అధికారం పోగానే.. జేసీ అనుచరుల సెప‘రేటు’ మార్గం

JC Brothers Followers Illegal Liquor Sales At Tadipatri - Sakshi

తాడిపత్రిలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు  

రోజుకు రూ.లక్షల్లో టర్నోవర్‌ 

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు 

సాక్షి, తాడిపత్రి ‌: ప్రభుత్వం మారింది..అధికారం పోయింది..అయినా జేసీ సోదరుల అనుచరులు సెప‘రేటు’ మార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో తాడిపత్రి పట్టణం అక్రమ మద్యం విక్రయాలకు కేరాఫ్‌గా మారింది. ఉదయం 6 గంటల నుంచి మద్యం అందుబాటులో ఉంచుతున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసివేసిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జోరుగా కొనసాగిస్తున్నారు. తద్వారా రూ.లక్షల్లో టర్నోవర్‌ చేస్తున్నారు. అయినా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

జేసీసోదరుల అనుచరులే అక్రమ వ్యాపారులు : 
జేసీ సోదరుల అనుచరులు కొందరు బస్టాండు కేంద్రంగా, మరికొన్ని ప్రాంతాల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారు. ఉదయం 6 గంటల నుంచి అక్రమ మద్యం వ్యాపారులు రోడ్లపై నిలబడి మద్యం జోరుగా విక్రయిస్తున్నారు. డబ్బులు ఉంటే చాలు తాడిపత్రి పట్టణంలో ఏ ప్రాంతంలోనైనా, దుకాణాలు తెరవని సమయంలోనూ మద్యం దొరుకుతోంది. ప్రభుత్వ దుకాణాల్లో కంటే క్వాటర్‌పై రూ.50 నుంచి రూ.100 అధికంగా ఇవ్వాల్సి వస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యం బ్రాండ్లకు ఫుల్‌ బాటిల్‌పై రూ.400 నుంచి రూ.600 వరకు అదనపు ధరకు అమ్ముతున్నారు.  

బస్టాండు వద్ద తోపుడు బండిపై విక్రయించడానికి ఉంచిన అక్రమ మద్యం బాటిళ్లు 

నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు ... 
తాడిపత్రి పట్టణ పరిధిలో మొత్తం 8 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు సుమారుగా రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు అధికార లెక్కలు చెప్తున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే కొందరితో టీడీపీ నాయకులు కుమ్మక్కయ్యారు. వారి నుంచి మద్యం తెచ్చుకొని నిల్వ ఉంచుకుంటున్నారు. అదేవిధంగా పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లను తెచ్చుకుంటున్నారు. మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలను తెరవక ముందు ఉదయం, మద్యం దుకాణాలను మూసి వేసిన తర్వాత రాత్రివేళలో అదును చూసి విచ్చలవిడిగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు.   

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు:  
తాడిపత్రి ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్రమంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. తాడిపత్రి ప్రాంతంలో అక్రమ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని ఏదైనా పత్రికల్లో ప్రచురితమైనప్పుడు, జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు అందితేనే ఇక్కడి అధికారులు దాడులు చేసి, కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ మద్యం వ్యాపారుల నుంచి మమూళ్లు ముడుతుండడంతోనే అధికారులు ఏమీ ఎరుగనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  

దాడులు నిర్వహిస్తున్నాం 
అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాం. అక్రమ మద్యం స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నాం. అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందిస్తే వెంటనే దాడులు చేస్తున్నాం. ఇప్పటికే పట్టణ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నవారిని పిలిపించి, కౌన్సెలింగ్‌ నిర్వహించాం. ఎవరైనా అక్రమ మద్యం అమ్ముతూ రెండు సార్లకు పైబడి పట్టుబడితే వారిని బైండోవర్‌ చేస్తున్నాం.   – గోపాల్‌నాయక్, ఎక్సైజ్‌ ఎస్‌ఐ, తాడిపత్రి    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top