విజయవాడ: టీడీపీ, జనసేన పార్టీ వాళ్లు తనను విపరీతంగా నిందిస్తున్నారని జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ చెప్పారు. తనకు కొంతమంది నేరుగా ఫోన్ చేసి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అడుగుతున్నారని తెలిపారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా తప్పులు చేస్తే ప్రశ్నించడం తమ పార్టీ సిద్ధాంతమని చెప్పారు.
విజయవాడలో ఇవాళ జడ శ్రవణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘గత ఐదేళ్లలో జగన్ రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశారని అప్పట్లో ప్రచారం చేశారు. ఏబీఎన్, టీవీ 5లో వారానికి మూడు రోజులు డిబేట్లు నడిపించారు. రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నారని చంద్రబాబు చెప్పగానే.. ఏపీ శ్రీలంక అయిపోయిదంటూ డిబేట్లు పెట్టారు. ఏబీఎన్, టీవీ5, మహాటీవీలో కొన్ని వేల డిబేట్లు పెట్టారు. మరి, రెండేళ్లు కూడా నిండని కూటమి ప్రభుత్వం 3 లక్షల 56 వేల కోట్ల రూపాయల అప్పు చేసింది. ఆరోగ్య శ్రీ ఇవ్వడం లేదు. రైతుకు మద్దతు ధర లేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అటకెక్కింది.
దేనికోసం ప్రభుత్వం 3లక్షల 56 వేల కోట్లు అప్పు చేసింది? ప్రభుత్వం అప్పులు ఎందుకు చేస్తుందో లెక్క ఉందా? ప్రతి నెలా ప్రభుత్వానికి పన్నుల ద్వారా 20 వేల కోట్లు ఆదాయం వస్తుంది. వస్తున్న ఆదాయం చేసిన అప్పు సొమ్మంతా ఏమైపోయింది? జగన్ ఐదేళ్లలో 3 లక్షల 60 వేల కోట్ల రూపాయల అప్పుచేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని గగ్గోలు పెట్టారు.
రెండేళ్లలో 3 లక్షల 60 వేల కోట్ల రూపాయల అప్పుతో చంద్రబాబు గత ప్రభుత్వ రికార్డులను బద్దలు కొట్టారు. జగన్ అప్పు చేస్తే ఏపీ శ్రీలంక... చంద్రబాబు అప్పు చేస్తే అద్భుతమైన పరిపాలనాదక్షుడు అయిపోయాడా? సంపద సృష్టించడానికి తనకే పేటెంట్ ఉందని చంద్రబాబు డబ్బాలు కొట్టారు. నెలకు 15 వేల కోట్లు అప్పు చేయడమంటే ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉందా? సంపద సృష్టి అంటే అప్పులు చేయడమేనా?
ఎకరా 99 పైసలకు అమ్మేసుకుని లోకేష్ తన ఆస్తులను పెంచుకుంటున్నాడు. మైనార్టీ కూడా తీరని దేవాన్ష్ కు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయ్. పాలు, పెరుగు అమ్ముకునే హెరిటేజ్ కు వేల కోట్ల రూపాయల ఆస్తులు పెరిగాయ్. రెండెకరాలతో జీవితం మొదలుపెట్టిన చంద్రబాబు ఆస్తులు 937 కోట్ల రూపాయలు.
వెస్ట్ బెంగాల్ కు మూడు సార్లు సీఎంగా చేసిన మమతా బెనర్జీ ఆస్తులు 15 లక్షల రూపాయలే. దేశంలో మరే ముఖ్యమంత్రి అందుకోలేని ఎత్తులో అత్యంత ధనికుడిగా చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు దోచుకోవడానికే అమరావతి. రాజధానిలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఎందుకు కలపరు?
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వాళ్లు మీకు అంటరానివారుగా కనిపిస్తున్నారు. మావిగన్ ప్రతిపాదనను ఎందుకు వద్దంటున్నారో సమాధానం చెప్పాలి. ఈ మూడు ప్రాంతాల వాళ్లు రాజధానిలో భాగం అవ్వడం మీకు ఇష్టం లేదా? ఎందుకు మావిగన్ ను వ్యతిరేకిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పాలి.
అమరావతి దోపిడీలో ఎవరికీ భాగస్వామ్యం దక్కకూడదనేది మీ ఆలోచన. లింగమనేని దగ్గర డబ్బులు తీసుకుని పార్టీ ఆఫీస్ కట్టారు. పవన్ కు గుర్తొచ్చినప్పుడల్లా మాదాపూర్ వెళ్లడానికి ఫ్లైట్ ఇచ్చారు. లింగమనేని చేసిన తప్పుడు పనులకు చంద్రబాబు , పవన్ వత్తాసు పలుకుతున్నారు. ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు , నెలకు 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. నిజంగా మీకు నిజాయితీ ఉంటే నిరుద్యోగ భృతి వడ్డీతో సహా చెల్లించాలి. లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయామని క్షమాపణ చెప్పండి. ప్రజలను చీట్ చేశామని చంద్రబాబు , పవన్ , లోకేష్ ఒప్పుకోవాలి’ అని చెప్పారు.


