
ప్రతిదీ తానే కనిపెట్టానంటారు
అమరావతిలో చేపల పెంపకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మకానికి పెట్టేశారు
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపాటు
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు ప్రతీదీ తానే కనిపెట్టానని అంటారు. సైబరాబాద్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు. ఇప్పుడు క్వాంటం వ్యాలీ అంటున్నాడు. నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు. ఉండేది ఒకటే వ్యాలీ. అది ఆక్వా వ్యాలీ మాత్రమే. అమరావతిలో చిన్న చేపలను తీసుకొచ్చి చేపల పెంపకం చేస్తే కచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. అంతకుమించి చంద్రబాబు పెట్టిన అమరావతిలో ఎటువంటి పురోగతి ఉండదు. కేవలం ఫిషరీస్ మాత్రం బాగా అభివృద్ధి చెందుతుంది’ అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎద్దేవా చేశారు.
గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మకానికి పెట్టేశారని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే రూ.1.90 లక్షల కోట్ల విలువైన ఏపీఎండీసీ గనులను కేవలం రూ.9 వేల కోట్ల కోసం తనఖా పెట్టారని విమర్శించారు. రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతుంటే.. పవన్ సినిమా టికెట్ ధరను రూ.600 పెంచుకునేలా అనుమతి ఇచ్చారన్నారు. రైతుకు గిట్టుబాటు ధర గురించి ఆలోచించట్లేదన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచిస్తున్న దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు.
ఎల్లోమీడియా డైరెక్షన్‌లోనే సిట్ దర్యాప్తు
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ దర్యాప్తు పేరుతో ఏర్పాటు చేసిన సిట్ చట్ట ప్రకారం కాకుండా ఎల్లో మీడియా డైరెక్షన్‌లో పనిచేస్తోందని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. నిత్యం కొత్త కథను అల్లి ఎల్లో మీడియా ప్రచురిస్తుంటే.. దానిని బట్టి సిట్ తన దర్యాప్తును ముందుకు తీసుకువెళుతోందన్నారు. కోర్టుకు సమరి్పంచని రిమాండ్ రిపోర్ట్‌లు కూడా ఎల్లో మీడియాలో ఒకరోజు ముందుగానే ప్రచురితం అవుతున్నాయంటేనే సిట్ ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చన్నారు.
డిస్టిలరీల నుంచి కమీషన్లు తీసుకున్నారని సిట్ ప్రధానంగా ఆరోపిస్తోందని.. వాస్తవంగా చూస్తే రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీలన్నీ చంద్రబాబు అనుమతులిచి్చనవేనని ఆయన గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. మద్యం కుంభకోణం జరిగిందని చెప్పడానికి సిట్ వద్ద ఒక్క ఆధారం కూడా లేదని, కేవలం వైఎస్సార్‌సీపీని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే కక్షపూరితంగా కేసును సృష్టించారన్నారు. ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రభుత్వ తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
పాలన చేతకాదని పవన్ చెప్పేశారు
తాను పరిపాలకుడిని కాదని, తనకు పాలన చేతకాదని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఒప్పుకున్నారని కేతిరెడ్డి పేర్కొన్నారు. గలాటాలు చేయడానికి, పోరాటాలు చేయడానికి మాత్రమే తాను పనికొస్తానని పవన్ చెప్పారన్నారు. అతన్ని ఒక ఆయుధంగా మాత్రమే టీడీపీ వాడుకుంటోందన్నారు. పవన్ బలం, బలహీనత ఆయన అభిమానులకు అర్థమైందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.