రామాయణం నీతి నేటికీ ఆదర్శనీయమే

Justice B Chandra Kumar Article On Sri RamaNavami - Sakshi

ఏప్రిల్‌ 21న  సీతారామ కల్యాణం  

మన దేశంలో రాముడు కోట్లాదిమందికి దేవుడు, రామనామాన్ని ఎందరో మంత్రంగా జపిస్తారు. రామాయణం నిజంగానే జరిగిందని చెప్పే ఆధారాలను చరిత్రకారులు చూపిస్తారు. మన దేశంలోనే కాక ఇంకా కొన్ని దేశాలలో కొంత భిన్నమైన రామాయణ కథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆదికవి వాల్మీకి రామాయణం అన్నింటికి మూలం. రామాయణం ఇంత ప్రాచుర్యం పొందడానికి, రామనామం ఇంత గొప్ప ప్రభావం చూపడానికి కారణాలు ఏమిటి? మానవ జీవితాన్ని ప్రభావితం చేసే కొన్ని జీవన విధానాలను, జీవిత విలువలను రామాయణం చెప్తున్నది.  అవి ఈనాటికీ అందరికీ ఆదర్శం. అందుచేతనే ఈ నాటికి రామాయణం కథ ఎందరి మీదనో ప్రభావం చూపుతున్నది.

రామాయణం మానవజీవితానికి, సమస్త మానవాళికి, సర్వకాలాలకు,  సర్వ దేశాలకు ఉపయోగపడే శాశ్వత సత్యాలను, జీవన విధానాలను మనకు చెప్తున్నది. రామాయణాన్ని విమర్శించే వారు ఇది వర్ణాశ్రమ ధర్మాన్ని కులవివక్షతను చూపుతుందని విమర్శిస్తారు. కానీ వాల్మీకి రామాయణంలో అడుగడుగునా అన్ని వర్గాల వారిని పిలిచి సంప్రదించినట్లు ఉంది. రామ పట్టాభిషేకానికి నాలుగు వర్ణాల వారిని ఆహ్వానించినట్లు ఉంది. అదీగాక రాముడు, గుహుని ఆతి థ్యాన్ని స్వీకరించాడు. మాతంగ మహర్షి (ఒక చండాల స్త్రీ కుమారుడు)  ఆశ్రమాన్ని దర్శిస్తాడు. ఆ ఆశ్రమంలోని శబరి ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. ఆ విధంగ రాముడు ఎక్కడ కుల వివక్షతను చూపలేదు.

ప్రపంచంలో ఎన్నో రామాయణ కథలు ఉన్నాయి. భిన్నమైన కథలున్నాయి. వాల్మీకి రామాయణంలో ఒకచోట రాముడు జాబాలి వాదనను తిరస్కరిస్తూ ‘బుద్ధుడు దొంగ వంటి వాడు అతడు చెప్పినది నాస్తిక వాదం అని’ అయోధ్య కాండలో రాముడు అన్నట్లు ఉంది. బుద్ధుడు క్రీస్తుపూర్వం 623 సంవత్సరంలో జన్మించాడు. క్రీ.పూ. 483లో సమాధి చెందాడు. ఇక రామాయణం ఎప్పుడు జరిగింది? రాముడు క్రీ.పూ. 5114 సంవత్సరంలో జన్మించాడని కొందరు లెక్కలు వేశారు. ఢిల్లీ చాప్టర్‌ ఆఫ్‌ ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ అన్‌ వేదాస్‌ డైరెక్టర్‌ సరోజ్‌ బాల రామాయణం, భారతాలు జరిగినవనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని రామాయణ కాలం క్రీ.పూ. 7000 సంవత్సరాలలోపు జరిగిందని అంచనా వేశారు.

ఏది ఏమైనా గౌతమబుద్ధుని కంటే కనీసం 1000–700 సంవత్సరాల కంటే ముందే రాముడు ఉన్నాడని చరిత్రకారులు చెప్తున్నారు. రాముడు బుద్ధుని కంటే ముందే అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. దశావతారాల ప్రకారం కూడా రామావతారం, కృష్ణావతారం తర్వాతనే బుద్ధావతారం అని చెప్తారు. అందుచేత రాముడు బుద్ధుడు దొంగ వంటివాడు అని చెప్పడం కచ్చితంగా జరగలేదని చెప్పవచ్చు. ఎందుకంటే రామాయణం జరిగిన  ఎన్నో వందల సంవత్సరాల తరువాతనే బుద్ధుడు జన్మించాడు అంటే రాముడు బుద్ధుడు దొంగ వంటివాడు అనడం కచ్చితంగా  ప్రక్షిప్తమని చెప్పవచ్చు. అలాగే శంబుకుని కథ ప్రక్షిప్తం అని పండితుల, విజ్ఞుల అభిప్రాయం.

రామాయణం ప్రకారం రావణాసురుడు బ్రాహ్మణుడు, వేదాలు చదివిన వాడు. గొప్ప శివ భక్తుడు. అతడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని అధికారానికి, సంపదలకు, భార్యలకు కొదవలేదు. కానీ శూర్పణఖ తప్పుడు సలహాతో కామప్రేరితుడై సీతను అపహరించి వినాశనాన్ని కొనితెచ్చుకున్నాడు. రామాయణాన్ని రచించిన వాల్మీకి మొదట బోయవాడు. రాముడు గుహుని, శబరిల ఆతిథ్యాన్ని స్వీకరించడం, సుగ్రీవునితో స్నేహం చేయడం,  జటాయువుకు దహన సంస్కారాలు చేయడం ఈవిధంగా ఏ కోణంలో చూసినా రామాయణం కులతత్వాన్ని, వర్ణ వివక్షతను సమర్థించదు.  

ఏ గ్రంథమైనా, ఏ మహానుభావుని చరిత్ర అయినా ఏ పురాణ కథ అయినా అందులోని నీతి ఏమిటి.  అది మానవులకు ఇచ్చే సందేశం ఏమిటి?  అనే విషయాలను గమనించాలి. అందులోని మంచిని స్వీకరించాలి. రాముడు దేవుడు కాదని ఎవరైనా వాదిం చినా, రామాయణంలోని నీతిని, జీవన విధానాలను  తప్పుపట్టలేడు కదా. గురువుల, పెద్దల సలహా పాటించాలి, ఆడిన మాటకు కట్టుబడి ఉండాలి, తండ్రి మాటను గౌరవించాలి, భర్త కష్టాల్లో పాలు పంచుకోవాలి, అన్నదమ్ములు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ధర్మ మార్గాన్ని అనుసరించాలి. పరస్త్రీలపై కన్ను వేయరాదు. ఇది రామాయణం బోధించిన ప్రధాన జీవన విధానాలు. ఇలాంటి జీవన విధానాలు ప్రపంచ మానవాళికి ఆదర్శం కాదా?


జస్టిస్‌ బి. చంద్రకుమార్‌
విశ్రాంత న్యాయమూర్తి

మొబైల్‌ : 79974 84866

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top