కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నాటి నేరాలే.. నేటి కేసులు 

Kotamreddy Sridhar Reddy  Indiscriminate Attacks And Plays Double Game - Sakshi

దళిత, ముస్లిం నేతలపై విచక్షణారహితంగా దాడులు

11 మందితో కలిసి కిడ్నాప్‌ చేసి హత్యాయత్నం

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఆదేశాలతో అరెస్ట్‌లు షురూ

నిందితులను అరెస్ట్‌ చేస్తే రాజకీయ ఆగమాగం  

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు కొత్త డ్రామాకు తెర లేపాడు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం తన అనుచరగణంతో అరాచకాలకు పాల్పడ్డాడు. లెక్కకు మించి నేరాలు చేశాడు. అతనిపై కేసులు పెట్టేందుకు బాధితులు సాహసం చేయలేకపోయారు. పోలీసులకు సాక్షం చెప్పేందుకు ధైర్యం చేయలేకపోయారు. నేరుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.  ఆ కమిషన్‌ ఆదేశాలతో పోలీసులు కేసులు నమోదు చేస్తే ప్రభుత్వం కక్ష సాధిస్తుందని ఆగమాగం చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.  

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  నేరాలు చేసింది ఆయన. నెపం ప్రభుత్వంపై నెట్టేందుకు రాజకీయ రంగు పులుముతూ ఆగమాగం చేస్తున్నాడు. ఎమ్మెల్యేననే అధికారంతో తన మందీమార్బలాన్ని అడ్డం పెట్టుకుని మదమెత్తిన మత్తగజంలా అరాచకాలు సృష్టించానని ఇటీవల పచ్చమీడియాలో ఒప్పుకున్నాడు. కోటంరెడ్డి అప్పటి నేరాలపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఆదేశాల మేరకు కేసులు నమోదు కావడంతో ప్రభుత్వ పెద్దలు తనపై కక్ష సాధిస్తున్నారంటూ తాను నంగనాచినంటూ రాజకీయంగా లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నాడు.

నేరం చేసిన వాడు ఎవరైనా చట్టానికి అతీతులు కారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా నిందితుడే అని పోలీసుల విచారణలో నిగ్గు తేల్చారు. దీంతో తనను అరెస్ట్‌ చేయడం ఖాయమని తెలిసి ముందుగానే.. అస్కార్‌ అవార్డు గ్రహీతల నటనకు మించి నంగి రాజకీయాలు చేస్తున్నాడు.  టీడీపీకి చెందిన దళితనేతపై హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్‌ను కూడా రాజకీయంగా వాడుకోవడంపై దళిత  సంఘాలు భగ్గుమంటున్నాయి. 

అసలేం ఏం జరిగింది.. 
గతేడాది అక్టోబర్‌ 17న టీడీపీకి చెందిన ముస్లిం నేత అల్లాభక్షు నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యేపై సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారంటూ అయన అనుచరులు ద్వారా దాడి చేయించారు. ఆ సమయంలో అతనికి అండగా ఉన్నాడన్న కారణంతో అదే పార్టీకి  చెందిన దళిత నేత మాతంగి కృష్ణను టార్గెట్‌ చేసి అక్టోబర్‌ 18వ తేదీన కోటంరెడ్డి సోదరుల ప్రోత్సాహంతో దాదాపు 11 మంది ఆయన అనుచరులు దళిత నేతను కారులో ఎక్కించుకుని విచక్షణా రహితంగా దాడి చేశారు  ముందురోజే  అతని బైక్‌ను తగులబెట్టారు. ఆయా ఘటనలపై అప్పట్లో హత్యాయత్నం, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే పాత్ర ఉందని తెలియడంతో పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ లోపు నిందితులపై చర్యలు చేపట్టలేదని దళితనేత మాతంగి కృష్ణ ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో వారి ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు వేగవంతం  చేశారు. అందులో భాగంగానే ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించేలా చేశారు. మిగిలిన నిందితులను కూడా అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది.  

ముస్లింల గొంతునొక్కుతూ.. 
నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ప్రజల గొంతుకనై ప్రశ్నిస్తానంటూ చెప్పుకునే ఎమ్మెల్యే  శ్రీధర్‌రెడ్డి రెండు రోజుల క్రితం ముస్లింలకు అన్యాయం జరిగిందంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ముస్లింలపై తన అనుచరులతో దాడులు చేయించినప్పుడు వారు గుర్తుకు రాలేదా అని మండిపడుతున్నారు. టీడీపీకి చెందిన అల్లాభక్షుపై దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే.  ఇద్దరు జర్నలిస్టులు, పలువురు నేతలపై దాడులు చేయించిన  ఘటనలు ఉన్నాయి.    

ఇదేనా దళితుల ప్రేమ
దళితులంటే తనకు ఎంతో ప్రేమ ఉందని సమావేశాల్లో ఊదరగొడుతున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి దళిత నేతపై పాశవికంగా దాడులు చేయించడమేనా దళిత ప్రేమంటే? అంటూ నగరంలోని దళితులు ప్రశ్నిస్తున్నారు. అధికార మదమెక్కి చేసిన అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నిస్తే వారిని టార్గెట్‌ చేసి దాడులు చేయించాడు. రౌడీ మూకలను ప్రోత్సహించి దాడులు చేయించేవాడు. ఏకంగా టీడీపీకి చెందిన విద్యార్థి నేతపై కూడా హత్యాయత్నం చేయించాడు. ఈ రౌడీ రాజకీయాన్ని సింహపురికి పరిచయం చేసిన ఎమ్మెల్యే దళితనేతపై దాడి కేసులో నిందితులను అరెస్ట్‌ చేస్తే అదేదో రాజకీయ కుట్ర అంటూ మీడియా ముందుకు రావడంపై ప్రజలు మండి పడుతున్నారు. ప్రధానంగా దళితలపై కపట ప్రేమ నటించే దానికి ఈ ఘటనే  ఉదాహరణ అంటూ విమర్శిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top