పోలీసులతో గొడవపడుతున్న వికాస్ మర్మత్ మిత్రుడు. చిత్రంలో ఐఏఎస్ వికాస్
బెంగళూరు పబ్లో కుప్పం ఐఏఎస్ వికాస్ మర్మత్ రచ్చరచ్చ
ఇన్స్పెక్టర్పై చేయిచేసుకున్న మర్మత్, అతని స్నేహితులు
ఆస్పత్రిలో చేరిన పోలీసు అధికారి.. కేసు నమోదు
కేసు నమోదుతో అజ్ఞాతంలోకి ఐఏఎస్
‘బాబు’ అండతో కుప్పంలో నిత్య వివాదాల్లో మర్మత్
యశవంతపుర/సాక్షి, చిత్తూరు: సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ బెంగళూరు పబ్లో వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో పోలీసులపైనే దాడిచేసి రచ్చ చేశారు. ఈ ఉదంతం కన్నడనాట తీవ్ర సంచలనం కలిగించగా.. చిత్తూరు జిల్లాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి బెంగళూరు సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా ‘కుప్పం ఏరియా అభివృద్ధి అథారిటీ (కడా)’ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్న వికాస్ మర్మత్ ముగ్గురు స్నేహితులతో కలిసి శనివారం బెంగళూరు నగరంలోని రెసిడెన్సీ రోడ్డులోని ‘కావోర్ బార్ అండ్ రెస్టారెంట్– పబ్’కు వెళ్లారు.

అర్ధరాత్రి దాటాక 1:30 గంటల సమయంలో బెంగళూరు సీసీబీ పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా పబ్లోకి వెళ్లారు. సీసీబీ పోలీసులతో పాటు క్రైమ్ సీఐ అరుణ్ సాలుంకే కస్టమర్లను వివరాలు అడిగి వారి ఆధార్ వంటి గుర్తింపు కార్డులను పరిశీలిస్తుండగా.. వికాస్ మర్మత్, అతనితో ఉన్న అభయ్ ఉదయసింగ్, నితీశ్, రోషన్ అడ్డుపడ్డారు. ‘ఏయ్.. ఎవరనుకున్నావ్.. మమ్మల్ని తనిఖీ చేయడం ఏమిటి’ అంటూ గలాటాకు దిగారు. మర్మత్తో వెళ్లిన వారిలో ఒకరు ‘ఇతను ఐఏఎస్ అధికారి అని తెలియదా’ అంటూ ఏదో నంబర్కు ఫోన్ చేశారు. ఇన్స్పెక్టర్ను వికాస్ మర్మత్ ‘మాదర్..’ అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. ఇన్స్పెక్టర్పై చేయి సైతం చేసుకున్నారు. పోలీసులను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి నెట్టేశారు. గాయపడ్డ ఇన్స్పెక్టర్ అరుణ్ సలుంకే ఆస్పత్రిలో చికిత్స పొంది.. 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మర్మత్.. ఆద్యంతం వివాదమే
టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబుకు నమ్మకస్తుడిగా పేరొందిన వికాస్ మర్మత్ కుప్పం ఏరియా అభివృద్ధి అథారిటీ (కడ) అధికారిగా నియమితులయ్యారు. కుప్పంలోని నాలుగు మండలాల్లో వికాస్ రాజ్యాంగేతర శక్తిగా మారారనే ఆరోపణలున్నాయి. చంద్రబాబుకు ఏది నచ్చితే ఆ పనులు మాత్రమే చేయడం, పీ–4 పథకంలో లబ్ధిదారులను దాదాపు టీడీపీకి చెందిన వాళ్లనే ఉంచడం వంటివి చేశారు.
నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం పొగురుపల్లె, చింతరపాళ్యం, దాస్మాన్ పల్లె, అత్తినత్తం, బిసానత్తం ప్రాంతాల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేయని రైతులను వారి భూముల నుంచి వెళ్లగొట్టేలా ప్రణాళికలు రచించి వాళ్ల భూములు లాక్కున్నారనే ఆరోపణలున్నాయి. కుప్పంలో విమానాశ్రయం కోసం చక్రపాణిరెడ్డి అనే రైతుకు సంబంధించిన 80 ఎకరాల భూమిని ఉద్దేశపూర్వకంగా భూసేకరణ కింద బలవంతంగా తీసుకోవడంతో పాటు టీడీపీ నేతలకు మినహాయింపు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. చంద్రబాబు మెప్పు కోసం వికాస్ కుప్పంలో ఇష్టమొచ్చినట్టు పనిచేస్తున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.


