breaking news
illegal liquor business
-
ఊరూరా బెల్ట్ దుకాణం.. ఇది కదా కుంభకోణం!
సాక్షి ప్రతినిధి, విజయవాడ : అక్రమ మద్యం అమ్మకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. సాక్షాత్తు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో బెల్ట్ షాపులు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇక్కడ మందు దొరకని ఊరు లేదు. మచిలీపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా 200–250 బెల్ట్ షాపులు వెలిశాయి. మచిలీపట్నంలో మంత్రి నివాసం ఉండే ప్రాంతంలోనే ఐదు బెల్ట్ షాపులు ఉన్నాయి. క్వార్టర్ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.50 అదనంగా మందుబాబుల ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. ఇది చాలదన్నట్లు తాజాగా బెల్ట్ షాపులకు గ్రామాల వారీగా బహిరంగ వేలం వేస్తున్నారు. ఇందులో భాగంగా మూడు రోజుల క్రితం మచిలీపట్నం రూరల్ మండలం పరిధిలోని పెద్ద ముత్తాయపాలెం (పీటీ పాలెం)లో బెల్ట్‌షాపు నిర్వహణ కోసం పెట్టిన వేలం పాటలో రూ.15 లక్షల ధర పలికింది. టీడీపీ కార్యకర్త వడుగు భీమరాజు ఈ మేరకు పాట పాడి బెల్ట్ షాపును దక్కించుకొన్నాడు. చిన్నాపురం మద్యం షాపు పరిధిలో జరిగిన ఈ వేలం పాటల్లో టీడీపీ మండల నేత, ఎక్సైజ్ సీఐ కీలక పాత్ర పోషించారు. ఊరికి మొత్తం ఒకే బెల్ట్‌షాపు ఉండేలా ఒప్పందం చేశారు. గ్రామంలో ఇతరులు బెల్ట్ షాపులు పెట్టకూడదని, ఇతర బ్రాందీ షాపుల వారు ఆ గ్రామానికి సరుకు ఇవ్వకూడదని, చిన్నాపురం బ్రాంది షాపు నుంచే సరుకు సరఫరా అయ్యేలా ఒప్పందం కుదిర్చారు.కాగా మచిలీపట్నంలో వచ్చే నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని బీచ్ ప్రాంతంలో ఉండే మద్యం షాపు యజమాని వేలం పాటకు తెర లేపుతున్నారు. బీచ్‌కు సమీప గ్రామాల్లోని తాళ్లపాలెం, గిరిపురం గ్రామాల్లో బెల్ట్ షాపు ఏర్పాటుకు ఒక్కో షాపునకు రూ.4 లక్షలు «ధరగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ధర ఇంకా ఫైనల్ కాలేదని, ఎవరైనా పోటీకి వస్తే ధర ఇంకా పెరగొచ్చని.. ఆదివారంలోపు «ఖరారయ్యే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మచిలీపట్నంలో సుల్తానగర్ ప్రాంతంలో ఉండే మద్యం షాపు పరిధిలో ఉన్న బెల్ట్ షాపులకు యానాం నుంచి మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. సాక్షాత్తు ఎక్సైజ్ మంత్రి ఇలాకాలోనే ఇలా పెద్ద ఎత్తున మద్యం అక్రమ విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోక పోవడంపై మహిళల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అన్ని ఊళ్లలోనూ అదే దందాటఅవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక మండలం సంగమేశ్వరంలో బెల్ట్‌షాపుకు రూ.7 లక్షల ధర పలికింది. పాత ఉపకాలిలో రూ.4.19 లక్షలు, గుల్లలమోదలో రూ.5.30 లక్షలు, పెదగౌడపాలెంలో రూ.3.50 లక్షలు, ఎదురుమొండిలో రూ.5.40 లక్షలు, సొర్లగొందిలో రూ.2.50 లక్షలు, దిండిలో రూ.3.50 లక్షలు, కమ్మనమోలులో రూ.4.50 లక్షలు ధర పలికాయి. చల్లపల్లి మండలంలో కేవలం 3,998 జనాభా మాత్రమే ఉన్న మాజేరు గ్రామంలో ఏకంగా 12 బెల్ట్ షాపులు ఏర్పాటవ్వడం విస్తుగొలుపుతోంది. ఒక్కోబెల్ట్ షాపునకు ఏడాదికి రూ.