కాలేయం కొవ్వెక్కుతోంది | Liver Disease: excess fat builds up in liver cells | Sakshi
Sakshi News home page

కాలేయం కొవ్వెక్కుతోంది

May 12 2026 5:10 AM | Updated on May 12 2026 5:10 AM

Liver Disease: excess fat builds up in liver cells

ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ‘ఫ్యాటీ లివర్‌’ 

దేశంలో 1990లో ప్రతి లక్ష మందిలో  10,191 కేసులు  

2023 నాటికి 12,555కి పెరుగుదల 

2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మందికి ముప్పు 

‘లాన్సెట్‌’ అధ్యయనంలో వెల్లడి

సాక్షి, అమరావతి: మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహార అలవాట్లు, జీవనశైలి వంటి కారణాలతో కాలేయ సంబంధిత వ్యాధుల వ్యాప్తి పెరుగుతోంది. మద్యపానం చేసే వారితోపాటు ఆ అలవాటు లేని వారిలోనూ ఫ్యాటీ లివర్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మూడు దశాబ్దాల్లో ఫ్యాటీ లివర్‌/మెటబాలిక్‌ డిస్‌ఫంక్షన్‌–అసోసియేటెడ్‌ స్టీటోటిక్‌ లివర్‌ డిసీజ్‌ (ఎంఏఎస్‌ఎల్‌డీ) బాధితుల సంఖ్య 143 శాతం పెరగడమే దీనికి నిదర్శనం. గ్యాస్ట్రో ఎంట్రాలజీ, హెపటాలజీపై ఇటీవల ‘ది లాన్సెట్‌’ ప్రచురించిన అధ్యయనం బీపీ, షుగర్, ఊబకాయం వంటి సమస్యలతో ఫ్యాటీ లివర్‌ సమస్యలు పెరుగుతున్నట్టు వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం భారత్‌లో 1990లో సగటున లక్ష మందిలో ఫ్యాటీ లివర్‌ కేసులు 10,191 ఉండగా.. 2023 నాటికి ఆ సంఖ్య 12,555కు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 1990 నుంచి 2023 మధ్య ఫ్యాటీ లివర్‌ బాధితుల సంఖ్య 143 శాతం పెరిగినట్టు స్పష్టమైంది. దాదాపు ప్రతి ఆరుగురిలో ఒకరు ఫ్యాటీ లివర్‌ సమస్యతో సతమతమవుతున్నట్టు తేల్చారు. 

జీవనశైలి జబ్బులే ప్రధాన కారణం 
భారత్‌లో ఫ్యాటీ లివర్‌ సమస్య వేగంగా పెరుగుతుండడానికి బీపీ, షుగర్, ఊబకాయం వంటి జీవనశైలి జబ్బులే ప్రధాన కారణమని అధ్యయనం వెల్లడించింది. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పట్టణీకరణ పెరిగి, శారీరక శ్రమలేని జీవనశైలి, జంక్, ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాల వినియోగం అధికమవడంతో పట్టణాల్లో 32 శాతానికిపైగా ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు నిపుణులు అభిప్రాయడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి అత్యంత వేగంగా పెరుగుతుండటంతో 2050 నాటికి దాదాపు 200 కోట్ల మంది బాధితులు ఉంటారని అంచనా వేశారు.

1990–2023 మధ్య 30 ఏళ్లలో చోటుచేసుకున్న వృద్ధి కంటే రెట్టింపు ఉండవచ్చని తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ అంచనాల ప్రకారం దేశంలో 11 శాతానికిపైగా జనాభా షుగర్, 35 శాతం బీపీ సమస్యతో బాధపడుతున్నారు. రాష్ట్ర వైద్య శాఖ ఎన్‌సీడీ సర్వేలో గుర్తించిన బీపీ, షుగర్‌ బాధితులు 60 లక్షల మందికి పైగానే ఉంటున్నారు. ఫ్యాటీ లివర్‌ సమస్య ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలను చూపదని.. ఈ దృష్ట్యా బీపీ, షుగర్, ఊబకాయ బాధితులు 
ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  

ఆహారమే ఔషధం
దేశంలోని పెద్దల్లో 40 శాతం మంది, ఊబకాయం గల పిల్లల్లో 60 శాతం మందికి ఫ్యాటీ లివర్‌ ఉందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. క్రమరహిత ఆహార అలవాట్లు, నిద్ర, శారీరక శ్రమ లేమి వంటి కారణాలు మద్యపానం అలవాటు లేని వారిలోనూ ఫ్యాటీ లివర్‌కు దారితీస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ జీవనశైలి, ఆహార అలవాట్ల మీద శ్రద్ధ పెట్టాలి. ఆహారాన్ని ఔషధంగా చూడాలి. తినే ఆహారంపై నియంత్రణ ఉంటే జబ్బుల బారినపడే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ప్రాసెస్డ్, జంక్‌ ఫు­డ్స్, కూల్‌ డ్రింక్స్‌ను పూర్తిగా విడనాడాలి. మనిషి కి రోజుకు 1,600–1,800 క్యాలరీలు అవసరం. అంతకంటే ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. వారానికి 150–180 నిమిషాలు శారీరక శ్రమ చేయాలి. రన్నింగ్, వాకింగ్, యోగా, జిమ్‌లో వ్యాయామం ఇలా ఏదో ఒక శారీరక శ్రమను జీవనశైలిలో భాగం చేసుకోవాలి. 
– డాక్టర్‌ కె.జగదీశ్వర్‌రెడ్డి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, ఒంగోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement