నూజివీడు.. మామిడి తోడు 

Mango Cultivation Crop Grown In 52 Thousand Acres In Eluru District - Sakshi

ఏలూరు జిల్లాలో పెరిగిన సాగు విస్తీర్ణం 

52 వేల ఎకరాల్లో పంట 

నూజివీడు రసాలు జిల్లా సొంతం 

నూజివీడు: ఫలాలకు రాజు.. మామిడి. మధుర మామిడి రసాలను రుచి చూడకుండా ఎవరూ ఉండరు. అలాంటి మామిడికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పేర్గాంచింది మాత్రం నూజివీడు. ఇక్కడ లభ్యమయ్యే బంగినపల్లి, చిన్నరసాలు, మామిడి రసాలంటే ఇష్టపడని వారు ఉండరు. అంతగా నూజివీడు మామిడికి ప్రసిద్ధి. కలెక్టర్‌ (తోతాపురం) రకం కూడా సాగవుతోంది.

ఈ ప్రాంతం నుంచి రాష్ట్రంలోని నున్న మామిడి మార్కెట్‌తో పాటు హైదరాబా ద్‌ మార్కెట్‌కు ఎగుమతి చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని చెన్నై, ముంబై, ఢిల్లీ, బరోడా, ఇండోర్, నాగపూర్, అహ్మదాబాద్‌ వంటి ప్రాంతాలకు సైతం ఎగుమతి అవుతోంది. అలాగే మలేసియా, సింగపూర్‌లకే కాకుండా పశ్చిమ ఆసియా దేశాలకు సైతం మామిడి ఎగుమతవుతున్నాయి. పురాతన కాలం నుంచి ఈ ప్రాంతంలో మామిడిని రైతులు సాగుచేస్తున్నారు. మామిడి సహజంగా బెట్ట పంట కావడంతో ఒక ఏడాది కాపు ఎక్కువ వస్తే, తరువాత ఏడాది తక్కువ వస్తుంది.  

జిల్లాలో 52 వేల ఎకరాల్లో..  
నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కలిపి దాదాపు 40 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. అలాగే చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, టి.నరసాపురం, కామవరపుకోట, లింగపాలెం, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం మండలాల్లో కలిపి దాదాపు 12 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ఇప్పటివరకు కృష్ణా జిల్లాలో ఉన్న నూజివీడు ప్రాంతం ఏలూరు జిల్లాలోకి రావడంతో మామిడి సాగు విస్తీర్ణం జిల్లాలో పెరిగినట్లయింది.

మామిడి పూర్తిగా వాతావరణాధారిత పంట కావడంతో మామిడి రైతులకు తీపి చేదులు సర్వసాధారణంగా మారింది. మామిడి అభివృద్ధి కోసం రైతులకు సకాలంలో సలహాలు సూచనలు అందించేందుకు నూజివీడులో మామిడి పరిశోధన స్థానం సైతం ఉంది. తాడేపల్లిగూడెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో ఈ పరిశోధన స్థానం పనిచేస్తుంది.

ఇందులో ము గ్గురు శాస్త్రవేత్తలు రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అలాగే నూజివీడులోనే మ్యాంగో హబ్‌ సైతం ఉంది. దీనిలో మామిడికాయలను ప్రాసెసింగ్‌ చేసి ఎగుమతి చేస్తారు. రైతులకు సరైన సలహాలు, సూచనలను సకాలంలో అందించడంతో పాటు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపడితే మామిడి విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top