లక్ష చొప్పున వసూలు చేశారు. » గుడివాడ నియోజకవర్గంలో 150కి పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. మద్యం షాపుల యజమానులు బాటిల్‌పై రూ.10 అధిక ధరతో బెల్ట్ షాపుల నిర్వాహకులకు అమ్ముతున్నారు. గ్రామ జనాభాను బట్టి రేటు నిర్ణయించారు. బెల్ట్‌షాపుల నిర్వాహకులు క్వార్టర్ సీసాపై రూ.30 నుంచి 40 అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రతి బెల్ట్ షాపు నుంచి మండల టీడీపీ నేతకు నెలకు రూ.5 వేలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. » పెనమలూరు నియోజకవర్గంలో 120కిపైగా బెల్ట్ షాపులున్నాయి. మద్యం నిర్వాహకులు సిండికేట్‌గా మారి క్వార్టర్ బాటిల్‌పై అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారు. బెల్ట్ షాపు నిర్వాహకులు రూ.30 నుంచి 50 ఎక్కువ ధరతో అమ్ముతున్నారు. పెడన నియోజకవర్గంలో 165కు పైగా బెల్ట్ షాపులున్నాయి. పెడనలో నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన వినాయకుడి గుడికి పక్కనే బెల్ట్‌షాపు పెట్టారు. దీంతో మందు బాబులతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ మండల నేత ఒకరు గూడూరులో ఏకంగా ఐదు బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారు. » పామర్రు నియోజకవర్గంలో 156 బెల్ట్ షాపులున్నాయి. పామర్రు మండలంలోని కొండిపర్రు, జమీన్ గొలువేపల్లి, ఎలమర్రు గ్రామాల్లో ఒక్కో బెల్ట్‌షాపుకు టీడీపీ నేతలు రూ.20–50 వేల వరకు వసూలు చేస్తున్నారు. » ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపుల్లో క్వార్టర్ బాటిల్‌పై పగలు రూ.30.. రాత్రిళ్లు రూ.50 అధికంగా వసూలు చేస్తున్నారు. -
టీడీపీ, జనసేన అక్రమ మద్యం దందా..
-
రోజుకు రూ.9 లక్షలు, ఐఫోన్లు, లగ్జరీ కారు.. ఇంతలో
పాట్నా: మద్యంపై నిషేధం అమల్లో ఉన్నప్పటికీ బిహార్‌లో మద్యం ఏరులై పారుతోంది. అధికారుల కంట పడకుండా గుట్టుచప్పుడుగా మద్యాన్ని అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి అయితే ఏకంగా రోజుకు 9 లక్షల విలువ చేసే మద్యాన్ని విక్రయిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పాట్నాకు చెందిన అతుల్ సింగ్ ప్రైవేటు యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నాడు. పౌల్ట్రీ పరిశ్రమలో నష్టపోయిన అతుల్ సులువుగా డబ్బులు సంపాదించడం కోసం అడ్డ దారులు తొక్కి, అక్రమంగా మద్యం అమ్మడం మొదలు పెట్టాడు. దాని ద్వారా వచ్చిన డబ్బులతో లగ్జరీ కారు, ఐఫోన్లు కొంటూ విలాసవంతంగా జీవించేందుకు అలవాటు పడ్డాడు. పనిలో పనిగా రూ.8 లక్షలు విలువ చేసే స్పోర్ట్స్ బైక్‌ను కూడా కొనుగోలు చేశాడు. (చదవండి: కాల్‌మనీ: కీలక నిందితుడి లీలలెన్నో..) కానీ మందు వాసన పసిగట్టిన పోలీసులు అద్దె ఇంట్లో నివసిస్తున్న అతుల్‌ను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. రూ.21 లక్షల విలువైన 1100 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. ఓ డైరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. డైరీలో రాసుకున్న వివరాల ప్రకారం.. పాట్నాలోని పలు ప్రాంతాల్లో కలిపి అతుల్ రోజూ రూ. 9 లక్షలు విలువ చేసే మద్యం విక్రయిస్తున్నాడు. ఈ అక్రమ రవాణాకోసం 30-40 మందిని డెలివరీ ఏంజెట్లుగా నియమించుకున్నాడు. డెలివరీ చేసే ఒక్కో ఆర్డర్‌కు రూ.500 చొప్పున డబ్బులు చెల్లిస్తున్నాడు. కాగా వారణాసి నుంచి నలుగురు స్మగ్లర్లు ఇతడికి అక్రమంగా మద్యం పంపిణీ చేసేవారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో అతుల్‌కు సహకరించిన విశాల్ కుమార్, సంజీవ్ కుమార్, ఇంద్రజీత్ కుమార్‌లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. (చదవండి: ఈ దొంగకు ఛారిటీ వర్క్ ‘కిక్’ ఇస్తుంది!) -
జేసీ అనుచరుల సెప‘రేటు’ మార్గం..
