హైకోర్టు ఆన్‌లైన్‌కు ఏడాది

It has been a year since the courts in AP was not began - Sakshi

లాక్‌డౌన్‌తో.. వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో విచారణ మొదలు

ఏప్రిల్‌ 9 వరకు ఇదే విధానం

పెరిగిన పెండింగ్‌ కేసులు

కరోనాలో యువ న్యాయవాదులను ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వం 

సాక్షి, అమరావతి: కరోనా కారణంగా రాష్ట్రంలో న్యాయస్థానాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాక ఏడాది అవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 9 వరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే కేసులను విచారించాలని హైకోర్టు తన పరిధిలో పనిచేసే అన్ని న్యాయస్థానాలకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. భౌతిక విచారణలో జరిగినంత వేగంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసుల విచారణ సాధ్యం కాకపోవడంతో ఆ ప్రభావం కేసులపై పడుతోంది. దీంతో పెండింగ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. హైకోర్టు న్యాయమూర్తులు, కింది కోర్టుల న్యాయా ధికారులు, సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతోంది. కక్షిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో మొత్తం స్తంభించిపోవడంతో న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కనీస ఆదాయం లేక పలువురు న్యాయవాదులు ముఖ్యంగా యువ న్యాయవాదులు ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి వారిని రాష్ట్ర ప్రభుత్వం ‘లా నేస్తం’ద్వారా కొంతమేర ఆదుకుంది. న్యాయవాదులకు రుణాలు కూడా ఇచ్చింది. వీడియో కాన్ఫరెన్స్‌ విధానం వల్ల పాతతరం న్యాయవాదు లు సాంకేతికతకు అలవాటు పడేందుకు చాలా సమయం పట్టింది. 

పలువురు మృత్యువాత...
హైకోర్టులో కరోనా విజృంభించినప్పుడు పలువురు ఉద్యోగులు, న్యాయవాదులు మృత్యువాతపడ్డారు. అప్పటి సీజే తీరువల్లే కరోనా చెలరేగిందని, అప్పటి ఇన్‌చార్జి రిజిస్ట్రా్టర్‌ రాజశేఖర్, మరికొందరు మృత్యువాత పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. 

కింది కోర్టుల్లో ఇబ్బందులు...
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు అవసరమైన పూర్తిస్థాయి సాంకేతికత కింది కోర్టుల్లో అందుబా టులో లేకపోవడం కేసుల విచారణకు అవరోధంగా మారింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు వి నిపించేందుకు న్యాయవాదులు మొబైల్‌ ఫోన్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఫోన్లలో సిగ్నల్స్‌ లేక కేసులు తరచూ వాయిదా పడుతున్నాయి. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సాక్షుల విచారణ, సాక్ష్యాల నమోదు కింది కోర్టులకు సవాలుగా మారింది. కరోనా సెకండ్‌వేవ్‌ భయాందోళనల నేపథ్యంలో హైకోర్టు ఏప్రిల్‌ తరువాత కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసుల విచారణకు మొగ్గు చూపే అవకాశం ఉంది.

హైకోర్టులో పెండింగ్‌ కేసుల వివరాలు...
► హైకోర్టులో 29.01.2020 నాటికి 70,264 సివిల్‌ కేసులు,  30,485 క్రిమినల్‌ కేసులు, 95,804 రిట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 1,96,553 పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సంఖ్య 16.09.2020 నాటికి 2,03,124కు పెరిగింది. వీటిలో సివిల్‌ 1,72,657, క్రిమినల్‌ కేసులు 30467 ఉన్నాయి.
► హైకోర్టులో పెండింగ్‌ కేసుల సంఖ్య 2021 మార్చి 21 నాటికి 2,10,900కు పెరిగింది. వీటిలో సివిల్‌ 1,79,673 కాగా, క్రిమినల్‌ కేసులు 31,227 ఉన్నాయి.
► రాష్ట్రవ్యాప్తంగా కింది కోర్టుల్లో 6,66,996 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 3,66,718 సివిల్‌ కేసులు కాగా 3,00,278 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top