విశాఖపట్నంలో భారీ వర్షం | Low Pressure Bubble In Bangalakatham Due To Heavy Rain In AP | Sakshi
Sakshi News home page

విశాఖపట్నంలో భారీ వర్షం

Oct 12 2020 7:43 AM | Updated on Oct 12 2020 11:25 AM

Low Pressure Bubble In Bangalakatham Due To Heavy Rain In AP - Sakshi

సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. మరి కొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు సమాచారం. విశాఖకు ఆగ్నేయంగా 310 కిలో మీటర్ల, కాకినాడకు 350 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతం కానున్నది. విశాఖ-నరసాపురం మధ్య ఇవాళ అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తీరం వెంబడి 45-60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల 3 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేందం తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. 

తూర్పుగోదావరి: జిల్లాలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. కోనసీమలోని అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సముద్రతీరానికి సందర్శకులు రావద్దని సూచించారు. కాకినాడ, రాజమండ్రి అమలాపురం, రామచంద్రపురం ఆర్టీవో కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. 

కంట్రోల్‌రూమ్‌ల వివ‌రాలు: వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ల నంబ‌ర్ల వివ‌రాలు..
1. క‌లెక్ట‌రేట్ (కాకినాడ‌)- 18004253077
2. స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యం, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం- 08832442344
3. స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యం, ఎట‌పాక‌- 08748285279
4. ఐటీడీఏ పీవో కార్యాల‌యం, రంప‌చోడ‌వ‌రం-18004252123
5. ఆర్‌డీవో కార్యాల‌యం, అమ‌లాపురం-08856233100
6. ఆర్‌డీవో కార్యాల‌యం, కాకినాడ‌-08832368100
7. ఆర్‌డీవో కార్యాల‌యం, రామ‌చంద్రాపురం-08857-245166

విశాఖపట్నం: జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. పరవాడలో 18 సెం.మీ, గాజువాకలో 17 సెం.మీ వర్షపాతం నమోదైంది. విశాఖ సిటీ, భీమిలిలో 16 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, జిల్లా అధికారులను కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ అప్రమత్తం చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వాయుగుండం నేపథ్యంలో కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. లెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నెంబర్లు: 0891-2590102, 0891-2590100.

పశ్చిమ గోదావరి: పోలవరంలో భారీ వర్షం కారణంగా ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పర్యటన రద్దు అయింది. నేటి ఉదయం11గంటలకు పోలవరం చేరుకోవల్సిది. భారీ వర్షం, వాయుగుండం నేపథ్యంలో మంత్రి పర్యటన రద్దు అయినట్లు అధికారులు తెలిపారు. 

విజయనగరం: జిల్లాలోని ఏజెన్సీ కురపాం ప్రాంతంలో వర్షం కురుస్తోంది. అదే విధంగా జిల్లాలోని పలు చోట్ల అర్థరాత్రి నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. తెల్లవారు జాము నుంచి వర్షపు చినుకులు కురుస్తున్నాయి. వాయుగుండం నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.  

వైఎస్ఆర్‌: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాపాగ్ని నదికి భారీగా వరద నీరు చేరుతోంది. వేంపల్లి ఎద్దుల కొండ వృషబచలేశ్వర స్వామి కొండ పైకి వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో అలిరెడ్డి పల్లె, తూపల్లె గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. చక్రాయపేట మండలంలో నదికి ఆనుకొని వేసిన వరి పంటలునీట మునిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement