పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడి
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం కోసం రెండో విడత భూసమీకరణ చేస్తున్న గ్రామాల్లో ఒక్కో రైతు కుటుంబానికి గరిష్టంగా రూ.1.50 లక్షల వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ అథారిటీ 63వ సమావేశం జరిగింది. అనంతరం పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మీడియాకు సమావేశ వివరాలను వెల్లడించారు. రెండో విడత భూసమీకరణ జరిగే గ్రామాల్లో ఈ ఏడాది జనవరి 6 నాటికి ఉన్న వ్యవసాయ రుణాలకు రుణ మాఫీని వర్తింపజేయాలని సీఎం నిర్ణయించారని చెప్పారు.
భూసమీకరణ కింద భూమిని తీసుకున్నప్పటి నుంచి పదేళ్లపాటూ ఏటా కౌలు చెల్లించేందుకు ఆమోదించారని తెలిపారు. రెండో విడత భూసమీకరణ చేసే గ్రామాల్లో 307 ఎకరాలు ఈనాం, దేవదాయ భూములు ఉన్నాయని..వాటికి కోర్టు అనుమతితో రూ.159 కోట్లను దేవదాయ శాఖకు పరిహారం చెల్లించి.. ఆ భూములను తీసుకుంటామని వివరించారు. అమరావతిలో 25 టౌన్‌షిప్‌లను నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు.
మంత్రుల ఉపసంఘం చేసిన సిఫార్సుల మేరకు..ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇషా ఫౌండేషన్ సహా పలు సంస్థలకు రాజధానిలో భూకేటాయింపులు చేసినట్లు తెలిపారు. అమరావతికి తొలి విడత భూసమీకరణ చేసిన గ్రామాల్లో ఇప్పటికీ భూములు ఇవ్వని రైతుల భూములను మంగళవారం(జూలై 7) రాత్రిలోగా సీఆర్‌డీఏకు ఇవ్వకపోతే.. వాటిని భూసేకరణ చట్టం–2013 ప్రకారం సేకరిస్తామన్నారు.


