస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.
గతేడాది పోరుబాట
రాష్ట్రంలో దాదాపు 9 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతుండగా, ఈ ఏడాది 45 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అకాల వర్షాలు, ఈదురు గాలుల ప్రభావంతో కనీసం 30 లక్షల టన్నుల దిగుబడులు కూడా రాలేదని చెబుతున్నారు. హెక్టార్‌కు 10–15 టన్నులకు మించి రాలేదని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది తీవ్రమైన మంచుతో మంగు తెగులు వ్యాపించి, సీజన్‌లో బంగినపల్లితో సహా అన్ని రకాల టేబుల్ కాయలకు (కవర్ తొడిగిన కాయలు తప్ప) ధర లేకుండా పోయింది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 2.20 లక్షల ఎకరాల్లో తోతాపురి మామిడి సాగవుతోంది.
ఈ ఏడాది తోతాపురి దిగుబడులు 7.80 లక్షల టన్నులకుపైగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ మూడు జిల్లాల్లో గతేడాది మామిడి కాయలు కొనేందుకు గుజ్జు పరిశ్రమలు పూర్తిగా ముఖం చాటేయడంతో రైతులు తీవ్రంగా నష్ట పోయారు. 2023–24 సీజన్‌లో టన్ను రూ.25–30 వేల మధ్య పలికిన టేబుల్ రకం తోతాపురికి గతేడాది టన్ను రూ.4–5 వేలకు మించి దక్కలేదు. దీంతో రైతులు రోడ్డెక్కి ఆందోళన బాటపట్టారు. వేలాది టన్నుల మామిడిని రోడ్లపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు.
ఫ్యాక్టరీల ఎదుట ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. మరోవైపు మామిడి రైతులకు అండగా వైఎస్సార్ సీపీ, రైతు సంఘాలు పోరుబాట పట్టాయి. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బంగారు పాళ్యం మామిడి మార్కెట్‌కు వెళ్లి బాసటగా నిలవడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. చివరికి టన్ను రూ.12 వేల చొప్పున కొనిపిస్తామని నమ్మబలికింది. కానీ ఈ ధరకు కొనేందుకు ఫ్యాక్టరీలు ముందుకు రాకపోవడంతో చేసేది లేక కనీసం టన్నుకు రూ.8 వేలు ఇవ్వాలని, మిగిలిన రూ.4 వేలు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందజేస్తుందని చెప్పింది.
ప్రభుత్వాదేశాలను పట్టించుకోని ఫ్యాక్టరీలు టన్నుకు రూ.4–6 వేల ధరతోనే కొనుగోలు చేశాయి. టన్నుకు రూ.4 వేల చొప్పున ఇచ్చేందుకు రూ.260 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టిన ప్రభుత్వం చివరికి నాలుగు నెలల తర్వాత రూ.173 కోట్లతో సరిపెట్టింది. కానీ కంపెనీల నుంచి రైతులకు దాదాపు రూ.300 కోట్లకు పైగా పేరుకుపోయిన బకాయిల కోసం ఎన్నిసార్లు వినతులిచ్చినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. గతేడాది ప్రభుత్వ నిర్వాకం కారణంగా వేలాది ఎకరాల్లో మామిడి తోటలను రైతులు స్వచ్ఛందంగా తొలగించేశారు.
ఈ ఏడాదీ అదే తీరు
కనీసం ఈ ఏడాదైనా తమ తలరాత మారుతుందని దాదాపు 60 వేల మంది తోతాపురి మామిడి రైతులు ఆశగా ఎదురు చూశారు. కానీ వారి ఆశలపై చంద్రబాబు ప్రభుత్వం మరోసారి నీళ్లు చల్లింది. సిండికేట్‌గా మారిన ఫ్యాక్టరీలతో చంద్రబాబు సర్కార్ కుమ్మక్కైంది. మంత్రులతో పాటు ఆయా జిల్లాల అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు వారు అడిగినంత ముట్టజెప్పడంతో ఏ ఒక్కరూ నోరు మెదపని పరిస్థితి నెలకొంది. సమీక్షలు కూడా మొక్కుబడి తంతుగా మారాయి తప్ప రైతులకు గిట్టుబాటు ధర కల్పించే దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.
ఫలితంగా ఈ ఏడాది కూడా తోతాపురికి మార్కెట్‌లో ధర లేకుండా పోయింది. దీంతో పక్వానికి వచ్చిన పండ్లను ఏం చేయాలో పాలుపోని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిధిలో 44 గుజ్జు ఫ్యాక్టరీలుండగా, ప్రస్తుతం కేవలం ఏడు ఫ్యాక్టరీల్లో మాత్రమే ప్రాసెసింగ్ ప్రారంభమైంది. కనీసం టన్నుకు రూ.20 వేలు చెల్లిస్తే కానీ గిట్టుబాటు కాదని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది కేంద్రం టన్నుకు రూ.14.80 వేలు ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.12 వేల చొప్పున మద్దతు ధర ప్రకటించింది.
