
సాక్షి, శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జి కోట వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, రాయుడు హత్యపై అటు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, ఇటు కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపులేదు. ఇక, తన మనవడు రాయుడు హత్యపై రాజేశ్వరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
రాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘నా మనవడిని ఏం చేయవద్దని కాళ్లు పట్టుకుని వేడుకున్నాను. కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు. హత్యకు ముందు ఐదుసార్లు పంచాయితీ జరిగింది. ఏ మాత్రం కనికరం లేకుండా నా మనవడిని హత్య చేశారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించకపోవడం బాధాకరం. నా మనవడికి డబ్బు ఇచ్చారని చెబుతున్నారు. ఆ డబ్బు ఎక్కడుందో తెలియాలి. తమిళనాడు పోలీసులే మాకు న్యాయం చేస్తారు. ఏపీకి కేసు బదిలీ చేస్తే కేసు నీరుగారిపోతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తనను చంపేస్తున్నారని.. టీడీపీ నేతకు కూడా రాయుడు మెసేజ్ పెట్టాడు. కానీ, ఆయన ఏమీ స్పందించలేదు. నా పేరు బయటకు చెప్పవద్దు.. మీ చావు మీరు చావండి అని అన్నాడని చెప్పుకొచ్చారు.

అంతకుముందు.. రాయుడు సోదరి కీర్తి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తనకున్న ఒకే ఒక్క సోదరుడు శ్రీనివాసులు అని.. అతన్ని పొట్టన పెట్టుకున్నారంటూ కన్నీరుమున్నీరవుతోంది. దీన్ని ఇక్కడితో వదిలేస్తే రేపు ఇంకోటి జరుగుతుందని.. తమకు న్యాయం జరగాల్సిందేనని ఆమె పట్టుబడుతోంది. అంతేకాక.. ‘నా అన్నను నాకు లేకుండా చేశారు. మా అన్నను చంపిన వాళ్లను ప్రాణాలతో వదలం. పవన్ రావాలి.. మాకు న్యాయం చేయాలి. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం. మా అన్నను చంపిన వాళ్లకు కఠినంగా శిక్ష పడాల్సిందే’.. అని చెప్పింది.
ఇదిలా ఉండగా.. అతి సామాన్య కుటుంబానికి చెందిన శ్రీనివాసులును కోట వినుత ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురితో కలిసి అతికిరాతకంగా మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ముఖ్యనేతలెవరూ స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తమిళ మీడియాలో కూడా ఈ ఉదంతంపై వరుస కథనాలు వస్తున్నప్పటికీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగానీ, జనసేన అధినేతగానీ ఇప్పటివరకు నోరువిప్పలేదు. అయితే, మృతుడు కుటుంబ సభ్యులు మాత్రం పవన్ రావాలి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
హత్య ఎందుకు జరిగింది..ఎలా చేశారంటే?
జనసేన నేత వినుత వద్ద ఉన్న శ్రీనివాసులుపై నిఘా పెట్టిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ముఖ్యనేత అతడికి డబ్బులు ఎర చూపి, వారి రాజకీయ వ్యూహాలు, ఇతర వ్యక్తిగత విషయాలకు సంబంధించి కీలక సమాచారాన్ని తెలుసుకున్నట్లు సమాచారం. దీన్ని కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌నాయుడు గుర్తించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే గత నెల 21న శ్రీనివాసులును విధుల నుంచి తొలగించారు. అయితే కోట వినుతతో ఉన్న కొన్ని వీడియోలు బయట పడడంతో అతడిని మట్టుబెట్టాలని గత నెలలోనే పక్కా ప్లాన్ వేసినట్లు చెన్నై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.
అయితే అందులోని కొన్ని వీడియోలు బహిర్గతం కావడంతో జీర్ణించుకోలేని కోట చంద్రశేఖర్‌నాయుడు అతడిని ఎలాగైనా అంతమొందించాలని భావించినట్టు తెలిసింది. తలచిందే తడువుగా పక్కా ప్లాన్ ప్రకారం పార్టీలోని మరో నలుగురు వ్యక్తుల సహాయంతో శ్రీనివాసులును శ్రీకాళహస్తిలోని ఓ గోడౌన్‌కు తీసుకెళ్లి అక్కడ విచక్షణా రహితంగా కొట్టి చంపినట్టు చెన్నై పోలీసులు భావిస్తున్నారు. అక్కడి నుంచి కారులో చెన్నైకి తీసుకెళ్లి మింట్ ఏరియా కూవం నదిలో పడేసి ఆంధ్రాకు తిరిగి వచ్చేశారని చెన్నై పోలీసులు వెల్లడించారు.
నిందితులను పట్టించిన పచ్చబొట్టు
చెన్నై నగరం, నార్త్ జోన్ సెవన్ వెల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైనేజీ కాల్వలో యువకుడి మృతదేహాన్ని ఈనెల 8వ తేదీన గుర్తించిన పోలీసులు పోస్టుమార్టంలో హత్య జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే మృతుడి చేతి మీద జనసేన పార్టీ గుర్తు, వినుత పేరు పచ్చబొట్టు ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. సీసీ ఫుటేజ్ లభించడంతో శనివారం తెల్లవారుజామున శ్రీకాళహస్తికి చేరుకున్న చెన్నై పోలీసులు జనసేన ఇన్‌చార్జి కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌నాయుడు, హత్యకు సహకరించిన రేణిగుంటకు చెందిన దస్తా సాహెబ్, శ్రీకాళహస్తికి చెందిన కె.శివకుమార్, తొట్టంబేడు మండలానికి చెందిన ఎస్.గోపిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకెళ్లారు.