విశ్వసనీయత ఉన్న వ్యక్తి ప్రొ.నాగేశ్వర్‌ | Journalists condemns cases filed against Professor Nageshwar in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

విశ్వసనీయత ఉన్న వ్యక్తి ప్రొ.నాగేశ్వర్‌

May 24 2026 5:43 AM | Updated on May 24 2026 5:44 AM

Journalists condemns cases filed against Professor Nageshwar in Andhra Pradesh

ఆయన మాటలు నచ్చకపోతే జనసేన నేతలు ఖండించాలి 

వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా కేసులు ఎలా పెడతారు? 

కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ సీనియర్‌ జర్నలిస్టుల ఆగ్రహం 

ఏపీలో నమోదైన కేసులు ఉపసంహరించాలంటూ డిమాండ్‌

ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మీద ఆంధ్రప్రదేశ్‌లో కేసులు నమోదు చేయడాన్ని జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. సీనియర్‌ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకుల మీద కేసులు పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమంటూ మండిపడుతున్నారు. సాక్షి ఎడిటర్‌ ఆర్‌.ధనంజయ రెడ్డితోపాటు పలువురు జర్నలిస్టులపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా నాగేశ్వర్‌పై జనసేన నేతల ప్రోద్బలంతో పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదు చేయడంపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్‌

ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
1985–89 కాలంలో బడ్జెట్‌కు సంబంధించిన మంత్రివర్గ నిర్ణయాలు మీడియాకు పొక్కాయి. దీంతో అప్పటి సీఎం ఎన్టీఆర్‌ మొత్తం కేబినెట్‌ను రద్దు చేశారు. ప్రస్తుత వివాదం నేపథ్యంలో ఎన్టీఆర్‌ను జనసేన నేతలు ఆదర్శంగా తీసుకోవాలి. నాగేశ్వర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిని జనసేన గుర్తించి చర్య తీసుకోవాలి. గుర్తించలేకపోతే మొత్తం కేబినెట్‌నే రద్దు చేయాలి. కూటమి ప్రభుత్వ సమర్ధకుడు అయిన ఒక మీడియా సంస్థ అధినేత వారం వారం తాను రాసే కాలమ్‌లో ప్రగతి భవన్‌లో జరిగినట్టుగా కొన్ని వార్తా కథనాలు ప్రచురిస్తే.. అసత్యాలు రాస్తున్నారంటూ ఆ పత్రికాధినేతను బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నించారు. ‘సోర్సెస్‌ డెవలప్‌ చేసుకోవాలి. ఆ సోర్సెస్‌ ద్వారా సమాచారం సేకరించి వార్తలు రాయాలని మా గురువులు చెప్పారు. సోర్స్‌ చెప్పింది ఆక్షేపించడానికి వీల్లేదు’అంటూ ఆ పత్రికాధినేత సమాధానం ఇచ్చిన విషయం కూటమి ప్రభుత్వం మరిచిపోకూడదు.  
–దేవులపల్లి అమర్, సభ్యుడు, స్టీరింగ్‌ కమిటీ, ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌

ఇతరులకు ఏం పని?
విశ్లేషకుడిగా నాగేశ్వర్‌కు మంచి గుర్తింపు, విశ్వసనీయత ఉన్నాయి. ప్రముఖ జర్నలిస్ట్‌ కూడా. ఆయన వ్యాఖ్యలు నచ్చకపోతే పవన్, నాదెండ్ల మనోహర్‌ మాత్రమే ఖండించాలి. స్పందించడానికి ఇతరులకు ఏం పని. ఆయన మీద కేసులు పెట్టడం సరికాదు. నాగేశ్వర్‌ కుటుంబం లేదా ఆయన అభిమానులు కోర్టును 
ఆశ్రయించాలని నా సూచన. –కె.రామచంద్ర మూర్తి, సీనియర్‌ పాత్రికేయులు

ఆ 35 వేల మంది సంగతేంటి?
దశాబ్దాలుగా మంచి విశ్లేషకుడిగా ప్రొ.నాగేశ్వర్‌కు పేరుంది. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించినా కేసులు పెట్టడం, సోషల్‌ మీడియాలో దుర్భాషలాడటం దుర్మార్గం. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మీద కేంద్రానికి ఫిర్యాదు చేయబోతున్నట్టు స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడిన వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో ఉన్నాయి. జగన్‌ హయాంలో 35 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని చేసిన ఆరోపణలకు పవన్‌ ఇప్పటివరకు ఆధారాలను చూపలేదు. కానీ నాగేశ్వర్‌ చేసిన ఒక కామెంట్‌ మీద పలుచోట్ల ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. దీన్నిబట్టి చూస్తుంటే కేసుల పేరుతో ఆయనను ఇబ్బంది పెట్టడానికే అని అర్థం అవుతోంది.  –వర్దెళ్లి మురళి, సీనియర్‌ సంపాదకులు

