బహు సుందర బ్రహ్మ ఆలయం

Lord Brahma Temple In Guntur District Chebrolu - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో/తెనాలి: ఆయన సృష్టికర్త. త్రిమూర్తులలో ప్రథమ స్థానం. అయినా బ్రహ్మదేవుడికి పూజలు చేయడం అరుదు. ఆలయాలూ ఉండవు. భృగు మహర్షి శాపం కారణంగానే భూలోకంలో బ్రహ్మ దేవుడికి ఆలయాలు ఉండవని, పూజలు జరగవని పురాణాల ప్రకారం చెబుతారు. అయితే కాశీ, రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు దగ్గర్లోని పుష్కర్‌లో బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉన్నాయి. ఇక మూడోది మన రాష్ట్రంలో ఏకైక ఆలయం గుంటూరు జిల్లా చేబ్రోలులో ఉంది. ఇక్కడి చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వరస్వామి ఆలయాన్ని రెండో కాశీగా చెబుతారు. శివలింగం చుట్టూ బ్రహ్మ నాలుగు ముఖాలతో ఉండటంతో ఆలయానికి విచ్చేసిన భక్తులు, ఒకేసారి శివుడిని, బ్రహ్మదేవుడిని దర్శించుకున్న అనుభూతి చెందుతారు. పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలు ఉన్న ప్రదేశం.

కోనేరు మధ్యలో ఆలయం
► చేబ్రోలులో బ్రహ్మ ఆలయాన్ని 1817లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు నిర్మించారు. 
► పెద్ద కోనేరును తవ్వించి, దాని ఆలయాన్ని నిర్మించి, బ్రహ్మదేవుడిని ప్రతిష్టించారు.
► పద్మాకారంలో ఉండే పానపట్టంపై లింగానికి నాలుగు వైపులా బ్రహ్మ 4 ముఖాలనూ రూపొందించారు. గర్భగుడికి నాలుగు ద్వారాలు ఉండటం మరో విశేషం. భక్తులు ఎటునుంచైనా స్వామిని దర్శించుకోవచ్చు. స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష అర్చనలూ నిత్యకృత్యం. బ్రహ్మ దేవుడి ఆలయం చుట్టూ మరెన్నో దేవాలయలున్నాయి. 

పాపపరిహారం కోసం..
రాజ్యంలో మితిమీరిన దొంగతనాల కట్టడికి, పట్టుబడిన దొంగల తలలు తీయించే చట్టం చేస్తారు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు. సామూహికంగా మనుషులను చంపించిన పాపం తనను పట్టిపీడిస్తుందన్న భావనతో నిష్కృతి కోసం బ్రహ్మదేవుడి ఆలయం నిర్మించాలని తలుస్తారు. పూజార్హత లేని బ్రహ్మకు ఆలయం కట్టిస్తే, ఆ దేవతా మూర్తి దృష్టి పడ్డంతవరకు నాశనమవుతుందని పెద్దలు హెచ్చరిస్తారు. దీనికి నివారణోపాయంగా 4 దిక్కుల్లో శివ–కేశవ ఆలయాలు నిర్మించాలని సూచిస్తారు. బ్రహ్మదేవుణ్ణి లింగాకారంలో మలిచి ఆ దేవుడి దృష్టి బయటకు వెళ్లకుండా అష్టదిగ్బంధనం చేశారు. ఆలయానికి ముందు వెనుక శివాలయాలు, రెండు పక్కల వైష్ణవ ఆలయాలు నిర్మించారు. మిగిలిన 4 మూలలా ఇతర దేవతా మూర్తులను ప్రతిష్టించి ఎనిమిది దిక్కులనుంచి బ్రహ్మదేవుని దృష్టిని ముందుకు సాగకుండా అరికట్టారు. ఈ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరుడి ఆలయ నిర్మాణంతో రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు మనసు శాంతించిందని చెబుతారు. ఈ ఆలయ ఉత్సవ, దీపారాధన, నైవేద్యాది కైంకర్యాలకు, దేవదాసీలు, భజంత్రీలు, అర్చకులు వగైరాలకు మాన్యాలను ఆయన సమకూర్చారు. 

దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయం
చేబ్రోలులోని ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోనే ఏకైక బ్రహ్మ ఆలయంగా ప్రసిద్ధి. ఆలయ కట్టడాలు, శివలింగం.. అన్నీ కాకతీయ వాస్తుశైలిని పోలి ఉన్నాయి. నాలుగు వైపుల్నుంచి స్వామిని దర్శించుకొనేలా నిర్మించిన అరుదైన సార్వతోభద్ర ఆలయం ఇది. ఎనిమిది దిక్కుల్లోనూ ఎనిమిది దిక్పాలకులకు దేవాలయాలుండటం మరో ప్రత్యేకత. సృష్టికర్తయిన బ్రహ్మ పేరిట ఆలయాన్ని నిర్మించి, దిక్పాలకుల పర్యవేక్షణలో సత్యలోకాధిపతిని సందర్శించుకోవటం అన్ని పాపాలకు పరిహారమని నాటి జమీందారు నమ్మారు. ఇప్పటికీ పలు రాష్ట్రాల్నుంచి కూడా యాత్రికులు ఇక్కడకు వస్తుంటారు. 
    – డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి, ప్రముఖ స్థపతి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top