బస్సు డ్రైవర్ లక్ష్మయ్య
కర్నూలు వద్ద ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ నిర్వాకం
కారెంపూడి: కర్నూలు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 19 మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అర్హత లేకున్నప్పటికీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ప్రమాదం నేపథ్యంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుటుంబ నేపథ్యం, ప్రవర్తన, అలవాట్లపై అధికారులు ఆరా తీశారు. ఈయన 5వ తరగతి వరకే చదువుకున్నాడని, అయితే టెన్త్ ఫెయిల్ అయినట్లు సర్టిఫికెట్ ఇచ్చి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని గుర్తించారు.
మొదట లారీ క్లీనర్‌గా, తర్వాత డ్రైవర్‌గా పని చేశాడు. 2004లో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టుకు ఢీకొనడంతో అప్పట్లో లారీ క్లీనర్ మృతి చెందాడు. ఆ తర్వాత లారీ డ్రైవర్‌గా మానేసి కొన్నాళ్లు ట్రాక్టర్ కొని స్వగ్రామంలో వ్యవసాయం చేశాడు. తర్వాత ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా ఏడెనిమిదేళ్ల నుంచి వెళ్తున్నాడని తెలిసింది. లక్ష్మయ్య తండ్రి రాములు రెండు నెలల కిందట మృతి చెందాడు. ఇతనికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె, ఒక సోదరుడు, ఇద్దరు అక్కలు ఉన్నారు. లక్ష్మయ్యకు అప్పుడప్పుడు మద్యం సేవించే అలవాటు ఉందని సమాచారం.