సాక్షి, తాడిపత్రి : ప్రభుత్వం మారింది..అధికారం పోయింది..అయినా జేసీ సోదరుల అనుచరులు సెప‘రేటు’ మార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో తాడిపత్రి పట్టణం అక్రమ మద్యం విక్రయాలకు కేరాఫ్‌గా మారింది. ఉదయం 6 గంటల నుంచి మద్యం అందుబాటులో ఉంచుతున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసివేసిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జోరుగా కొనసాగిస్తున్నారు. తద్వారా రూ.లక్షల్లో టర్నోవర్ చేస్తున్నారు. అయినా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జేసీసోదరుల అనుచరులే అక్రమ వ్యాపారులు : జేసీ సోదరుల అనుచరులు కొందరు బస్టాండు కేంద్రంగా, మరికొన్ని ప్రాంతాల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారు. ఉదయం 6 గంటల నుంచి అక్రమ మద్యం వ్యాపారులు రోడ్లపై నిలబడి మద్యం జోరుగా విక్రయిస్తున్నారు. డబ్బులు ఉంటే చాలు తాడిపత్రి పట్టణంలో ఏ ప్రాంతంలోనైనా, దుకాణాలు తెరవని సమయంలోనూ మద్యం దొరుకుతోంది. ప్రభుత్వ దుకాణాల్లో కంటే క్వాటర్‌పై రూ.50 నుంచి రూ.100 అధికంగా ఇవ్వాల్సి వస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యం బ్రాండ్లకు ఫుల్ బాటిల్‌పై రూ.400 నుంచి రూ.600 వరకు అదనపు ధరకు అమ్ముతున్నారు. బస్టాండు వద్ద తోపుడు బండిపై విక్రయించడానికి ఉంచిన అక్రమ మద్యం బాటిళ్లు నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు ... తాడిపత్రి పట్టణ పరిధిలో మొత్తం 8 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు సుమారుగా రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు అధికార లెక్కలు చెప్తున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే కొందరితో టీడీపీ నాయకులు కుమ్మక్కయ్యారు. వారి నుంచి మద్యం తెచ్చుకొని నిల్వ ఉంచుకుంటున్నారు. అదేవిధంగా పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లను తెచ్చుకుంటున్నారు. మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలను తెరవక ముందు ఉదయం, మద్యం దుకాణాలను మూసి వేసిన తర్వాత రాత్రివేళలో అదును చూసి విచ్చలవిడిగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు: తాడిపత్రి ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్రమంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. తాడిపత్రి ప్రాంతంలో అక్రమ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని ఏదైనా పత్రికల్లో ప్రచురితమైనప్పుడు, జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు అందితేనే ఇక్కడి అధికారులు దాడులు చేసి, కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ మద్యం వ్యాపారుల నుంచి మమూళ్లు ముడుతుండడంతోనే అధికారులు ఏమీ ఎరుగనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దాడులు నిర్వహిస్తున్నాం అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాం. అక్రమ మద్యం స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నాం. అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందిస్తే వెంటనే దాడులు చేస్తున్నాం. ఇప్పటికే పట్టణ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నవారిని పిలిపించి, కౌన్సెలింగ్ నిర్వహించాం. ఎవరైనా అక్రమ మద్యం అమ్ముతూ రెండు సార్లకు పైబడి పట్టుబడితే వారిని బైండోవర్ చేస్తున్నాం. – గోపాల్‌నాయక్, ఎక్సైజ్ ఎస్ఐ, తాడిపత్రి -
