
పబ్లిక్ ఫంక్షన్లలో సాధారణంగా ఆచితూచి మాట్లాడతాడు తారక్. తన ఫ్యాన్స్‌కోసం మహా అయితే కాలర్ ఎగరేస్తాడు అంతే. ఏ మాత్రం వివాదాస్పద వ్యాక్యల జోలికి పోడు. కానీ ఈ సారి ఓ గట్టి స్టేట్‌మెంట్‌నే వదిలాడు తారక్.
అదేంటంటే "స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దీవెనలు ఉన్నంత కాలం నన్ను ఎవరూ ఆపలేరు" అనేది జూ. ఎన్టీఆర్ కామెంట్. మామూలుగా అయితే ఈ మాటను పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు పనిగనిగట్టుకుని 'నన్ను ఎవరూ ఆపలేరు' అని తారక్ అనడానికి ఓ కారణం ఉంది.
సరిగ్గా 2 రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ ఓ ట్వీట్ చేశాడు. అందులో తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ని పొగిడాడు. కూలీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షించాడు. కానీ ఎన్టీఆర్‌ను, వార్ 2 సినిమా గురించి మాత్రం లోకేష్ ఎక్కడా ప్రస్తావించలేదు.
రజినీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా లోకేష్ ఈ ట్వీట్ చేశాడు. కానీ అదే టైమ్‌లో జూ. ఎన్టీఆర్ కూడా తన 25 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ ప్రస్తావన మాత్రం లోకేష్ ఎక్కడా తీసుకురాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే తారక్ ఇలా తన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చాడని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు.
ఇక చాలా కాలంగా అటు నారా కుటుంబానికి, ఇటు నందమూరి బాలకృష్ణ కుటుంబానికి జూ. ఎన్టీఆర్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.