ఊరూరా బెల్ట్‌ దుకాణం.. ఇది కదా కుంభకోణం! | Belt shops in Minister Kollu Ravindras area | Sakshi
Sakshi News home page

ఊరూరా బెల్ట్‌ దుకాణం.. ఇది కదా కుంభకోణం!

May 24 2025 4:06 AM | Updated on May 24 2025 4:07 AM

Belt shops in Minister Kollu Ravindras area

పీటీ పాలెం బెల్ట్‌ షాపు @ రూ.15 లక్షలు  

ఇది ఎక్సైజ్‌ మంత్రి ఇలాకాలో పలికిన వేలం ధర   

తాళ్లపాలెం, గిరిపురం బెల్ట్‌షాపులకూ వేలం పాట.. మంత్రి నివాసం ఉండే ప్రాంతంలోనే ఐదు బెల్ట్‌ దుకాణాలు

కొన్ని షాపులకు యానాం నుంచి మద్యం సరఫరా  

మచిలీపట్నం నియోజకవర్గంలో బెల్ట్‌షాపుల సంఖ్య 200–250  

నాగాయలంక మండలం సంగమేశ్వరంలో బెల్ట్‌షాపు ధర రూ.7 లక్షలు 

ఒక్క మాజేరులోనే 12 బెల్ట్‌షాపులు.. గూడూరులో టీడీపీ నేతకు ఐదు 

క్వార్టర్‌ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.50 అదనంగా బాదుడు

సాక్షి ప్రతినిధి, విజయవాడ : అక్రమ మద్యం అమ్మకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. సాక్షాత్తు ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో బెల్ట్‌ షాపులు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇక్కడ మందు దొరకని ఊరు లేదు. మచిలీపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా 200–250 బెల్ట్‌ షాపులు వెలిశాయి. మచిలీపట్నంలో మంత్రి నివాసం ఉండే ప్రాంతంలోనే ఐదు బెల్ట్‌ షాపులు ఉన్నాయి. క్వార్టర్‌ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.50 అదనంగా మందుబాబుల ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. ఇది చాలదన్నట్లు తాజాగా బెల్ట్‌ షాపులకు గ్రామాల వారీగా బహిరంగ వేలం వేస్తున్నారు. 

ఇందులో భాగంగా మూడు రోజుల క్రితం మచిలీపట్నం రూరల్‌ మండలం పరిధిలోని పెద్ద ముత్తాయపాలెం (పీటీ పాలెం)లో బెల్ట్‌షాపు నిర్వహణ కోసం పెట్టిన వేలం పాటలో రూ.15 లక్షల ధర పలికింది. టీడీపీ కార్యకర్త వడుగు భీమరాజు ఈ మేరకు పాట పాడి బెల్ట్‌ షాపును దక్కించుకొన్నాడు. చిన్నాపురం మద్యం షాపు పరిధిలో జరిగిన ఈ వేలం పాటల్లో టీడీపీ మండల నేత, ఎక్సైజ్‌ సీఐ కీలక పాత్ర పోషించారు. ఊరికి మొత్తం ఒకే బెల్ట్‌షాపు ఉండేలా ఒప్పందం చేశారు. గ్రామంలో ఇతరులు బెల్ట్‌ షాపులు పెట్టకూడదని, ఇతర బ్రాందీ షాపుల వారు ఆ గ్రామానికి సరుకు ఇవ్వకూడదని, చిన్నాపురం బ్రాంది షాపు నుంచే సరుకు సరఫరా అయ్యేలా ఒప్పందం కుదిర్చారు.

కాగా మచిలీపట్నంలో వచ్చే నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని బీచ్‌ ప్రాంతంలో ఉండే మద్యం షాపు యజమాని వేలం పాటకు తెర లేపుతున్నారు. బీచ్‌కు సమీప గ్రామాల్లోని తాళ్లపాలెం, గిరిపురం గ్రామాల్లో బెల్ట్‌ షాపు ఏర్పాటుకు ఒక్కో షాపునకు రూ.4 లక్షలు «ధరగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ధర ఇంకా ఫైనల్‌ కాలేదని, ఎవరైనా పోటీకి వస్తే ధర ఇంకా పెరగొచ్చని.. ఆదివారంలోపు «ఖరారయ్యే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. 