సీసెడు తాగినందుకే సోయి తప్పుతున్నారు
జిల్లా కేంద్రంలోని ఓ కల్లు దుకాణంలో కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి మృతిచెందాడు. కల్తీ కల్లు తాగడం వల్లే అతడు మరణించాడని బంధువులు ఆందోళన చేశారు. కల్లు విక్రయదారులు వారిని సముదాయించి, కొంత పరిహారం చెల్లించి, విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడినట్లు తెలిసింది. సమీపంలోని మరో కల్లు దుకాణం నిర్వాహకులనుంచి కూడా కొంత మొత్తాన్ని ఇచ్చినట్లు సమాచారం.. కన్న కూతురిపైనే అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఓ తండ్రికి సంబంధించిన ఘటన ఇటీవల మాచారెడ్డి మండలంలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు ప్రతిరోజూ మత్తుపదార్థాలు కలిపిన కల్లును సేవించడం, తన కుటుంబ సభ్యులకు కూడా తెచ్చి ఇవ్వడం చేసేవాడని తెలిసింది. జరిగిన దారుణానికి కల్తీకల్లు సేవించడం కూడా కారణమేనని భావిస్తున్నారు . సాక్షి, కామారెడ్డి : జిల్లాలో 22 కల్లు డిపోలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో రెండు కల్లు తయారీ కేంద్రాలు ఉన్నాయి. పట్టణంలో 14 కల్లు దుకాణాలు ఉండగా చుట్టు పక్కల గ్రామాల్లోని కొన్ని కల్లు దుకాణాలకు సైతం జిల్లా కేంద్రంలోని కల్లు తయారీకేంద్రాలనుంచే కల్లును సప్లయ్ చేస్తున్నారు. ఈత, తాటి చెట్ల నుంచి తీసే కల్లును నామమాత్రంగా కలుపుతారు. క్లోరోఫాం, డైజోఫాంలాంటి మత్తు పదార్థాలను కలుపుతూ కల్తీ కల్లు తయారు చేసి, విక్రయిస్తుంటారన్న ఆరోపణలున్నాయి. కల్లు విక్రయాలను పెంచుకోవడానికి మత్తు పదార్థాలను ఎక్కువ మొత్తంలో కలిపి అమ్ముతున్నారని తెలుస్తోంది. హైడోస్ కల్లుకు జిల్లా కేంద్రంలో కొన్ని దుకాణాలకు పెట్టింది పేరు.. దేవునిపల్లి, రామేశ్వర్‌పల్లి, సిరిసిల్లరోడ్, అంగడిబజార్, హైదరాబాద్ రోడ్, చిన్నమల్లారెడ్డి, సరంపల్లి తదితర ప్రాంతాల్లోని కల్లు దుకాణాల్లో కల్తీకల్లు విక్రయాలు ఎక్కు వగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మిగతా దుకాణాల్లోనూ కల్తీ కల్లు అమ్ముతున్నారు. వీధిన పడుతున్న కుటుంబాలు కల్తీకల్లు కారణంగా అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కల్లుకు బానిసలవుతూ ఎంతోమంది కుటుంబాలను పట్టించుకోవడం లేదు. పొద్దంతా పని చేయగా వచ్చే డబ్బులను కిక్కు కోసమే ఖర్చు చేస్తున్నారు. దీంతో కుటుంబాల్లో గొడవలు, ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి. అనేక గొడవలు నిత్యం పోలీస్ స్టేషన్ల వరకు వస్తున్నాయి. కొన్ని ఆత్మహత్యలు, హత్యలకు మత్తుపదార్థాలతో కల్తీ చేసిన కల్లే కారణమవుతుండడం గమనార్హం. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు.. కామారెడ్డిలో విక్రయిస్తున్న కల్లులో పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. కల్లు విక్రయాలు పెంచుకునేందుకు ఇలా చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇలాంటి హైడోస్ కల్లును సేవిస్తూ ఎంతో మంది తమ ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదంతా కళ్లెదుటే కనిపిస్తున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. వారు ఈ విషయాన్ని ‘మామూలు’గా తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అందుకే కల్తీ కల్లు విక్రయాలను అడ్డుకోవడం లేదని తెలుస్తోంది. -
