వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మ రథోత్సవం

Lakshminarasimha Swami Brahma Rathodsavam Celebrations Grandly - Sakshi

రథం తాడు తెగిపోవడంతో స్వల్ప అంతరాయం

సాయంత్రం 3.45కు యథాస్థానానికి చేరిన స్వామివారు

భారీ ఎండలోనూ తరలివచ్చిన 3 లక్షల మందికి పైగా భక్తులు

కదిరి: అనంతపురం జిల్లా కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవం బుధవారం అశేష భక్తజనం నడుమ అత్యంత వైభవంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం ఉదయం 8.56 గంటలకు రథం ముందుకు కదిలింది. స్వామివారు తిరువీధుల గుండా విహరించి సాయంత్రం 3.45 గంటలకు యథాస్థానం చేరుకున్నారు. రథం తిరువీధుల్లోని గండి మడుగు ఆంజనేయస్వామి గుడి వద్దకు చేరుకోగానే ఎడమ వైపు ఉన్న తేరు మోకు రెండు సార్లు తెగిపోయి అంతరాయం కలిగింది.

చివర్లో రథం గోడకు ఆనుకోవడంతో అక్కడ కూడా గంటకు పైగా ఆలస్యమైంది. కదిరి ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ సిద్ధారెడ్డి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆనవాయితీగా మూర్తిపల్లి, బేరిపల్లి, కుటాగుళ్ల, నాగిరెడ్డిపల్లి, గంగిరెడ్డిపల్లి గ్రామస్తులు రథానికి వెనుకవైపు నుంచి సండ్ర మొద్దులు, తెడ్లు వేస్తూ రథ గమనాన్ని నియంత్రిస్తూ వచ్చారు. మూడు లక్షల మందికి పైగా భక్తులు రథోత్సవానికి విచ్చేసినట్లు ఆలయ, పోలీసు అధికారుల అంచనా. ఎండలు మండిపోతున్నా భక్తులు ఏమాత్రం లెక్కచేయక స్వామివారి సేవలో తరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top