చివరి దశకు ఖరీఫ్‌

Kharif season is nearing its end in Andhra Pradesh - Sakshi

79 శాతం దాటిన పంటల సాగు

సాధారణ విస్తీర్ణం 92.04 లక్షల ఎకరాలు

ఇప్పటికే 72 లక్షల ఎకరాల్లో పంటల సాగు

30 లక్షల ఎకరాల్లో వరి.. 14.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు

రికార్డు స్థాయిలో నూనెగింజల సాగు

భారీగా పెరిగిన ఆముదం, సోయాబీన్, నువ్వుల సాగు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్‌ చివరి దశకు చేరుకుంటోంది. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలకు తోడు అడుగడుగునా ప్రభుత్వం అండగా నిలబడడంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో పంటలు సాగు చేస్తున్నారు. సీజన్‌కు ముందుగానే ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచిన ప్రభుత్వం ఏ దశలోనూ రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టింది. దీంతో ఇప్పటికే 79 శాతం మేర పంటలు సాగయ్యాయి. మరోవైపు.. ముందస్తుగా సాగునీరు విడుదల చేయడంతో పాటు పుష్కలంగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్‌ సాఫీగా సాగుతోంది.

శివారు భూములకు సమృద్ధిగా సాగునీరు
ఇక సీజన్‌ సాధారణ వర్షపాతం 556 మిల్లీమీటర్లు (ఎంఎం) కాగా, ఇప్పటివరకు 424.6 ఎంఎం వర్షపాతం కురవాల్సి ఉంది. కానీ, 429.9 ఎంఎం అధిక వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో 454 ఎంఎంకు 466.6 ఎంఎం.., రాయలసీమలో 200 ఎంఎంకు 257.5 ఎంఎం వర్షపాతం కురిసింది. సాధారణం కంటే రాయలసీమలో 28 శాతం, కోస్తాంధ్రలో 2.8 శాతం అధిక వర్షపాతం నమోదైంది. గోదావరి, కృష్ణా, పెన్నా వంటి నదులకు వరదలు పోటెత్తడంతో శివారు భూములకు సైతం సమృద్ధిగా సాగునీరు అందుతోంది. ఫలితంగా తెగుళ్లు బెడద ఎక్కడా కన్పించడంలేదు. ప్రస్తుతం వరి పంట పొట్ట దశకు చేరుకోగా మిగిలిన పంటలు కూడా కాయకట్టే దశకు చేరుకున్నాయి.

30 లక్షల ఎకరాలు దాటిన వరి నాట్లు
ఖరీఫ్‌ సాధారణ విస్తీర్ణం 92.04 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 72 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ప్రధానంగా..
► వరి సాధారణ విస్తీర్ణం 38.98 లక్షల ఎకరాలు అయితే ఇప్పటికే 30 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి.
► అపరాలు సాధారణ విస్తీర్ణం 8.28 లక్షల ఎకరాలు కాగా, 4.75 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి.
► నూనెగింజల సాగు విస్తీర్ణం 17.96 లక్షల ఎకరాలు అయితే.. ఇప్పటికే 15 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి.
► ఇక ఇతర పంటల విషయానికి వస్తే 14.70 లక్షల ఎకరాల్లో పత్తి, 2.82 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.55 లక్షల ఎకరాల్లో మిరప, 93వేల ఎకరాల్లో చెరకు, 45వేల ఎకరాల్లో ఉల్లి, 35 వేల ఎకరాల్లో పసుపు పంట సాగయ్యాయి.

పెరిగిన ఆముదం, నువ్వులు, సోయాబీన్‌ సాగు
ఈ ఏడాది వేరుశనగ సాగు తగ్గగా, ఆ మేర ఆముదం, నువ్వులు, సోయాబీన్‌ రికార్డుస్థాయిలో సాగయ్యాయి.
► వేరుశనగ సాధారణ విస్తీర్ణం 16.84 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 13.42 లక్షల ఎకరాల్లో సాగైంది. గతేడాది ఇదే సమయానికి 15.37లక్షల ఎకరాల్లో సాగైంది.
► ఈ ఏడాది వేరుశనగ రైతులు ఇతర పంటల సాగువైపు మళ్లారు. ఫలితంగా నువ్వులు సాధారణ విస్తీర్ణం 32వేల ఎకరాలు అయితే.. ఇప్పటివరకు 42వేల ఎకరాల్లో సాగైంది.
► అలాగే, ఆముదం సాధారణ విస్తీర్ణం 59వేల ఎకరాలు కాగా, 63వేల ఎకరాల్లో సాగైంది.
► పొద్దుతిరుగుడు సాధారణ విస్తీర్ణం 9,645 ఎకరాలు అయితే ఇప్పటివరకు 15,932 ఎకరాల్లో సాగైంది.
► ఇక సోయాబీన్‌ సాధారణ విస్తీర్ణం 3,665 ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 22,607 ఎకరాల్లో సాగైంది. ఈ–క్రాపింగ్‌ కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు 46.79 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 15.12 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలతో పాటు 10,427 ఎకరాల్లో మల్బరీ (పట్టు) పంటల సాగును నమోదు చేశారు.

సెప్టెంబర్‌లోనూ సమృద్ధిగా ఎరువులు..
సీజన్‌కు 19.02 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటివరకు 17.21 లక్షల టన్నులు అందుబాటులో ఉంచారు. ఇందులో 9.99 లక్షల టన్నుల అమ్మకాలు జరగగా, ఇంకా 7.22 లక్షల టన్నులు (యూరియా 3.24 లక్షల టన్నులు, కాంప్లెక్స్‌ 2.76 లక్షల టన్నులు, డీఏపీ 67,394 టన్నులు, ఎంఓపీ 29,785 టన్నులు) అందుబాటులో ఉన్నాయి. ఆర్బీకేల్లో ప్రత్యేకంగా 1.98 లక్షల టన్నుల ఎరువులను నిల్వచేయగా, ఇప్పటివరకు 1.23 లక్షల టన్నుల ఎరువులను రైతులు కొనుగోలు చేశారు. ఇంకా 74,823 టన్నులు (యూరియా–43,478 టన్నులు, డీఏపీ–15,627 టన్నులు, కాంప్లెక్స్‌–11,493 టన్నులు, ఎంఒపీ–4128 టన్నులు, ఎస్‌ఎస్‌పీ–97 టన్నులు) నిల్వలు ఉన్నాయి. సెప్టెంబర్‌æలో 5.22 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ఆ మేరకు కేంద్రం కేటాయింపులు జరిపింది. ఈ నిల్వలు రాష్ట్రానికి రావాల్సి ఉంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top