ఆరోగ్య శాఖను ఆదాయ వనరుగా మార్చేసుకున్న ప్రభుత్వ పెద్దలు
పెద్దల అడుగుజాడల్లో కూటమి ప్రజాప్రతినిధులు
పెద్దాస్పత్రుల్లో మందులు సరఫరా, ఇతర కాంట్రాక్టుల్లో దోపిడీ కోసం బాహాబాహి
శానిటేషన్, సెక్యూరిటీ సబ్ కాంట్రాక్టుల కోసం పోటీ
తమ వర్గానికే సెక్యూరిటీ సబ్ కాంట్రాక్టు ఇవ్వాలంటూ సీఎంకు కర్నూలు ప్రజాప్రతినిధులు లేఖలు
సెక్యూరిటీ, శానిటేషన్ కాంట్రాక్టుల్లో సబ్ కాంట్రాక్టులకూ ఇతరులకు అవకాశం లేని దుస్థితి
ఎక్కడ పైసా కనపడితే అక్కడే దోచేయాలన్న ధోరణిలో ఉన్నారు అధికార టీడీపీ నేతలు. ఇసుక, మద్యం, సివిల్ కాంట్రాక్టులు.. ఇలాంటి పెద్దవే కాదు.. చివరికి ప్రభుత్వాస్పత్రుల పైనా ఈ పచ్చ గద్దలు వాలిపోయాయి. ఆస్పత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ సహా అన్ని వ్యవస్థలనూ గుప్పిట పట్టి దోచేయడానికి సిద్ధమైపోయారు. చివరికి వారిలో వారే కుమ్ములాటలకు కూడా దిగుతున్నారు. తమ వారికే ఈ పనులు అప్పగించాలంటూ సీఎంకు లేఖలు రాయడం వరకు ఈ వ్యవహారం చేరింది.
సాక్షి, అమరావతి : సీఎం గారూ.. కర్నూలు జీజీహెచ్ సెక్యూరిటీ కాంట్రాక్టు ఈగల్ ఎంటర్‌ప్రైజర్స్ దక్కించుకుంది. ఆస్పత్రిలో సెక్యూరిటీ వ్యవహారాల పర్యవేక్షణ (సబ్ కాంట్రాక్ట్)కు టీడీపీకి చెందిన మధుబాబు నాయుడును ఎంపిక చేశాను. కానీ, పక్క నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు వేరే వారిని ప్రతిపాదిస్తున్నారు. ఇది తీవ్ర గందరగోళానికి తావిస్తోంది. నేను సిఫార్సు చేసిన వ్యక్తి పార్టీ కోసం ఎంతగానో కృషి చేశాడు. అతనికి సబ్ కాంట్రాక్ట్ ఇసేŠత్ స్థానిక పార్టీ క్యాడర్‌కు గౌరవం ఇచ్చినట్లు అవుతుంది. – పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్
సీఎం సర్.. సతీష్ గౌడ్, వెంకటేశ్వర గౌడ్ కొన్నేళ్లుగా పారీ్టకి సేవ చేస్తున్నారు. వీరు కర్నూలు జీజీహెచ్ సెక్యూరిటీ సబ్ కాంట్రాక్టు కోసం ప్రధాన కాంట్రాక్టర్‌తో మాట్లాడుకున్నారు. ప్రధాన కాంట్రాక్టర్ కోరిన మొత్తంలో సగం చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే, అగ్రిమెంట్‌ను ఉల్లంఘించి ప్రధాన కాంట్రాక్టర్ వేరొకరికి సబ్ కాంట్రాక్టు ఇవ్వాలని చూస్తున్నారు. వేరే వాళ్లు ఎంటర్ అవ్వకుండా చూడండి – కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తిక్కారెడ్డి, కెడీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి
... సీఎంకు రాసిన ఈ లేఖలు ప్రభుత్వాస్పత్రిలో సెక్యూరిటీ సబ్ కాంట్రాక్టు కోసం నేతల మధ్య పోరాటానికి అద్దం పడతాయి.