పెరిగిన ఖర్చులను దృష్టిలో పెట్టుకొని గతేడాది మద్దతు ధర రూ.12 వేలకు మరో రూ.4 వేలు కలిపి ఈసారి రూ.16 వేలకైనా ఫ్యాక్టరీలు కొనుగోలు చేస్తాయని రైతులు ఆశగా ఎదురు చూశారు. కానీ క్షేత్ర స్థాయిలో ర్యాంపుల వద్ద టన్నుకు రూ.3–5 వేల మధ్య చెల్లిస్తుండగా, ఫ్యాక్టరీలు మాత్రం రూ.5–6 వేలకు మించి కొనే పరిస్థితి కన్పించడం లేదు. ఫ్యాక్టరీ వద్ద వందలాది మామిడిలోడులతో కూడిన వాహనాలు బారులు తీరాయి. ఈసారి టోకెన్ విధానం తీసుకురావడంతో పాటు కూటమి నేతల సిఫార్సులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
టోకెన్‌తో తీసుకెళ్లినా మూడు నాలుగు రోజులకు కానీ అన్ లోడింగ్ చేయడం లేదు. పైగా అర టన్ను నుంచి టన్ను కాయలను నాణ్యత లేమి సాకుతో పక్కకు తోసేస్తున్నారు. సామాన్య రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. టోకెన్ల కోసం వారు పడే పాట్లు వర్ణానాతీతం. వాస్తవానికి గతేడాది గుజ్జు నిల్వలున్నాయనే సాకుతో కొనుగోలు చేయలేదు. కానీ ఈ ఏడాది ఏ ఒక్క ఫ్యాక్టరీ వద్ద గుజ్జు నిల్వలు 10–15 శాతానికి మించి లేవు. పశ్చిమాసియా దేశాల యుద్ధాన్ని సాకుగా చూపి రైతులను దెబ్బ తీయాలని చూస్తున్నారు.

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో మామిడి గుజ్జు పరిశ్రమ గేటు బయట పడిగాపులు కాస్తున్న రైతులు
తమిళనాడులోని క్రిష్ణగిరిలో టన్నుకు రూ.6 వేలు ధర పలుకుతుండగా, ఏపీలో మాత్రం ఫ్యాక్టరీలకు ఆర్డర్లు రావడం లేదని సాకులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలను పూర్తి స్థాయిలో తెరవకుండా ధరలను మరింత తగ్గించేలా కుట్ర పన్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 35 ఫ్యాక్టరీలుంటే 5 ఫ్యాక్టరీలే ప్రస్తుతం మామిడిని కొనుగోలు చేస్తున్నాయి.
ఎగుమతి రకాలకూ ధర లేని పరిస్థితి
ఎగుమతి రకాలకు సైతం ఈ ఏడాది ధర లేదు. రాయలసీమ జిల్లాల్లో తోతాపురి తర్వాత ఎక్కువగా సాగయ్యే బేనీషా రకానికి టన్నుకు రూ.15–25 వేలు లభిస్తుండగా, కవర్లు కట్టిన కాయలకు రూ.30 వేల నుంచి రూ.35 వేలు దక్కుతోంది. అల్ఫోన్సో, కాదర్, మల్లిక రకాలు టన్ను రూ.25–35వేలు పలుకుతుండగా, కాలేపాడు రకానికి రూ.30–40 వేల మధ్య ధర పలుకుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సాగులో ఉన్న బంగినపల్లి రకాలకు సైతం ఈసారి ధర లేని పరిస్థితి నెలకొంది. 2023–24లో టన్ను గరిష్టంగా రూ.50–60 వేల మధ్య పలికిన బంగినపల్లి రకాలకు గతేడాది రూ.30–35 వేలు పలుకగా, ఈ ఏడాది కేవలం రూ.15–20 వేలకు మించి పలకడం లేదు.
సంక్షోభంలో శనగ, మొక్కజొన్న, అరటి, పొగాకు రైతులు
మంచి దిగుబడినిచ్చే రబీ పంటలలో శనగ రైతులు 7 లక్షల టన్నులు ఉత్పత్తి చేశారు. 2023–24 మార్కెటింగ్ సీజన్‌లో క్వింటా రూ.8 వేలకు పైగా అమ్ముకుంటే ఈ ఏడాది రూ.5 వేలు కూడా దక్కలేదు. మొక్కజొన్న రైతులు 42 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తే కనీస మద్దతు ధర రూ.2,400 చొప్పున దక్కాల్సి ఉండగా, మార్కెట్‌లో రూ.1,400–1,600 మధ్య తెగనమ్ముకున్నారు. ఫలితంగా క్వింటాకు రూ.800 నుంచి రూ.1,000 మేర నష్టపోయారు. అరటి రైతులు 88 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తే టన్ను రూ.5 వేలకు మించి పలకలేదు. పొగాకు రైతులు 266 మిలియన్ కేజీలు ఉత్పత్తి చేస్తే 2023–24 మార్కెటింగ్ సీజన్‌లో సగటున కిలో రూ.288 ధర లభిస్తే, ప్రస్తుతం రూ.235కు మించి లభించలేదు.
