హైకోర్టు ఆవరణలో మళ్లీ ఎత్తు పరీక్ష  | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఆవరణలో మళ్లీ ఎత్తు పరీక్ష 

Published Sat, Nov 25 2023 3:56 AM

A key turning point in the recruitment process for SI posts - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎస్సై పోస్టుల నియామక ప్రక్రియ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. గత నోటిఫికేషన్‌లో ‘ఎత్తు’ విషయంలో అర్హత సాధించిన అభ్యర్థులను తాజా నోటిఫికేషన్‌ కింద అనర్హులుగా ప్రకటించడంపై పిటిషన్‌ దాఖలు చేసిన అభ్యర్థులకు తమ పర్యవేక్షణలోనే ‘ఎత్తు’ పరీక్ష నిర్వహిస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. హైకోర్టు ప్రాంగణంలోనే దీనికి సంబంధించిన కొలతలు తీసుకుంటామని తేల్చిచెప్పింది.

ఎత్తు విషయంలో అధికారులపై పిటిషనర్లు చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే, ఒక్కో పిటిషనర్‌కు రూ.లక్ష జరిమానా విధిస్తామని స్పష్టంచేసింది. తాము ప్రతిపాదించిన విధంగా ఎత్తు కొలిచే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ గుహనాథన్‌ నరేంద్ర, జస్టిస్‌ న్యాపతి విజయ్‌ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. 

సింగిల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు..
ఎస్సై నియామక ప్రక్రియలో భాగమైన దేహదారు ఢ్య పరీక్షలకు సంబంధించి ఎత్తు, ఛాతి చుట్టుకొలతను హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా కొలి చిన అధికారులు అందులో తమను అనర్హులుగా ప్రకటించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఆరుగొళ్లు దుర్గాప్రసాద్, మరో 23 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 2018 నోటిఫికేషన్‌లో అర్హులుగా ప్రకటించిన తమను ఎత్తు విషయంలో తాజా నోటిఫికేషన్‌లో అనర్హులుగా ప్రకటించారన్నారు.

వాదనలు విన్న సింగిల్‌ జడ్జి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ ఎస్సై నియామకాల కోసం గత నెలలో నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలను తదుపరి ఉత్తర్వులు జారీచేసేంత వరకు వెల్లడించవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు నియామక బోర్డు ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశాయి. ఈ అప్పీల్‌పై శుక్రవారం జస్టిస్‌ నరేంద్ర నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా ఎత్తు కొలిచామని ప్రభుత్వ న్యాయవాది జీవీఎస్‌ కిషోర్‌కుమార్‌ ధర్మాసనానికి నివేదించారు. ఈ పరీక్షలో పిటిషనర్లు అర్హత సాధించలేదన్నారు. అయితే, ఈ విషయాన్ని సింగిల్‌ జడ్జి సరైన కోణంలో పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్‌ స్పందిస్తూ.. 2018లో ఎత్తు విషయంలో అర్హత సాధించిన అభ్యర్థులు, తాజా నోటిఫికేషన్‌లో ఎలా అనర్హులవుతారని ప్రశ్నించారు. వాదనలు విన్న ధర్మాసనం, తమ పర్యవేక్షణలో హైకోర్టు ప్రాంగణంలోనే మరోసారి ఎత్తు పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. 

Advertisement
 
Advertisement