
రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలు
వాటికి అనుబంధంగా దాదాపు 75 వేల బెల్టు షాపులు
ప్రజారోగ్యానికి పెను ముప్పు.. గీతకార్మికుల ఉపాధికి విఘాతం
వృత్తి రక్షణకు కల్లుగీత కార్మికుల సమరశంఖం
బెల్టు షాపులు తొలగించాలని ఆందోళన
నేటి నుంచి 58 రోజుల పోరాటానికి తీర్మానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుండటం ప్రజారోగ్యానికి పెనుముప్పుగా పరిణమించింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో వీధివీధినా తెరుచుకున్న మద్యం బెల్టుషాపుల దెబ్బకు కల్లుగీత వృత్తి కుదేలైంది. ఫోన్ చేయగానే మద్యం డోర్ డెలివరీ చేస్తుండటంతో గీతవృత్తికి కష్టకాలం దాపురించింది. అంతేకాదు.. యానాం, గోవా నుంచి రాష్ట్రంలోకి అక్రమ మద్యం పోటెత్తడం, రాష్ట్రంలోనే నేరుగా నకిలీ మద్యం తయారీతో అంతంత మాత్రంగా ఉన్న కల్లుగీత కార్మికుల ఉపాధి ఘోరంగా దెబ్బతింది.
మద్యం షాపులు 3,396.. బెల్టు షాపులు 75 వేలు
రాష్ట్రంలో ప్రభుత్వం 3,396 మద్యం షాపులకు లైసెన్స్ ఇచ్చింది. వీటికి అనుబంధంగా పట్టణాలు, గ్రామాలనే భేదం లేకుండా వీధివీధినా బెల్టు షాపులు తెరుచుకున్నాయి. కూటమి నేతల కనుసన్నల్లోని సిండికేట్ల పర్యవేక్షణలోనే 75 వేల బెల్టుషాపులు నడుస్తున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతుండటంతో కల్లు అమ్మకాలు పడిపోయాయి. దీంతో తాటిచెట్ల నుంచి కల్లును సేకరించే వృత్తిపై ఆధారపడిన గీత కార్మికుల బతుకుదెరువు దెబ్బతింటోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కల్లుగీత వృత్తి మనుగడ ప్రమాదంలో పడింది. రాష్ట్రంలో 2,400 సొసైటీలు, 2,100 కల్లుగీత సంఘాల పరిధిలో లక్షలాది మంది కల్లుగీత కార్మికులు కల్లు అమ్మకాలు లేక ఆందోళన చెందుతున్నారు.
‘పశ్చిమ’లో సమర శంఖం
రాష్ట్రంలో కల్లుగీత వృత్తి దెబ్బతినడంతో తక్షణ చర్యల కోసం గీత కార్మికులు ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన 75 వేల అనధికార మద్యం బెల్టు షాపులను తొలగించి తమ వృత్తి పరిరక్షణకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో ఇప్పటికే పశ్చిమగోదావరి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. దీనికి కొనసాగింపుగా రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. సోమవారం నుంచి సెపె్టంబర్ 30వ తేదీ వరకు 58 రోజులపాటు పోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కారి్మక సంఘం తీర్మానించింది.
డిమాండ్లు ఇవీ..
⇒ ఉద్యమ కార్యాచరణలో భాగంగా కల్లుగీత కార్మిక సంఘం పలు డిమాండ్లను తెరపైకి తెచ్చింది. లైసెన్స్ కలిగిన మద్యం షాపులు, బార్‌లకు నిర్దేశించిన వేళలు కచ్చితంగా పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
⇒ సిండికేట్ల పర్యవేక్షణలోని అనధికార బెల్టుషాపులను అరికట్టాలి. అనధికార మద్యం విక్రయాలు, మద్యం తయారీని నిరోధించాలి.
⇒ కేరళ, తెలంగాణ తరహాలో కల్లుగీత వృత్తిని ప్రోత్సహించి ఏపీలోని కల్లుగీత కార్మికులకు ఉపాధి పెంచి ఆదుకోవాలి.
⇒ ఆరోగ్యాన్ని దెబ్బతీసే రసాయనాలతో తయారయ్యే బీరు, బ్రాందీ, విస్కీలను ప్రోత్సహించకుండా ఔషధ గుణాలున్న తాటికల్లు సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి.
⇒ ప్రతి జిల్లాలో నీరా కేంద్రాలు పెట్టాలి.
⇒ తాటిచెట్ల నుంచి పడి చనిపోతున్న గీత కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.
⇒ కల్లు గీత కార్మిక కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలి.
⇒ కల్లుగీత వృత్తిదారులకు రక్షణ చట్టం తీసుకు రావాలి.
⇒ 200 యూనిట్లు ఉచిత విద్యుత్, అన్నివృత్తుల వారికీ 50 ఏళ్లకే పింఛన్, అధునాతన పరికరాలు ఇవ్వాలి.
⇒ వృత్తిదారుల పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పూర్తి సబ్సిడీతో కూడిన ఉపాధి రుణాలు ఇవ్వాలి.