అన్నదాతకు అండ | Sakshi
Sakshi News home page

అన్నదాతకు అండ

Published Thu, Mar 21 2024 5:13 AM

Large scale loans are granted to farmers in cm jagan rule - Sakshi

వైఎస్‌ జగన్‌ పాలనలో రైతులకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు

ఏటా సగటున 1.05 కోట్ల మందికి రూ.1,74,193 కోట్ల రుణాలు

2023–24 సీజన్‌లో రుణ ప్రణాళిక రూ.2.31 లక్షల కోట్లు

ఇప్పటికే 99.65 లక్షల మందికి రూ.2.08 లక్షల కోట్లు అందజేత

రైతు భరోసా, సున్నా వడ్డీ, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ వంటి పథకాలతో వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రభుత్వం

ప్రభుత్వ తోడ్పాటుతో సకాలంలో రుణాలు చెల్లిస్తున్న రైతులు

దీంతో అడిగిందే తడవుగా రుణాలిస్తున్న బ్యాంకులు  

సాక్షి, అమరావతి: ఆరు గాలం శ్రమించే అన్నదాతకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. వైఎస్సార్‌ రైతు భరోసా వంటి పథకాల ద్వారా అవసరమైన ఆర్థిక చేయూతనిస్తోంది. అలాగే బ్యాంకర్ల సాయంతో ముందెన్నడూ లేని రీతిలో రైతులకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు అయ్యేలా చూస్తోంది. గతంలో రుణాల కోసం అన్నదాతలు చెప్పులరిగేలా బ్యాంకుల చుట్టూ తిరిగేవారు. అయినా సకాలంలో అప్పులు పుట్టక వడ్డీ వ్యాపారుల ఉచ్చులో పడి అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. సీఎం జగన్‌ పాలనలో ఆ పరిస్థితి మారింది. అడిగిందే తడవుగా అన్నదాతలకు రుణాలు మంజూరవుతున్నాయి.

రైతులకు లబ్ధి చేకూరుస్తూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా బ్యాంకులు సైతం వ్యవసాయ రంగానికి రుణాల మంజూరును ఏటా పెంచుతున్నాయి. ఈ ఐదేళ్లలో వైఎస్సార్‌ రైతు భరోసా కింద 53.58 లక్షల రైతు కుటుంబాలకు రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం.. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 84.67 లక్షల మందికి రూ.2,051 కోట్ల లబ్ధి చేకూర్చింది. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద 54.58 లక్షల మందికి రూ.7,802.05 కోట్లు, ఇన్‌పుట్‌ సబ్సిడీ రూపంలో 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్లు అందించింది.

ఫలితంగా రైతుల ఆర్థిక పరపతి గణనీయంగా పెరిగింది. దీనికి తోడు రికార్డు స్థాయిలో దిగుబడులు వస్తున్నాయి. వాటికి మార్కెట్‌లో ఎమ్మెస్పీకి మించి మంచి ధరలు లభిస్తున్నాయి. దీంతో తీసుకున్న రుణాలను రైతులు కూడా సకాలంలో చెల్లిస్తున్నారు. రికార్డు స్థాయిలో మొండి బకాయిలు సైతం వసూలవుతున్నాయి. 2019–20లో మొండి బకాయిలు 3.57 శాతం ఉండగా, 2023–24కు వచ్చేసరికి 2.50 శాతానికి తగ్గింది. దీంతో గత ఐదేళ్లుగా రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు ఆసక్తి చూపిస్తున్నాయి.

రికార్డు స్థాయిలో మంజూరు..
2014–15 నుంచి 2018–19 మధ్య ఐదేళ్లలో 3.97 కోట్ల మందికి రూ.3,64,624 కోట్ల రుణాలు మంజూరు చేస్తే.. గత 57 నెలల్లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో 5.27 కోట్ల మంది రైతులకు ఏకంగా రూ.8,70,964 కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. అంటే టీడీపీ ఐదేళ్ల పాలనలో ఏటా సగటున 79 లక్షల మందికి రూ.72,925 కోట్ల రుణాలిస్తే.. వైఎస్‌ జగన్‌ పాలనలో ఇప్పటివరకు ఏటా సగటున 1.05 కోట్ల మంది రైతులకు ఏకంగా రూ.1,74,193 కోట్ల రుణాలు బ్యాంకులు అందించాయి.

టీడీపీ హయాంతో పోలిస్తే రైతుల సంఖ్య దాదాపు 30 శాతం పెరిగితే, మంజూరు చేసిన రుణాలు ఏకంగా 142 శాతం పెరిగింది. అంటే ఏ స్థాయిలో రుణాలు మంజూరయ్యాయో అర్థం చేసుకోవచ్చు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.31 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. 2024 ఫిబ్రవరి నాటికి 99.65 లక్షల మందికి 2.08 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు అందించాయి. మొత్తంగా చూస్తే ఈ ఏడాది షార్ట్‌ టర్మ్‌ రుణాలు రూ.1.22 లక్షల కోట్లు కాగా, అగ్రి టర్మ్‌ రుణాలు రూ.66 వేల కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాల రంగానికి రూ.20,816 కోట్లు మంజూరు చేశాయి. 

కౌలు రైతులకు వెన్నుదన్ను
భూ యజమానుల హక్కులకు రక్షణ కల్పిస్తూనే వాస్తవ సాగుదారులకు ప్రభుత్వం పంట సాగుదారు హక్కు పత్రాల(సీసీఆర్సీ)ను జారీ చేస్తోంది. వైఎస్‌ జగన్‌ పాలనలో ఇప్పటివరకు ఏటా సగటున 5.80 లక్షల మంది చొప్పున 26 లక్షల మంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేసింది.

అలాగే ఈ ఐదేళ్లలో 15 లక్షల మందికి రూ.8,577 కోట్ల రుణాలు మంజూరు చేసింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 8.31 లక్షల మందికి సీసీఆర్సీ కార్డులు జారీ చేయగా.. వీరిలో ఇప్పటికే 5.48 లక్షల మందికి రూ.1,908 కోట్ల పంట రుణాలు మంజూరయ్యాయి. 

Advertisement
Advertisement