కోర్టుల అతి జోక్యం సరికాదు

Justice Chandra Kumar Comments On Media Rights - Sakshi

ఆర్టికల్‌–19 ప్రకారం సత్యాన్ని చెప్పే హక్కు పత్రికలకు ఉంది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ‘భావాలను, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తంచేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అలాగే.. పత్రికలు, ప్రసార మాధ్యమాలు వాస్తవాన్ని నివేదించవచ్చు. ఆర్టికల్‌–19 ప్రకారం సత్యాన్ని వెల్లడించే హక్కు వాటికి ఉంది. దీనిని ఏ న్యాయస్థానం కాదనడానికి వీల్లేదు’.. అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ చంద్రకుమార్‌ అన్నారు. ఏపీలో చోటుచేసుకున్న పరిణామాలపై శుక్రవారం ఆయన స్పందించారు. మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెలతోపాటు 13 మందిపై ఆ రాష్ట్ర ఏసీబీ నమోదు చేసిన కేసుల వివరాలను పత్రికలు, టీవీలు, సోషల్‌ మీడియాలో ప్రసారం చేయడానికి వీల్లేదంటూ ఏపీ హైకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆయన పలు అంశాలపై స్పష్టంగా తన అభిప్రాయాలను వెల్లడించారు. వాస్తవాన్ని ప్రచురించకుండా, వెల్లడించకుండా అడ్డుకోవడమంటే అది భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని, అసాధారణ విషయాల్లో మాత్రమే న్యాయస్థానాలు ఇలాంటి ఆదేశాలిస్తాయని తెలిపారు. పత్రికలు, టీవీలు, సోషల్‌ మీడియా తమ అభిప్రాయాలతో, ఊహాగానాలతో వాస్తవాలను వక్రీకరించే ప్రమాదముందని భావించినప్పుడు కూడా న్యాయస్థానాలు ఇలాంటి తీర్పులు ఇవ్వవచ్చునని చెప్పారు. అయితే, ఒక సంఘటనను, పరిణామాన్ని యధాతథంగా వెల్లడించేందుకు అడ్డుచెప్పాల్సిన అవసరంలేదన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

పాలనలో అంతిమ నిర్ణయం ప్రభుత్వానిదే
ప్రజల సంక్షేమం కోసం విధానాలను రూపొందించి అమలుచేయడం ప్రభుత్వం బాధ్యత. అందులో న్యాయస్థానాలు అతిగా జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. పరిపాలనాపరమైన అన్ని అంశాల్లోనూ అంతిమ నిర్ణయం ప్రభుత్వానికే ఉంటుంది. అసలు విధానాలనే రూపొందించొద్దు, అమలుచెయొద్దని కోర్టులు చెప్పలేవు. ప్రభుత్వ విధానాలవల్ల, నిర్ణయాలవల్ల అన్యాయం జరిగితే అప్పుడు బాధితుల పక్షాన కోర్టులు తీర్పులు చెప్పవచ్చు.

నేర విచారణ చెయ్యొచ్చు
భూ కుంభకోణాలు, ఆర్థిక నేరాలు, అవినీతి వంటివి చోటుచేసుకున్నట్లు ప్రభుత్వం భావిస్తే విచారణకు ఆదేశిస్తుంది. ఈ మేరకు విచారణ సంస్థలు  ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపడతాయి. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఇది ప్రభుత్వ బాధ్యత కూడా. కానీ, అసలు అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎలాంటి విచారణ చేయడానికి వీల్లేదంటూ న్యాయస్థానాలు అడ్డుకోవడం సహేతుకం కాదు. ఇదే సమయంలో ప్రభుత్వానికి కూడా కొన్ని పరిమితులున్నాయి. గత ప్రభుత్వాలు తీసుకున్న మొత్తం నిర్ణయాలపైన విచారణ జరిపించడం సాధ్యంకాదు. బహుశా సాంకేతికంగా కూడా వీలుకాదు. 

ప్రభుత్వ ఒప్పందాలకు కట్టుబడి ఉండాలి
అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రజలతో, వివిధ సంస్థలతో చేసుకునే ఒప్పందాలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. సాంకేతిక కారణాలవల్ల ఆ ఒప్పందాలను యధాతథంగా అమలుచేసే అవకాశం లేనప్పుడు బాధితులకు తగిన పరిహారం అందజేయాలి. ఇలాంటి విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటాయి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top