
తిరుపతి జిల్లా: తన అన్న హత్య చేసిన కేసులో తమకు న్యాయం జరగాలని మరొకసారి స్పష్టం చేసింది శ్రీనివాసులు అలియాస్ రాయుడు సోదరి కీర్తి. ఈరోజు(గురువారం జూలై 17) శ్రీకాళహస్తి డీఎస్పీని కలిసిన కీర్తి.. తమకు న్యాయం జరగాలని కోరడంతో పాటు రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు డీస్పీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. ‘ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మాకు రక్షణ కల్పించాలి కోరాం. చిన్న చిన్న విషయాలకు పవన్ కల్యాణ్ స్పందిస్తారు, మా అన్న చనిపోతే కనీసం పలకరింపు లేదు. పవన్ కళ్యాణ్ దగ్గరికి అయినా మమ్మల్ని తీసుకువెళ్ళండి. హత్య జరిగిన తర్వాత మాకు రూ. 30 లక్షలు ఆఫర్ చేశారు. మేము డబ్బులకు లొంగే వాళ్ళము కాదు, మాకు న్యాయం జరగాలి. సోషల్ మీడియాలో మా అన్నపై ఏవో విష ప్రచారం చేస్తున్నారు. ఈ కేసులో చాలా మంది ఉన్నారు..వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి’ అని డిమాండ్ చేసింది.
కాగా, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జి కోట వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, రాయుడు హత్యపై అటు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, ఇటు కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు.
ఇక, తన మనవడు రాయుడు హత్యపై రాజేశ్వరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

రాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘నా మనవడిని ఏం చేయవద్దని కాళ్లు పట్టుకుని వేడుకున్నాను. కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు. హత్యకు ముందు ఐదుసార్లు పంచాయితీ జరిగింది. ఏ మాత్రం కనికరం లేకుండా నా మనవడిని హత్య చేశారు’ అని రాజేశ్వరమ్మ కన్నీటి పర్యంతమైంది.
‘అయ్యా పవన్.. నా మనవడి కోసం కాళ్లు పట్టుకున్నా సామీ’