ఇదిలా ఉండగా మచిలీపట్నంలో సుల్తానగర్‌ ప్రాంతంలో ఉండే మద్యం షాపు పరిధిలో ఉన్న బెల్ట్‌ షాపులకు యానాం నుంచి మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. సాక్షాత్తు ఎక్సైజ్‌ మంత్రి ఇలాకాలోనే ఇలా పెద్ద ఎత్తున మద్యం అక్రమ విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోక పోవడంపై మహిళల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అన్ని ఊళ్లలోనూ అదే దందా
టఅవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక మండలం సంగమేశ్వరంలో బెల్ట్‌షాపుకు రూ.7 లక్షల ధర పలికింది. పాత ఉపకాలిలో రూ.4.19 లక్షలు, గుల్లలమోదలో రూ.5.30 లక్షలు, పెదగౌడపాలెంలో రూ.3.50 లక్షలు, ఎదురుమొండిలో రూ.5.40 లక్షలు, సొర్లగొందిలో రూ.2.50 లక్షలు, దిండిలో రూ.3.50 లక్షలు, కమ్మనమోలులో రూ.4.50 లక్షలు ధర పలికాయి. చల్లపల్లి మండలంలో కేవలం 3,998 జనాభా మాత్రమే ఉన్న మాజేరు గ్రామంలో ఏకంగా 12 బెల్ట్‌ షాపులు ఏర్పాటవ్వడం విస్తుగొలుపుతోంది. ఒక్కోబెల్ట్‌ షాపునకు ఏడాదికి రూ.లక్ష చొప్పున వసూలు చేశారు.  

» గుడివాడ నియోజకవర్గంలో 150కి పైగా బెల్ట్‌ షాపులు ఉన్నాయి. మద్యం షాపుల యజమానులు బాటిల్‌పై రూ.10 అధిక ధరతో బెల్ట్‌ షాపుల నిర్వాహకులకు అమ్ముతున్నారు. గ్రామ జనాభాను బట్టి రేటు నిర్ణయించారు. బెల్ట్‌షాపుల నిర్వాహకులు క్వార్టర్‌ సీసాపై రూ.30 నుంచి 40 అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రతి బెల్ట్‌ షాపు నుంచి మండల టీడీపీ నేతకు నెలకు రూ.5 వేలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. 
»   పెనమలూరు నియోజకవర్గంలో 120కిపైగా బెల్ట్‌ షాపులున్నాయి. మద్యం నిర్వాహకులు సిండికేట్‌గా మారి క్వార్టర్‌ బాటిల్‌పై అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారు. బెల్ట్‌ షాపు నిర్వాహకులు రూ.30 నుంచి 50 ఎక్కువ ధరతో అమ్ముతున్నారు. పెడన నియోజకవర్గంలో 165కు పైగా బెల్ట్‌ షాపులున్నాయి. పెడనలో నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన వినాయకుడి గుడికి పక్కనే బెల్ట్‌షాపు పెట్టారు. దీంతో మందు బాబులతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ మండల నేత ఒకరు గూడూరులో ఏకంగా ఐదు బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారు.  
»   పామర్రు నియోజకవర్గంలో 156 బెల్ట్‌ షాపులున్నాయి. పామర్రు మండలంలోని కొండిపర్రు, జమీన్‌ గొలువేపల్లి, ఎలమర్రు గ్రామాల్లో ఒక్కో బెల్ట్‌షాపుకు టీడీపీ నేతలు రూ.20–50 వేల వరకు వసూలు చేస్తున్నారు. 
»  ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా బెల్ట్‌ షాపుల్లో క్వార్టర్‌ బాటిల్‌పై పగలు రూ.30.. రాత్రిళ్లు రూ.50 అధికంగా వసూలు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement