
తాడిపత్రిలోని ఆయన ఇంటిని కూల్చొద్దు
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నడుచుకోండి
మునిసిపల్ అధికారులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు ఊరటనిచ్చింది. తాడిపత్రిలోని ఆయన ఇంటిని కూల్చొద్దని పురపాలకశాఖ అధికారులను ఆదేశించింది. నివాస సముదాయాల కూల్చివేత విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాడిపత్రిలోని సర్వే నంబర్ 639, 640, 641లలో 577.55 చదరపు గజాల స్థలంలో తాము నిర్మించుకున్న ఇంటిని కాల్చివేసేందుకు పురపాలక శాఖ అధికారులు యత్నిస్తున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పెద్దారెడ్డి సతీమణి కేతిరెడ్డి రమాదేవి సోమవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ విజయ్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కామిరెడ్డి నవీన్‌కుమార్ వాదనలు వినిపించారు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే పిటిషనర్ ఇంటిని నిర్మించారని నవీన్ తెలిపారు. అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారని తెలిపారు. జూన్ 21న అధికారులు సర్వే నిమిత్తం నోటీసులు జారీ చేసి, 28న సర్వేకు హాజరుకావాలని చెప్పారన్నారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చారన్నారు. సర్వే కోసం పిటిషనర్ భర్త తాడిపత్రి వెళ్లారని, అయితే పోలీసులు ఆయన్ను అడ్డుకుని వెనక్కి పంపారని తెలిపారు.
అధికారులు 28న ఇంటికి వచ్చి మార్కింగ్ చేసి ఇంటి కూల్చివేతకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. చట్టవిరుద్ధంగా ఇళ్లను కూల్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పు ఇచ్చిందన్నారు. పురపాలకశాఖ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ అధికారులు సర్వే మాత్రమే చేశారని, ఒకవేళ కూల్చివేత చేపడితే చట్ట ప్రకారం చేస్తారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఏం చేసినా చట్ట ప్రకారమే చేయాలని, పిటిషనర్ ఇంటిని కూల్చొద్దని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు స్పష్టంచేశారు.