సీఎం సొంత జిల్లా.. అయినా ఏం లాభం?
మామిడికి ఎందుకు మద్ధతు ధర ఇవ్వడం లేదు? కనీసం కేజీకి రూ.10 అయినా ఇచ్చి ఉంటే కొంచెం ఊరటగా ఉండేది. పురుగు మందులు, ఎరువుల ధరలు బాగా పెరిగాయి. ఫ్యాక్టరీకి వస్తే.. కాయలు దింపడానికి మూడు రోజులు పడుతోంది. నిద్రలేక ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం. సీఎం పది రోజులకు క్రితం జిల్లాకు వచ్చారు. పరిస్థితి తెలుసుకున్నా చర్యలు తీసుకోలేదు. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. సీఎం సొంత జిల్లాగా ఉండి ఏం ప్రయోజనం? వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ కేజీ రూ.15కు తగ్గలేదు. – యుగంధర్‌రెడ్డి, పెద్దమిట్టపల్లి, చిత్తూరు జిల్లా
సిఫార్సులుంటే టోకెన్లు
నాలుగు సార్లు మందులు కొట్టాలి. ఎరువులు వేయాలి. పెట్టుబడి తడిసి మోపెడవుతోంది. కోతకొచ్చే సరికి కోత కూలి, ట్రాక్టర్ బాడుగ రూ.10 వేలు అవుతోంది. ఇదిపోను అన్ లోడింగ్‌కు రూ.500 ఇవ్వాలి. చివరకు రైతుకు ఒరిగింది ఏమీలేదు. దీంతోపాటు ఫ్యాక్టరీల వద్ద రాజకీయం జరుగుతోంది. సిఫార్సులుంటేనే టోకెన్లు ఇచ్చి, ట్రాక్టర్‌ను లోపలికి పంపిస్తున్నారు. గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నమెంటే మేలు. అప్పుడు తోతాపురి మామిడి కేజీకి రూ.15పైనే వచ్చింది. – సురేంద్ర, గంగిరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా
రైతులు బాగుపడే పరిస్థితి లేదు
ఏ రోజు బండి ఆరోజు అన్‌లోడ్ కావడం లేదు. టోకన్లు తీసుకున్న బండ్లు అన్ లోడింగ్‌కు మూడు రోజులు పడుతోంది. దొంగచాటుగా వచ్చే బండ్లను నేరుగా ఫ్యాక్టరీ లోపలికి పంపిచేస్తున్నారు. ఇక్కడ వాళ్ల ఇష్టారాజ్యంగా మారింది. ధరలు చూస్తే కడుపు మండుతోంది. గతేడాది రూ.4 ఇచ్చారు. ఈసారి అది కూడా లేదు. ఇక రైతు అనే వాడు బాగుపడడు. – ఉదయ్, జీడీ నెల్లూరు, చిత్తూరు జిల్లా
ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలి
ఇప్పటికే రబీ సీజన్‌లో శనగ, మొక్కజొన్న, అరటి, పొగాకు రైతులు మద్దతు ధర దక్కక తీవ్రంగా నష్టపోయారు. తాజాగా తోతాపురి మామిడి రైతులు కూడా మరోసారి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని మామిడి రైతులకు న్యాయం చేయాలి. గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలి. దిగుబడి లేక నష్టపోయిన రైతులకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలి. రైతుల సమస్యలపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలి. – ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్
మామిడి బోర్డు ఏర్పాటు చేయాలి
తోతాపురి మామిడిని ర్యాంపుల వద్ద టన్ను రూ.5 వేలు, ఫ్యాక్టరీల వద్ద రూ.6 వేలకు మించి కొనడం లేదు. టన్నుకు రూ.18 వేలు, బంగినపల్లి రకానికి టన్నుకు రూ.25 వేలు చొప్పున మద్దతు ధర ప్రకటించి, చట్టబద్ధత కల్పించాలి. మద్దతు ధర కంటే తక్కువగా కొనుగోలు చేసే ఫ్యాక్టరీలు, వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయాలి. మామిడి రైతులకు శాశ్వత రక్షణ కల్పించేందుకు, మార్కెటింగ్, ఎగుమతులను పర్యవేక్షించేందుకు రాష్ట్రంలో ప్రత్యేకంగా ‘మామిడి బోర్డ్‘ ఏర్పాటు చేయాలి. దానికి తగిన నిధులు కేటాయించాలి. వైపరీత్యాలతో నష్టపోతున్న మామిడి రైతులను ఆదుకునేందుకు ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధ్దరించాలి. – గుజ్జుల ఈశ్వరయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి


