
సూపర్ సిక్స్ అమలు చేయకుండానే చేసేశామంటూ అబద్ధాలు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అడ్డగోలు సమర్థన
రైతులకు యూరియా లేదు.. ఏ పంటకూ మద్దతు ధర లేదు
ప్రశ్నిస్తే చాలు డైవర్షన్ పాలిటిక్స్‌తో డ్రామాలు
ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోని వైనం
కౌన్సిల్‌లోనూ వాస్తవాలు చెప్పకుండా తప్పించుకునే ఎత్తులు
దళిత వర్గానికి చెందిన కౌన్సిల్ చైర్మన్‌కు అవమానం
ఆత్మస్తుతి, పరనిందలా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీలకు తూట్లు పొడిచి సూపర్‌గా అమలు చేసేసినట్లు అబద్ధాలు ఆడారు.. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం స్కీంలు ఇవ్వకుండానే ఇచ్చేశామని ప్రకటించుకున్నారు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డగోలుగా సమరి్థంచుకున్నారు.. రైతులకు యూరియా, ఇతర ఎరువుల సరఫరాలో చేతులెత్తేసి డ్రామాలాడారు.. ఏ పంటకు మద్దతు ధర లేక పోయినా రైతోద్ధారకుల్లా పోజులు కొట్టారు.. మొత్తంగా ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకుండా డైవర్షన్ పాలిటిక్స్‌కు పెద్ద పీట వేయడం స్పష్టంగా కనిపించింది. తద్వారా చంద్రబాబు తాను చెప్పే అబద్ధాలకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు.
మొత్తంగా చూస్తే ఎనిమిది రోజుల శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాల తీరు ఆత్మస్తుతి... పరనింద.. తీరున సాగాయి. పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుతూ, ప్రభుత్వం కొలువుదీరిన 15 నెలల తర్వాత కూడా సీఎం చంద్రబాబు సహా కూటమి ప్రజాప్రతినిధులు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ జపం చేశారు. ప్రజలకు చేసిందేమీ లేకపోవడంతో ప్రతిపక్ష నేతపై లేనిపోని ఆరోపణలతో, నిందలు వేస్తూ అసెంబ్లీ వేదికగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు నానాతిప్పలు పడ్డారు.
కాగా, అసెంబ్లీలో కూటమి వక్రీకరణలు, అసత్యాలు మండలిలో చర్చకు వచ్చినప్పుడు వైఎస్సార్‌సీపీ దీటుగా నిలిచింది. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని ఎమ్మెల్సీలు తిప్పికొట్టారు. దీంతో సర్కారు వక్రీకరణ మార్గం ఎంచుకుంది. అబద్ధాల ప్రచారాన్ని రక్తి కట్టించేందుకు కూటమి నేతలు శతవిధాల ప్రయత్నించినా వారి ఆటలు సాగలేదు.
మోదీని కీర్తించేందుకు ఆరాటం
ప్రధాని మోదీని మరింత ప్రసన్నం చేసుకునేందుకు ఆయనను ఆకాశానికి ఎత్తేలా పొగడడానికి చంద్రబాబు అసెంబ్లీని ఉపయోగించుకున్నారు. సమావేశాల తొలి రోజే సూపర్ జీఎస్టీ అంటూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలను అభినందిస్తూ తీర్మానం చేశారు. మోదీ ఈ దేశానికే సంపద అని కీర్తించారు.
సంస్కరణల అమలుకు తానే కారణమంటూ సొంత పార్టీ నేతలతో అభినందన తీర్మానం పెట్టించుకుని తన ఘనతేనని ప్రచారం చేసుకున్నారు. జీఎస్టీ సంస్కరణలపై ఒకసారి తీర్మానం చేసినా మళ్లీ ఈ నెల 22న సూపర్ జీఎస్టీ, సూపర్ సిక్స్ అంటూ ప్రకటన చేసి మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు.
అప్పులపై నిస్సిగ్గుగా అబద్ధాలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు.. కాదుకాదు రూ.14 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపిస్తూ వస్తున్నదంతా అవాస్తవమని అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అంగీకరించారు. వైఎస్సార్‌సీపీ పాలనలో బడ్జెట్ లోపల, గ్యారెంటీల ద్వారా చేసిన అప్పు రూ.3.70 లక్షల కోట్లేనని స్వయంగా లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
» జల వనరులు, వ్యవసాయం, శాంతిభద్రతలు, లాజిస్టిక్స్, సూపర్ సిక్స్ పథకాల అమలుపై లఘు చర్చలో అవాస్తవాలు, అభూత కల్పనలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు.
ూ రెడ్‌బుక్ రాజ్యాంగంతో పోలీసు శాఖను ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల వేధింపులకే పరిమితం చేసి, శాంతిభద్రతలే లేకుండా పోయినా భేషుగ్గా ఉన్నాయంటూ తప్పుడు గణాంకాలను సభ ముందు ఉంచారు.
» 20 లక్షల ఉద్యోగాలిస్తామంటూ యువతను మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చాక వాటి గురించి పట్టించుకోకుండా 4.71 లక్షల ఉద్యోగాలిచ్చామని ప్రకటించడం ఈ సమావేశాల్లోనే అతి పెద్ద అబద్ధంగా నిలిచింది.
