మార్చికల్లా పలాస కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌

Krishnababu Says Palasa Kidney Research Center Will Ready By March - Sakshi

ప్రజారోగ్యంపై సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక శ్రద్ధ

రాష్ట్రంలోని ఏడు మెడికల్‌ కాలేజీల్లో అంకాలజీ యూనిట్ల ఏర్పాటు

ప్రభుత్వాస్పత్రులు, మెడికల్‌ కాలేజీల్లో ప్రవాస భారత వైద్య నిపుణుల సేవలు

‘ఆపీ’.. ఏపీ వైద్యశాఖల పరస్పర సహకారం

గ్లోబల్‌ హెల్త్‌ సమ్మిట్‌ ముగింపు సందర్భంగా ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు

సాక్షి, విశాఖపట్నం: వచ్చే మార్చి నాటికి శ్రీకాకుళం జిల్లా పలాసలోని కిడ్నీ రీసెర్చి సెంటర్‌ అందుబాటులోకి తెస్తున్నామని.. ఇక్కడి ఉద్దానంతో పాటు ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరుల్లోని కిడ్నీ తీవ్రతను తగ్గించే చర్యలు కూడా ఇప్పటికే చేపట్టామని.. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు వెల్లడించారు. అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌ (ఆపీ), ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖలు కూడా పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించామన్నారు. విశాఖలో మూడ్రోజులుగా జరుగుతున్న గ్లోబల్‌ హెల్త్‌ సమ్మిట్‌ ముగింపు కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఈ ఒప్పందం జరిగితే ప్రవాస భారతీయ వైద్య ప్రముఖుల సేవలను రాష్ట్ర ప్రభుత్వ వైద్యశాలలు, వైద్య విద్యాలయాలు వినియోగించుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఈ సమ్మిట్‌ ద్వారా వైద్య రంగ నిపుణుల సూచనలు, సలహాలను ప్రభుత్వం తీసుకుని వాటి ఆచరణకు కృషిచేస్తుందని చెప్పారు. విదేశీ వైద్య ప్రముఖులు రాష్ట్రానికి వచ్చిన సమయంలో ప్రధా­న వైద్యశాలల్లో అత్యవసర చికిత్సలతో పాటు సూ­పర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని కోరి­నట్లు తెలిపారు. విదేశాల్లో స్థిరపడిన మ­న వైద్యులు వారి అనుభవాలను మన రాష్ట్ర వైద్య విధానంలో మార్పుల కోసం సహకరించాలని కోరారు. 

అంకాలజీ విభాగాల బలోపేతం
అలాగే, రాష్ట్రంలోని ఏడు పురాతన వైద్య కళాశాలల్లో అడ్వాన్స్‌ క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ సదుపాయాలతో పాటు రేడియోథెరపీ, సర్జికల్, మెడికల్‌ అంకాలజీ విభాగాలను బలోపేతం చేసే అంశం ప్ర­భుత్వ ప్రతిపాదనలో ఉందని కృష్ణబాబు వెల్లడించారు. ఈ సదస్సులో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి జీఎస్‌ నవీన్‌కుమార్, ‘ఆపీ’ ఇండియా ప్రతినిధులు డాక్టర్‌ టి.రవిరాజు, రవి కొల్లి, ‘ఆపీ’ అమెరికా కోఆర్డినేటర్‌ ప్రసాద్‌ చలసాని, భారత సంతతి అమెరికా వైద్యులు, దేశంలోని పలువురు ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. అంతకుముందు.. డాక్టర్‌ రవిరాజు ఎక్స్‌లెన్స్‌ అవార్డును ప్రసాద్‌ చలసానికి ప్రదానం చేశారు. 

ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా పనిచేస్తోందని కృష్ణబాబు చెప్పారు. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో ఆరోగ్య పథకాలు, సేవలను అమలుచేస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమం ద్వారా రూ.16 వేల కోట్లు వెచ్చించినట్టు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 17 వైద్య కళాశాలలు, ప్రతి జిల్లాలో ఒక క్యాథ్‌ల్యాబ్‌ను గిరిజన ప్రాంతాల్లో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటుచేస్తున్నామన్నారు. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ ఫిజిషియన్‌ విధానాన్నీ ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇక ఆరోగ్యశ్రీలో ఎంప్యానెల్‌ చేసిన 2,225 ఆస్పత్రుల ద్వారా 3,255 రకాల వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క క్యాన్సర్‌కే ఏటా రూ.400 కోట్లు వెచ్చిస్తోందన్నారు. 

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top