శివయ్య సేవలో సీఎం వైఎస్‌ జగన్‌ 

Maha Shivratri: CM YS Jagan Offers Prayers In Gudivada - Sakshi

గుడివాడలో శివలింగానికి స్వయంగా అభిషేకం 

యాగశాల చుట్టూ ప్రదక్షిణలు.. పూర్ణాహుతి సమర్పణ

మహా శివుని ఆశీస్సులు ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలంటూ శుభాకాంక్షలు 

సాక్షి, అమరావతి/గుడివాడ టౌన్‌ : కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని ఎన్టీఆర్‌ మునిసిపల్‌ స్టేడియంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక మహా శివరాత్రి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. సుమారు అరగంట సేపు శివుని సేవలో పాలు పంచుకున్నారు. నిలువెత్తు శివుని విగ్రహం ముందు ఏర్పాటు చేసిన తేజో(శివ) లింగానికి మహారుద్ర, చతుర్వేద మంత్రోచ్ఛారణల మధ్య పాలు, పవిత్ర జలాలతో స్వయంగా అభిషేకం చేశారు. అనంతరం బిల్వ పత్రాలను శివ లింగానికి సమర్పించి నమస్కరించారు. పూలు, రుద్రాక్షల దండలతో శివలింగాన్ని స్వయంగా అలంకరించారు.

ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులందరినీ ఆశీర్వదిస్తూ వేద పండితులు అందజేసిన హారతిని సీఎం జగన్‌ కూడా కళ్లకు అద్దుకున్నారు. అనంతరం అదే ప్రాంగణంలో మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించిన యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు చుట్టిన తలపాగాతో పట్టువస్త్రంలో వివిధ సుగంధ పరిమళాలతో కూడిన వస్తువులను నెత్తిన ఉంచుకొని భక్తి శ్రద్ధలతో యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం వాటిని హోమంలో అగ్నిదేవునికి ఆహుతినిచ్చారు. మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. 

శివుని కృపా కటాక్షాల కోసం మహా సంకల్పం
పరమశివుని కృపాకటాక్షాలను సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి, రాష్ట్ర ప్రజలకు సిద్ధింప చేయాలనే మహాసంకల్పంతో మహాశివరాత్రి పర్వదినాన సూర్యోదయం నుండి అర్ధరాత్రి లింగోద్భవ కాలం వరకు మహారుద్ర పారాయణం, రుద్రహోమం, సహస్ర లింగార్చన, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శివపార్వతుల కళ్యాణం, జాగరణ దీక్ష నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కాగా, మహాదేవుని ఆశీస్సులు ఎల్లవేళలా రాష్ట్ర ప్రజలపై ఉండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సీఎం జగన్‌ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, పేర్ని నాని, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లాది విష్ణు, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, పలువురు పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలి
మహా శివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ‘విశేష పూజలు, జాగరణతో ఓంకార స్వరూపుడైన శంకరుని ధ్యానించే పవిత్రమైన రోజు మహా శివరాత్రి. ఈ విశిష్ట పర్వదినాన ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతూ రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేశారు.  – శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం ట్వీట్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top