వైద్య కళాశాలలపై కట్టుకథలు
తన పాలనలో ఒక్క వైద్య కళాశాల కట్టలేని చేతగానితనాన్ని చంద్రబాబు పరోక్షంగా అంగీకరిస్తూనే వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలపై కట్టుకథలు చెప్పారు. వాటిని ప్రైవేటుకు కట్టబెట్టడాన్ని రాష్ట్రమంతా ముక్తంకంఠంతో ఖండిస్తున్నా దాన్నో ఘనకార్యంగా ప్రకటించారు. వైద్య రంగంలో వైఎస్సార్‌సీపీ సర్కారు ప్రవేశపెట్టిన కేన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలను ఏమాత్రం జంకు లేకుండా తానే తీసుకొచ్చినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
పవన్ గాలి తీసేసిన టీడీపీ బొండా ఉమ
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదని, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చైర్మన్ కృష్ణయ్య స్వయంగా చెబుతున్నారని, అసలు రాష్ట్రంలో పీసీబీ ఉందా? అని విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ప్రశ్నించడం కూటమి రాజకీయాల్లో కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో పవన్ అసహనంతో బొండాపై ఎదురుదాడి చేశారు.ఇది టీడీపీ, జనసేన మధ్య సోషల్ మీడియాలో చిచ్చు రాజేసింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. పీసీబీ పని చేయడంలేదని, పవన్ తీరు అధ్వానంగా ఉన్నట్లు శాసనసభ సాక్షిగా వెల్లడైంది.
బాలకృష్ణ బజారు భాష.. బజారునపడ్డ కూటమి
సీఎం బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన బజారు భాష, హావభావాలతో వైఎస్ జగన్‌ను, సినీ హీరో చిరంజీవిని అవమానించేలా మాట్లాడి తీవ్ర విమర్శలకు గురయ్యారు. వైఎస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు నమ్మిన బంటుగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ మండిపడడం, అది పెను వివాదంగా మారడంతో కూటమి ప్రభుత్వం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది.
» అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూటమి ప్రభుత్వ కక్షపూరిత ధోరణి బయటపడింది. లెజిస్లేచర్ అదనపు భవనం ప్రారంభానికి దళిత వర్గానికి చెందిన కౌన్సిల్ చైర్మన్‌ను పిలవకపోవడం, శిలాఫలకంపై ఆయన పేరు కూడా వేయకపోవడం ద్వారా చంద్రబాబు చెప్పే నీతులన్నీ కల్ల»ొల్లి మాటలని తేలిపోయింది.
ఇవిగో వైఫల్యాలు.. బయటపెట్టిన కూటమి ఎమ్మెల్యేలు
» రాష్ట్రంలో అసలు యూరియా కొరతే లేదని సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభలో ఖండించగా... యూరియా దొరకడమే లేదంటూ ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఏకరువు పెట్టారు. తమది సుపరిపాలన అని చంద్రబాబు ప్రకటించుకోగా... వరికి మద్దతు ధర లేదని, ధాన్యాన్ని కొనడం లేదని, పెసర రైతులు అల్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతి, కావ్యకృష్ణారెడ్డి, తంగిరాల సౌమ్య వాపోయారు. ఉల్లి, టమాట రైతులు ఆగమైతున్నారని మరికొందరు ఎమ్మెల్యేలు లేవనెత్తారు.
» శాసనసభ సాక్షిగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను పదేపదే బయటపెట్టారు. విజనరీ అని పొగుడుతూనే.. రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని చెప్పారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌లో మెజారిటీ ఎమ్మెల్యేలు దారుణ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు వివరించారు.
» యూరియా అందక, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక, బీమా వర్తించక వ్యవసాయం అధోగతి పాలైనా... గత 15 నెలల్లో సాగును ప్రగతి పథంలోకి తెచ్చినట్లు చంద్రబాబు అబద్ధాలు వల్లె వేశారు. బస్తా యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలో నిలుచుంటున్నా కొరతే లేదని ప్రకటించుకున్నారు. రైతులను అవమానించేలా.. వారి ధాన్యం ఆల్కహాల్ తయారీకే పనికొస్తుందంటూ చంద్రబాబు ఎగతాళి చేశారు.
» సాధారణ బియ్యంలో కలిపే పోర్టిఫైడ్ రైస్ కాంట్రాక్టులను స్థానిక ఎంఎస్‌ఎంఈలకు ఎందుకివ్వడం లేదని, ఇతర రాష్ట్రాల్లోని పెద్ద కంపెనీలకు ఇవ్వడంలో మర్మం ఏమిటని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, గోరంట్ల బుచ్చయ్యచౌదరి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను నిలదీయడం గమనార్హం.
» అంతర్జాతీయ రాజధాని సంగతి ఏమోగానీ అమరావతి రైతుల ఆర్తనాదాలు చేస్తున్నారని, అష్టకష్టాలు పడుతున్నారని ఆ ప్రాంత ఎమ్మెల్యేతో పాటు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనాచౌదరి చెప్పారు.