‘బెల్ట్’ కిక్కు
జనగామ: గ్రామాల్లో ‘బెల్ట్’ కిక్కెక్కిస్తోంది. వేసవి ప్రభావంతో నీటికి కష్టాలు ప్రారంభమైనా.. మద్యం మాత్రం ఏరులై పారుతోంది. అనధికార సిట్టింగ్‌లు బార్లను తలపిస్తున్నాయి. ఫుల్ బాటిల్‌పై రూ. 100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. గుడుంబా అమ్మకాలపై దృష్టి సారించిన ఎక్సైజ్ శాఖ బెల్ట్ దుకాణాలను చూసీచూడనట్లు వదిలేస్తోంది. దీంతో వారి ఇష్టారాజ్యం కొనసాగుతోంది. జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్ పూర్, పాలకుర్తి నియోజక వర్గాల పరిధిలోని 12 మండలాల్లో నాలుగు వేల వరకు బెల్ట్ దుకాణాలు ఉండొచ్చని అంచనా. బెల్ట్ దుకాణాల ద్వారా ప్రతి రోజు రూ.20 లక్షల వరకు వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తుంది. జనగామ జిల్లా పరిధిలోని జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు గ్రామాల్లో బెల్ట్ దుకాణాల జోరు విచ్ఛలవిడిగా కొనసాగుతుంది. గతంలో సుప్రీం కోర్టు తీర్పు ప్రకటించే వరకు బెల్ట్ షాపుల అమ్మకాలు గుట్టుగా సాగాయి. మద్యం దుకాణాలు ఊరికి దూరంగా.. రహదారులకు దగ్గరగా ఉండేవి. బెల్ట్‌షాపులు మాత్రం ఇళ్లకు దూరంగా.. రహదారులకు దగ్గరగా వచ్చేశాయి. 2017 జూలై ఒకటో తేదీ నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో మద్యం, బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కార్పోరేషన్, మునిసిపల్ పరి ధిలో మాత్రం ఇందుకు మినహాయింపు ఇచ్చింది. సుప్రీం ఆదేశాల మేరకు మండల, పట్టణ ప్రాం తాల్లో జాతీయ, రాష్ట్ర హైవేలకు దూరంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. మద్యం దుకాణాలు కనిపించక.... హైవేలపై ప్రయాణం చేసే సమయంలో చాలా మంది మద్యం సేవించి డ్రైవింగ్ చేసేవాళ్లు. రహదారిపై వైన్స్ కనిపించగానే మద్యం సేవించేవారు. సుప్రీం కోర్టు కఠినమైన నిబంధనలతో తీర్పు వెలువరించింది. దీంతో మద్యం దుకాణాలు హైవేల నుంచి గ్రామాల్లోకి వెళ్లినా, వాటి స్థానంలో కొత్తగా బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి..వెలుస్తున్నాయి. బార్లను తలపిస్తున్న.. బెల్ట్ దుకాణాలు జిల్లాలోని అనేకచోట్ల బెల్ట్‌షాపుల నిర్వహణ బార్లను తలపిస్తున్నాయి. దీంతో ఎప్పటి లాగే హైవేలపై ప్రయాణించే వారు ఏ చీకూ చింతా లేకుండా ‘మత్తు’ లోకి దిగుతున్నారు. అనధికారిక ఆదేశాల మేరకు కొనసాగుతున్న బెల్ట్ దుకాణాలపై ఎక్సైజ్ శాఖ చూసిచూడనట్లు వ్యవహరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత మండలాలకు చెందిన వైన్స్‌ల నుంచి కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి మద్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా తీసుకు వస్తున్నారు. అదనపు వడ్డింపు బెల్ట్ దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అదనపు వడ్డింపుతో మత్తును వదిలిస్తున్నారు. క్వార్టర్‌కు రూ. 