‘బెల్ట్‌’ కిక్కు

Illegal Liquor Business In Warangal - Sakshi

జిల్లాలో సుమారు నాలుగు వేల దుకాణాలు

రోజుకు రూ. 20 లక్షల వ్యాపారం

బార్‌లను తలపిస్తున్న అనధికార సిట్టింగ్‌లు

ఫుల్‌ బాటిల్‌కు అదనంగా రూ.100 వసూలు

జనగామ: గ్రామాల్లో ‘బెల్ట్‌’ కిక్కెక్కిస్తోంది. వేసవి ప్రభావంతో నీటికి కష్టాలు ప్రారంభమైనా.. మద్యం మాత్రం ఏరులై పారుతోంది. అనధికార సిట్టింగ్‌లు బార్‌లను తలపిస్తున్నాయి. ఫుల్‌ బాటిల్‌పై రూ. 100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. గుడుంబా అమ్మకాలపై దృష్టి సారించిన ఎక్సైజ్‌ శాఖ బెల్ట్‌ దుకాణాలను చూసీచూడనట్లు వదిలేస్తోంది. దీంతో వారి ఇష్టారాజ్యం కొనసాగుతోంది.  జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌ పూర్, పాలకుర్తి నియోజక వర్గాల పరిధిలోని 12 మండలాల్లో నాలుగు వేల వరకు బెల్ట్‌ దుకాణాలు ఉండొచ్చని అంచనా.

బెల్ట్‌ దుకాణాల ద్వారా ప్రతి రోజు రూ.20 లక్షల వరకు వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తుంది. జనగామ జిల్లా పరిధిలోని జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు గ్రామాల్లో బెల్ట్‌ దుకాణాల జోరు విచ్ఛలవిడిగా కొనసాగుతుంది. గతంలో సుప్రీం కోర్టు తీర్పు ప్రకటించే వరకు  బెల్ట్‌ షాపుల అమ్మకాలు గుట్టుగా సాగాయి. మద్యం దుకాణాలు ఊరికి దూరంగా.. రహదారులకు దగ్గరగా ఉండేవి. బెల్ట్‌షాపులు మాత్రం ఇళ్లకు దూరంగా.. రహదారులకు దగ్గరగా వచ్చేశాయి.

2017 జూలై ఒకటో తేదీ నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో మద్యం, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కార్పోరేషన్, మునిసిపల్‌ పరి ధిలో మాత్రం ఇందుకు మినహాయింపు ఇచ్చింది. సుప్రీం ఆదేశాల మేరకు మండల, పట్టణ ప్రాం తాల్లో జాతీయ, రాష్ట్ర హైవేలకు దూరంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు.

మద్యం దుకాణాలు కనిపించక....

హైవేలపై ప్రయాణం చేసే సమయంలో చాలా మంది మద్యం సేవించి డ్రైవింగ్‌ చేసేవాళ్లు. రహదారిపై వైన్స్‌ కనిపించగానే మద్యం సేవించేవారు. సుప్రీం కోర్టు కఠినమైన నిబంధనలతో తీర్పు వెలువరించింది. దీంతో మద్యం దుకాణాలు హైవేల నుంచి గ్రామాల్లోకి వెళ్లినా, వాటి స్థానంలో కొత్తగా బెల్ట్‌ షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి..వెలుస్తున్నాయి. 

బార్‌లను తలపిస్తున్న.. బెల్ట్‌ దుకాణాలు

జిల్లాలోని అనేకచోట్ల బెల్ట్‌షాపుల నిర్వహణ బార్లను తలపిస్తున్నాయి. దీంతో ఎప్పటి లాగే హైవేలపై ప్రయాణించే వారు ఏ చీకూ చింతా లేకుండా ‘మత్తు’ లోకి దిగుతున్నారు. అనధికారిక ఆదేశాల మేరకు కొనసాగుతున్న బెల్ట్‌ దుకాణాలపై ఎక్సైజ్‌ శాఖ చూసిచూడనట్లు వ్యవహరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత మండలాలకు చెందిన వైన్స్‌ల నుంచి కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి మద్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా తీసుకు వస్తున్నారు.

అదనపు వడ్డింపు

బెల్ట్‌ దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అదనపు వడ్డింపుతో మత్తును వదిలిస్తున్నారు. క్వార్టర్‌కు రూ. 20 నుంచి రూ.30 వరకు అదనంగా తీసుకుంటున్నారనే గొడవలు అంతటా జరుగుతున్నాయి.  ఆయా మండలాల పరిధిలోని వైన్స్‌ దుకాణాల్లో కూడా ఎమ్మార్పీకంటే అదనంగా ధరలు తీసుకుంటుండడంతో.. నిత్యం మాటల యుద్ధం జరుగుతుంది.   
ఫిర్యాదు చేస్తే దాడులు చేస్తాం. 

బెల్ట్‌ దుకాణాలు నిర్వహిస్తే చర్యలు త ప్పవు.ఎప్పటికప్పుడు దాడులు కొనసాగిస్తున్నాం. దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.వైన్స్‌ల్లో అదనపు ధరలకు విక్రయిస్తే..కేసులు నమోదు చేస్తాం. 
– సుధీర్, ఎస్సై ఎక్సైజ్‌ శాఖ, జనగామ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top