ఏపీలో జర్నలిస్టుల హక్కులను హరించివేస్తున్నారు
సీనియర్‌ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ఎటువంటి ఆరోపణలు చేయలేదు. తన దృష్టికి వచ్చిన అంశాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా వ్యక్తపరిచారు. జర్నలిస్టులు వారికున్న సోర్స్‌ ఆధారంగా వచ్చిన సమాచారాన్ని ప్రస్తావిస్తారు. దీనిపట్ల అభ్యంతరం ఉంటే ఖండించాలి. అంతేగానీ వ్యక్తిగత దాడి తగదు. ఏపీలో జర్నలిస్టుల హక్కులను హరించివేస్తున్నారు. వారికి నచ్చినట్లుగానే వార్తలు రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇతరుల వ్యాఖ్యలు ప్రచురించినా కూడా జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం మనజాలదు. ఏపీలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరి మారాలి.  –ఆర్‌.ధనంజయ రెడ్డి, ఎడిటర్, సాక్షి      

నచ్చకపోతే కౌంటర్‌ ఇవ్వాలి
నాగేశ్వర్‌ మంచి విశ్లేషకుడు, సీనియర్‌ జర్నలిస్ట్‌. ఏ అంశమైనా విశ్లేíÙంచి మాట్లాడతారు. నిర్మొహమాటంగా మాట్లాడతారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా కూడా ఆయనపై కేసులు పెట్టడం తగదు. పలుచోట్ల ఎఫ్‌ఐఆర్‌ లు నమోదయ్యాయంటే ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టినట్టు అర్థం అవుతోంది. ఇది సరైనది కాదు. మా అసోసియేషన్‌ ఇటువంటి చర్యలను సహించదు. ఆయన చేసిన వ్యాఖ్యలు నచ్చకపోతే కౌంటర్‌ ఇవ్వాలి. కేసు పెట్టి నోరు మూయించాలని అనుకోవడం సరికాదు. –విరాహత్‌ అలీ, ప్రెసిడెంట్, తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌

కేసులు ఎత్తి వేయాలి
తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్టు ప్రొ.నాగేశ్వర్‌ ప్రకటించారు. అందువల్ల ఆయనపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలి. ప్రభుత్వాలు, పారీ్టలు ఏవైనా మీడియాలో వచ్చిన ఆరోపణలు, భిన్నాభిప్రాయాలపై ఖండనలు, సమాధానాలు చేయొచ్చు. కానీ కేసులు, అరెస్టులు సరికాదు. ఏపీ ప్రభుత్వం నాగేశ్వర్‌పై పెట్టిన కేసులు వెనక్కు తీసుకోవాలే గానీ అరెస్టుల వంటి కఠిన చర్యలు అవాంఛనీయం.   
–తెలకపల్లి రవి, ప్రముఖ విశ్లేషకులు

పోలీస్‌ స్టేషన్లు చాలవు
నాగేశ్వర్‌ వ్యాఖ్యలు తప్పు అని అభిప్రాయం చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది. నాగేశ్వర్‌ అంటే గౌరవం అంటూనే కేసులు పెట్టారు. ఖండించడం, సరిదిద్దుకోవాలని చెప్పడం ప్రజాస్వామ్యం. కేసులు పెట్టడం కొత్త సంప్రదాయం. భావప్రకటనకు భిన్నమైంది. కొమ్మినేని శ్రీనివాస్‌ మీద మరోసారి కేసు పెట్టారు. ఒక పద్ధతి ప్రకారం కేసులు పెడుతున్నారు. డిజిటల్‌ మీడియా యుగంలో కేసులు పెట్టుకుంటూపోతే పోలీస్‌ స్టేషన్లు చాలవు. పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల మీద గౌరవం ఉంటే కేసులు విత్‌డ్రా చేసుకోవాలి.  
–అల్లం నారాయణ, సీనియర్‌ పాత్రికేయులు
 

Advertisement
 
Advertisement
Advertisement