20 నుంచి రూ.30 వరకు అదనంగా తీసుకుంటున్నారనే గొడవలు అంతటా జరుగుతున్నాయి. ఆయా మండలాల పరిధిలోని వైన్స్ దుకాణాల్లో కూడా ఎమ్మార్పీకంటే అదనంగా ధరలు తీసుకుంటుండడంతో.. నిత్యం మాటల యుద్ధం జరుగుతుంది. ఫిర్యాదు చేస్తే దాడులు చేస్తాం. బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తే చర్యలు త ప్పవు.ఎప్పటికప్పుడు దాడులు కొనసాగిస్తున్నాం. దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.వైన్స్‌ల్లో అదనపు ధరలకు విక్రయిస్తే..కేసులు నమోదు చేస్తాం. – సుధీర్, ఎస్సై ఎక్సైజ్ శాఖ, జనగామ -
నాటుసారా విక్రయిస్తున్న మహిళలు అరెస్ట్
విశాఖపట్నం: నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించిన సీటీఎఫ్ అధికారులు 110 సారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నగరంలోని తగరపువలస జీరోపేటలో నాటు సారా విక్రయాలు జోరుగా జరుగుతున్నాయనే సమాచారంతో శుక్రవారం రంగంలోకి దిగిన సీటీఎఫ్ బృందాలు సారా తయారీకి ఉపయోగించే బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. సారా విక్రయిస్తున్న ఆది లక్ష్మి, వెంకట లక్ష్మి అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
సారా తయారీ కేసులో లక్ష జరిమానా
సంగారెడ్డి (మెదక్) : సారా తయారీ, విక్రయం కేసులో బైండోవర్ చేసిన నిందితుల్లో ముగ్గురికి ఎక్సైజ్ అధికారులు లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించారు. అందులో ఓ నిందితుడు లక్ష రూపాయల మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించినట్టు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సంగారెడ్డి సూపరింటెండెంట్ కె.రఘురాం తెలిపారు. ఇప్పటివరకు సారా విక్రయం, తయారీ కేసులో ఇంత పెద్ద మొత్తం జరిమానా విధించి చెల్లించడం రాష్ట్రంలోనే ఇదే ప్రథమం. సంగారెడ్డి ఎక్సైజ్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈఎస్ మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. సారా తయారీ, విక్రయం పెద్ద ఎత్తున జరిపిన నేపథ్యంలో నిందితులను తహశీల్దార్ల ఎదుట బైండోవర్ చేస్తారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించగా ఇద్దరు చెల్లిస్తామని అధికారులకు హామీ ఇచ్చారు. కాగా చిన్నశంకరంపేట మండలం సంకాపూర్ తండాకు చెందిన లంబాడి నింబ్యా(45) అనే వ్యక్తి జరిమానా చెల్లించకపోవడంతో అతనికి ఏడాదిపాటు జైలు శిక్షను అధికారులు ఖరారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇద్దరు నిందితుల్లో రేగోడ్ మండలం గజివాడ తండాకు పాల్టి గురునాథ్ లక్ష రూపాయల జరిమానాను ప్రభుత్వానికి చెల్లించినట్టు సంగారెడ్డి ఈఎస్ కె.రఘురాం తెలిపారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ సారా తయారు చేసినా, విక్రయించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
నాగోలు/ హయత్‌నగర్ : అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి 50 బాటిళ్లు స్వాధీనం చేసుకున్న ఘటన ఎల్బీ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... బండ్లగూడలోని తన నివాసంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న బంటు సోమయ్య ఇంటిపై దాడి చేసి 50 బాటిళ్లను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.