వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడాలంటే...

Justice B Chandra Kumar Article On Budget 2021 - Sakshi

సందర్భం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు ఏమాత్రం పెంచలేదు. పైపెచ్చు ప్రధానమంత్రి కిసాన్‌ యోజనకు గతంలో రూ.75 వేల కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.65 వేల కోట్లు కేటాయించారు. రైతు వ్యవసాయ సంక్షేమంలోనూ నిధులు తగ్గించారు.  అనేక పబ్లిక్‌ రంగ పరిశ్రమల నుండి ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరిం చుకుంటామని ప్రకటించారు. వ్యవసాయ రంగంలో పెట్టుబ డులు పెట్టడానికి కార్పొరేట్‌ కంపెనీలకు, మల్టీ నేషనల్‌ కంపె నీలకు అవకాశం కల్పించారు. కరోనా సమయంలోనే 100 కార్పొరేట్‌ కంపెనీల ఆదాయం రూ.12 లక్షల కోట్లకు పైగా పెరిగింది. వాస్తవంగా మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? వాటిని పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేయాలి? ప్రధాన సమస్యలను అసలు పట్టించుకుం టున్నారా? 

ఈ రోజు ఢిల్లీ లాంటి అనేక నగరాల్లో ఆక్సిజన్‌ శాతం తగ్గిపోతున్నది. దీనివల్ల అనేక శ్వాస సంబంధమైన రోగాలు వస్తున్నాయి. వాతావరణం వేడెక్కడం వల్ల అనేక పక్షులు, జంతువులు మనలేకపోతున్నాయి. భూగర్భ జలాలు ఇంకి పోయాయి. భవిష్యత్తులో ప్రజల ప్రాణాలను కాపాడాలంటే మొదట చేయాల్సింది వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం. చట్టాలు ఉన్నాయి. గ్రీన్‌ ట్రిబ్యునల్స్‌ ఉన్నాయి. కానీ ప్రభు త్వాలకు చిత్తశుద్ధి లేకపోతే ఎవరూ ఏమి చేయలేరు. కాలుష్య నివారణ చట్టాలను గట్టిగా అమలు చేయడం వల్ల కార్పొరేట్‌ కంపెనీలకు ఇబ్బంది కలుగుతుంది. కొంత ఆర్థికభారం వారిపై పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆరోగ్యానికి కేటాయించిన బడ్జెట్‌ నుండి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి, భూగర్భ జలాల స్థాయిని పెంచడానికి ఎక్కువశాతం ఉపయోగించాలి. కార్పొరేట్‌ కంపెనీల కాళ్ళకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీసే ప్రభుత్వం ఉన్నప్పుడు కాలుష్య నివారణ చర్యలు తీసుకుంటారని ఆశించడం అత్యాశే అవుతుంది.

వ్యవసాయ ఉత్పత్తులు, పంటలు ఎవరి ప్రయోజనాల కోసం? నేడు హైబ్రిడ్‌ విత్తనాలు వచ్చి ఎరువులు, పురుగు  మందుల వాడకం పెరిగి ఆహారధాన్యాలు విషతుల్యం అవుతు న్నాయి. ప్రజలకు ఆరోగ్యకరమైన పంటలను, కూరగాయలను, పండ్లను అందించాలంటే ఎరువులు, పురుగు మందుల వాడ కాన్ని తగ్గించాలి. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలి.  పశువులకు అధిక పాల కొరకు ఇచ్చే ఇంజెక్షన్లను రద్దు చేయాలి. ఆహారధాన్యాలను, కూరగాయలను, పండ్లను, కొబ్బరి నీళ్లను విషతుల్యం చేసే అన్ని రకాల మందులను, ఇంజెక్షన్లను నిషే ధించాలి. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పంటలను ప్రోత్స హించాలి. 

వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగిస్తే వారు ప్రజల ఆరోగ్యం కోసం పంటలు ఉత్పత్తి చేయరు. లాభాల దిశగా వ్యవసాయ రంగాన్ని మరల్చుతారు. రైతులతో ఒప్పందాలు చేసుకొని, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు సరఫరా చేస్తారు. రైతుల పంటలను కొనుగోలు చేస్తారు. కనీస మద్దతు ధర ఇస్తామన్న వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధం చేస్తామని చెప్పడం లేదు. కాబట్టి భవిష్యత్తులో కనీస మద్దతు ధర ఉండే పరిస్థితి పోతుంది. కొంతకాలానికి అధిక లాభాల కోసం ఎరువులు, విత్తనాల ధరలు పెంచి మరోవైపు పంటల ధరలను తగ్గిస్తారు. క్రమంగా రైతు అప్పుల్లో మునిగిపోతాడు. ఇప్పుడు కేంద్రం చేసిన చట్టాల ప్రకారం రైతుకు కోర్టుకు వెళ్లే అధికారం కూడా లేదు. చివరకు రైతు భూముల్ని అమ్ముకునే పరిస్థితి వస్తుంది. కంపెనీలు రైతుల భూముల్ని కొని పెద్దపెద్ద వ్యవసాయ క్షేత్రాలుగా చేస్తారు. దీనివల్ల రైతులు కూలీలుగా మారుతారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారధాన్యాల గురించి గానీ, కల్తీలేని పాల గురించి గానీ ఎవరూ ఆలోచించరు. 

ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించడం ద్వారా మొదట జరిగేది కార్మికుల తొలగింపు. నిర్వహణ ఖర్చుల తగ్గింపు పేరుతో నలుగురు పనిచేస్తున్న చోట ఇద్దరితోనే సరిపోతుందనే నెపంతో అనేక మంది ఉద్యోగం కోల్పోతారు. ప్రస్తుతం ఉన్న నిరుద్యోగ సమస్యకు ఇది అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. నిరుద్యోగులు పెరిగితే, రైతులకు కనీస మద్దతు ధర దొరక్కపోతే ఏమవుతుంది? ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరిగాయి. దీని ప్రభావం మార్కెట్‌ మీద పడి రవాణా ఖర్చులు పెరిగిపోతాయి. ఫలితంగా అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ప్రజలు కనీస అవసరాలు తీరడానికి ఇబ్బంది పడతారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గితే ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది. అందుకే ప్రభుత్వం ప్రజల కొనుగోలు శక్తి పెంచే ప్రయత్నాలు చేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనకు ప్రణాళికలు వేయాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని ఆశిద్దాం. విదేశీ పెట్టుబడులకు గేట్లు బార్లా తీయడం వల్ల క్రమంగా మన ఆర్థిక వ్యవస్థ వారి గుప్పిట్లోకి పోయే ప్రమాదం ఉంది. ఒక్కసారి ఆర్థిక వ్యవస్థ విదేశీయుల చేతిలోకి వెళ్తే వారి రాజకీయ జోక్యం పెరుగుతుంది. చివరకు మనం స్వతంత్రం కోల్పోయే ప్రమాదం కూడా రావచ్చు.

జస్టిస్‌ బి. చంద్రకుమార్‌ 
వ్యాసకర్త హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి
మొబైల్‌ : 94940 12734

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top