అన్ని ప్రాంతాల సుస్థిరాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Karikal Valaven Comments At closing ceremony of Vanijya Utsav - Sakshi

వాణిజ్య ఉత్సవ్‌ ముగింపు సమావేశంలో కరికాల వలవన్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలు పారిశ్రామికంగా సుస్థిరమైన వృద్ధిని సాధించే విధంగా ప్రాంతాల వారీగా, రంగాల వారీగా ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.కరికాల వలవన్‌ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే వెనుకబడిన ప్రాంతమైన వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నట్టు తెలిపారు. విజయవాడలో రెండు రోజులపాటు నిర్వహించిన వాణిజ్య ఉత్సవ్‌ మంగళవారం ఘనంగా ముగిసింది. అంతకుముందు రాష్ట్రంలో ఎగుమతులు అవకాశాలు, విధానాలు అనే అంశంపై కరికాల వలవన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రమంతా సుస్థిరమైన సమ్మిళిత వృద్ధి సాధించాలన్నది సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు ప్రభుత్వం జీవిత కాలం చేయూత అందిస్తుందన్నారు.

ఇందుకోసం సింగపూర్‌ తరహాలో వైఎస్సార్‌ ఏపీ వన్‌ పేరుతో సేవలు అందించనున్నామని, ఇది డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కేవలం సులభతర వాణిజ్య అవకాశాలే కాకుండా ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు నిర్వహణ వ్యయం భారీగా తగ్గించే విధంగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వస్తువుల ఉత్పత్తి ధరలో సరుకు రవాణా వ్యయం 13 శాతంగా ఉందని, దీన్ని 8 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా పటిష్ట ప్రణాళికలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధితోపాటు గోడౌన్లు, లాజిస్టిక్‌ సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. తిరుపతి ఎయిర్‌ పోర్టులో కార్గో సేవలను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు దగదర్తిలో కార్గో కోసం ప్రత్యేకంగా విమానాశ్రయం అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు.

రాష్ట్రం నుంచి వెళ్తున్న మూడ కారిడార్లలో అన్ని మౌలిక వసతులతో నోడ్‌లను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. విశాఖ సెజ్‌ జోనల్‌ కమిషనర్‌ ఎ.రామ్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. క్లిష్ట సమయంలో కూడా వీసెజ్‌ అద్భుతమైన పనితీరు కనబరుస్తోందన్నారు. ఈ ఆర్థిక ఏడాదిలో సెప్టెంబర్‌ 20 నాటికి గతేడాదితో పోలిస్తే ఎగుమతులు 26 శాతం పెరిగి రూ.53,410 కోట్లకు చేరినట్టు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు కృష్ణ జీవీ గిరి మాట్లాడుతూ.. ఎగుమతుల్లో 90 శాతం పోర్టుల ద్వారానే జరుగుతున్నాయని, అందుకోసమే కొత్త పోర్టుల నిర్మాణంతో పాటు, పోర్టు ఆథారిత పరిశ్రమలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. ఏపీ మారిటైమ్‌ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా మూడు పోర్టులు అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. మెడ్‌టెక్‌ జోన్‌ సీఈవో, ఎండీ జితేంద్రశర్మ మాట్లాడుతూ మెడికల్‌ టెక్నాలజీ రంగంలో ఎగుమతులకు అపార అవకశాలున్నాయన్నారు.

సదస్సు విజయవంతం
రెండు రోజుల పాటు నిర్వహించిన వాణిజ్య ఉత్సవ్‌ విజయవంతమైందని పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జవ్వాది సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. సదస్సులలో 650 మందికిపైగా ఎగుమతి దారులు పాల్గొన్నారని, 29కి పైగా సంస్థలు ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాయని, 15కు పైగా ఎగుమతిదారుల సంఘాలు, వివిధ దేశాల రాయబారులు పత్యక్షంగాను, పరోక్షంగాను పాల్గొన్నారని వివరించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌కు అవార్డుల్లు ప్రకటించారు. అత్యధిక మందిని ఆకట్టుకున్న ఎంపెడా స్టాల్‌ మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో ఆర్‌కే హెయిర్‌ ప్రొడక్ట్స్, ఎంఐజే పార్క్, టెక్సోప్రోసిల్‌ నిలిచాయి. ఎగ్జిబిషన్‌లో స్టాల్స్‌ ఏర్పాటు చేసిన వారిని జ్ఞాపికలతో సత్కరించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top