ఎవరి సిఫార్సు లేకుండా ఇల్లు  | Sakshi
Sakshi News home page

ఎవరి సిఫార్సు లేకుండా ఇల్లు 

Published Sun, Apr 7 2024 2:50 AM

Jagan Mohan Reddy is implementing the Navaratnalu Scheme in AP - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.  

ఎవరి సిఫార్సు లేకుండా ఇల్లు 
నేను తాపీ పని చేస్తుంటాను. పార్వతీపురం మన్యం జిల్లాలోని వీరఘట్టానికి చెందిన మేము పొట్టకూటికోసం విజయనగరం జిల్లా రాజాం పట్టణానికి కొన్నేళ్ల క్రితం వలస వచ్చాం. గాయత్రీకాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉండేవాళ్లం. నా కొచ్చే అరకొర ఆదాయం సరిపోకపోవడంతో నా భార్య సంధ్య.. ఇంట్లో టైలరింగ్‌ పని చేస్తోంది. మాకు ఇద్దరు పిల్లలు. గత ప్రభుత్వ హయాంలో మాకు పని సరిగ్గా ఉండేది కాదు. ఎలాంటి సాయమూ అందేది కాదు. కానీ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక మా పరిస్థితి మెరుగు పడింది. మాకు చేతి నిండా పని దొరుకుతోంది.

ఈ ప్రభుత్వంలోనే మాకు రైస్‌ కార్డు ఇచ్చారు. బడికెళ్తున్న మా అబ్బాయికి అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వంతున వచ్చింది. మరీ ముఖ్యంగా ఎవరి సిఫారసు లేకుండానే ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి నిధులు ఇచ్చారు. అందరిలానే మేం కూడా కంచరాం సమీపంలో మాకు ఇచ్చిన స్థలంలో సొంత ఇంటిని నిరి్మంచుకున్నాం. నెల రోజుల క్రితం గృహ ప్రవేశం చేశాం. కేవలం అర్హతే ప్రామాణికంగా ఎలాంటి పైరవీలు లేకుండా ఇన్ని సౌకర్యాలు కల్పించిన ఈ ప్రభుత్వం రుణం ఎప్పటికీ తీర్చుకోలేం.     – గంధవరపు సురేష్, రాజాం.  (వి.వి.దుర్గారావు, విలేకరి, రాజాం) 

పేపర్‌ ప్లేట్ల తయారీతో దర్జాగా జీవనం 
నేను సాధారణ గృహిణిని. విశాఖ జిల్లా చిట్టివలస గ్రామానికి చెందిన నేను గత ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుని స్వయం సమృద్ధి సాధించే దిశగా సాగుతున్నాను. నేను డ్వాక్రా గ్రూప్‌ సభ్యురాలిని కావడంతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా జీవీఎంసీ భీమిలి జోన్‌ ద్వారా పట్టణ ప్రగతి యూనిట్‌ పేరుతో రెండు నెలల క్రితం పేపర్‌ ప్లేట్ల తయారీ యూనిట్‌ పెట్టుకున్నా.

ఈ యూనిట్‌ విలువ రూ.2,02,500. ఇందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.39,600. యూనిట్‌కు యంత్ర పరికరాలు, మెటీరియల్‌ ప్రభుత్వమే ఇచ్చింది. ప్రోత్సాహకంగా నాలుగు నెలల అద్దె కింద మరో రూ.20 వేలు ఇచ్చారు. పేపర్‌ ప్లేట్ల తయారీలో భాగంగా పాలిథిన్‌ రహిత పేట్ల తయారీలో శిక్షణ తీసుకున్నా. పేపర్‌ అట్టలపై విస్తర్లు ఉంచి సంప్రదాయ పద్ధతిలో భోజనాలకు అనువుగా వినియోగదారుల అభిరుచి మేరకు తయారు చేయగలుగుతున్నా.

వ్యాపారం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఇల్లు లేని మాకు ఇంటి స్థలం ఇవ్వడమే గాకుండా ఇంటి నిర్మాణానికి రూ. 1.80 లక్షల ఆర్థికసాయం చేశారు. దాంతో ఇంటి నిర్మాణం పూర్తిచేసుకోగలిగాం. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిన ఈ ముఖ్యమంత్రికి ఎప్పటికీ రుణపడి ఉంటాం.     – వెంపాడ అరుణ, చిట్టివలస     (గేదెల శ్రీనివాసరెడ్డి, విలేకరి, తగరపువలస) 

Advertisement
Advertisement