డబ్బు తీసుకుంటే ఆస్పత్రి సీజ్‌ చేస్తా 

JC Siri Warned Hospital Administrator At Anantapur - Sakshi

చంద్ర సూపర్‌సెష్పాలిటీ ఆస్పత్రి 

యాజమాన్యానికి జేసీ సిరి హెచ్చరిక 

బాలింతతో వసూలు చేసిన డబ్బు తిరిగి ఇప్పించిన వైనం

సాక్షి, అనంతపురం‌: ‘ఆరోగ్య శ్రీ కింద రోగులకందించే వైద్య సేవలకు సంబంధించి రూ.వేలల్లో డబ్బులు వసూలు చేయడమేంటి? మరోసారి ఇలా చేస్తే ఆస్పత్రిని సీజ్‌ చేస్తా’ అంటూ నగరంలోని చంద్ర సూపర్‌ సెష్పాలిటీ ఆస్పత్రి నిర్వాహకుడు డాక్టర్‌ నిరంజన్‌రెడ్డిని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి హెచ్చరించారు.  మంగళవారం చంద్ర ఆస్పత్రిలో జేసీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆరోగ్య శ్రీ వార్డులో ఉండే వైద్యులు, స్టాఫ్‌నర్సులు, తదితర సిబ్బందిని బయటకు పంపి, రోగులతో ఆస్పత్రిలో అందే సేవలపై ఆరా తీశారు. శానిటేషన్, భోజనం తదితర సౌలభ్యాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వివిధ టెస్టింగ్‌ల పేరుతో బాలింత భాగ్యలక్ష్మి నుంచి రూ.4,200 వసూలు చేసిన విషయం వెల్లడైంది. మరో నలుగురి నుంచి కూడా అదనపు డబ్బు వసూలు చేసినట్లుగా రోగుల సంబంధీకులు ఆమె ఎదుట వాపోయారు. దీంతో ఆస్పత్రి నిర్వాహకుడు డాక్టర్‌ నిరంజన్‌రెడ్డి, ఆరోగ్య శ్రీ జిల్లా మేనేజర్‌ శివకుమార్‌పై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి నిర్వాహకులు వసూలు చేసిన రూ.4,200ను భాగ్యలక్ష్మీకి తిరిగి ఇప్పించారు. మిగిలిన వారికి కూడా డబ్బు చెల్లించాలని, మరోసారి ఇలాంటి పరిస్థితి పునరావృతమైతే ఉపేక్షించేది లేదన్నారు.  (అనంత కలెక్టర్‌కు కేంద్రమంత్రి జవదేకర్‌ ప్రశంస)

61 ఆస్పత్రుల్లో సేవలన్నీ ఉచితమే 
జిల్లాలోని 61 ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో సేవలన్నీ ఉచితమేనని జేసీ సిరి స్పష్టం చేశారు. రోగుల మంచాల షీట్లు మార్చడం, బాత్‌రూంలను శుభ్రంగా ఉంచడం, నాణ్యమైన భోజనం అందించే బాధ్యత ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలదేనన్నారు.  ఆరోగ్య శ్రీ కింద అడ్మిషన్‌ అయిన రోగులకు అవసరమైన రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు శస్త్రచికిత్సలు, డిశ్చార్జ్‌ సమయంలో  మందులు కూడా ఇవ్వాలన్నారు. ఆరోగ్యశ్రీ ఆసరాలో భాగంగా రోగికందాల్సిన భృతిని సకాలంలో బ్యాంక్‌ ఖాతాలో జమ అయ్యేలా చూడాలన్నారు. 

కోవిడ్‌పై నిర్లక్ష్యం వద్దు 
అనంతపురం అర్బన్‌: జిల్లాలో కోవిడ్‌ తగ్గుముఖం పట్టిందని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదని, ఈ నెల 30వ తేదీ వరకూ చైతన్య కార్యక్రమాలు నిర్వహించాల్సిందేనంటూ వైద్యాధికారులకు జేసీ డాక్టర్‌ సిరి సూచించారు. కోవిడ్‌–19 అంశంపై మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో వైద్యాధికారులు, నోడల్‌ అధికారులతో ఆమె సమీక్షించారు. నవంబరు 2వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని పాఠశాలల్లో జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ చైతన్య ర్యాలీలు చేపట్టాలన్నారు.

22న దుకాణాల్లో కోవిడ్‌ నిబంధనలు అమలుపై తనిఖీలు చేపట్టాలన్నారు. 23న సినిమా హాళ్ల వద్ద అవగాహన హోర్డింగ్‌లు, పోస్టర్లు, స్టిక్కర్లు ప్రదర్శించాలన్నారున. 24న హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌ యాజమానులతో సమావేశం, 25న సచివాలయాల పరిధిలో అవగాహన  కార్యక్రమాలు, 26న ఐఏసీ కార్యక్రమాల, మతపెద్దలతో సమావేశాలు, 27న మాస్‌్కలు, శానిటైజర్ల పంపిణీ, 28న విద్యార్థులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పోటీలు, 30న కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ పద్మావతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top