నిబంధనలకు విరుద్ధంగా
కనపడిన కాడికి దోచేయడంలో ప్రభుత్వ పెద్దల అడుగుజాడల్లోనే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు నడుస్తున్నారు. మందుల సరఫరా, అత్యవసర వైద్య సేవలు, సెక్యూరిటీ శానిటేషన్ కాంట్రాక్ట్‌ల్లో దోపిడీతో పాటు ఏకంగా వైద్య కళాశాలలనే ప్రైవేటుకు కట్టబెట్టేస్తున్న ప్రభుత్వ పెద్దలు ఆరోగ్య శాఖను ఆదాయ వనరుగా మార్చేశారు. వారి అడుగు జాడల్లోనే టీడీపీ ప్రజాప్రతినిధులు కూడా తమ అనుచరులకు కాంట్రాక్టులు ఇప్పించడం ద్వారా ప్రభుత్వాస్పత్రుల్లో దోపిడీకి పోటీపడుతున్నారు.
‘మా ఆస్పత్రికి అదనపు పడకలు మంజూరు చేయండి. ఖాళీ పోస్టులను భర్తీ చేయండి. అత్యాధునిక పరికరాలు ఇవ్వండి.’ అంటూ ప్రభుత్వాన్ని కోరాల్సింది పోయి.. మేం చెప్పిన వారికి సబ్ కాంట్రాక్ట్‌లు ఇచ్చేలా చూడండి అంటూ పోటాపోటీగా లేఖలు సంధిస్తున్నారు. సత్యసాయి నుంచి శ్రీకాకుళం జిల్లా వరకూ అన్ని చోట్ల ఇదే పరిస్థితి.
7 శాతం కమీషన్ ముట్టజెప్పేలా..
కొద్ది నెలల కిందట ఏపీవీవీపీ, డీఎంఈ ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్ నిర్వహణకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో ఏడు శాతం కమీషన్ ముట్టజెప్పేలా తన సన్నిహితుడి ద్వారా ప్రధాన కాంట్రాక్టర్లతో అమాత్యుడు డీల్ కుదుర్చుకున్నట్టు వైద్య శాఖలో చర్చ జరుగుతోంది. టెండర్ ప్రక్రియలో సైతం జోక్యం చేసుకుని తనతో డీల్ కుదుర్చుకున్న సంస్థలకు అడ్డదారుల్లో కాంట్రాక్టులు కట్టబెట్టేశారు. ఈ కాంట్రాక్టర్ల నుంచి కూటమి ప్రజాప్రతినిధులు తమ అనుచరుల పేరిట సబ్ కాంట్రాక్టులు తీసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం సెక్యూరిటీ, శానిటేషన్ సబ్ కాంట్రాక్టుకు ఇవ్వడానికి వీల్లేదు.
ఈ నిబంధనలను తుంగలో తొక్కి మరీ సబ్ కాంట్రాక్టుల తంతు నడుస్తోంది. కర్నూలు జీజీహెచ్‌లో సెక్యూరిటీ సబ్ కాంట్రాక్ట్ వ్యవహారంలో ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన వ్యక్తులు గొడవలు పడి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. ఈ నేపథ్యంలో తాము సిఫార్సు చేసిన వారికే సబ్ కాంట్రాక్టులు ఇప్పించాలంటూ మంత్రి భరత్, ఇతర ప్రజాప్రతినిధులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సీఎంకు లేఖలు రాశారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే తన పరిధిలోని పెద్దాస్పత్రిలో ప్రతి కాంట్రాక్టును తాను సూచించిన వారికి సబ్ కాంట్రాక్టు ఇచ్చేయాలంటూ ఏకంగా రూలింగ్ ఇచ్చేశారు.
ఇప్పటికే సెక్యూరిటీ సబ్ కాంట్రాక్ట్‌ను ఆమె చేజిక్కించుకున్నారు. శానిటేషన్ కాంట్రాక్టును ఆమె చెప్పిన వారికి ఇచ్చేందుకు ప్రధాన కాంట్రాక్టర్ అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. అనంతపురం జీజీహెచ్ శానిటేషన్ సబ్ కాంట్రాక్టు కోసం స్థానిక ప్రజాప్రతినిధి, పక్క నియోజకవర్గంలోని మహిళా ఎమ్మెల్యే కుమారుడు పోటీపడుతున్నారు. ప్రాణాపాయ స్థితిలోఉండే రోగులకు అందించే ఆక్సిజన్ సరఫరాలోనూ కాసుల కోసం టీడీపీ ప్రజాప్రతినిధులు పోటీపడుతున్నారు. ఆక్సిజన్ సరఫరా కాంట్రాక్టర్‌ను బెదిరించి వారు చెప్పిన వారికి ఎక్కడికక్కడ సబ్ కాంట్రాక్టులు ఇప్పించేసుకున్నారు.


