శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ

Initiation of Srivari holy festivals TTD - Sakshi

తిరుమల/తిరుపతి ఎడ్యుకేషన్‌: శ్రీవారి ఆలయంలో బుధవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా రాత్రి 8 నుంచి 9 గంటల నడుమ అంకురార్పణ జరిగింది. అర్చకులకు బాధ్యతల కేటాయింపు చేసే ప్రక్రియలో భాగంగా ఉదయం శ్రీవారి మూలవిరాట్‌ ఎదుట ఆచార్య రుత్విక్‌వరణం నిర్వహించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానివ్వకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. 

టీటీడీ ఆధ్వర్యంలో వరలక్ష్మీవ్రతం, కృష్ణాష్టమి వేడుకలు
శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా శ్రావణ పౌర్ణమి, వరలక్ష్మీ వ్రతం, కృష్ణాష్టమి వేడుకలను టీటీడీలోని అన్ని ధార్మిక ప్రాజెక్టుల సమన్వయ సహకారంతో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో మంగళవారం అన్ని ప్రాజెక్టుల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కో–ఆర్డినేటర్ల శిక్షణకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ (హెచ్‌డీపీపీ) అధికారులను ధర్మారెడ్డి ఆదేశించారు.

సప్తగిరి మాస పత్రికలో చక్కటి కంటెంట్, శీర్షికలు ప్రచురించాలని సూచించారు. రెండేళ్లలో 1,000 అన్నమాచార్య సంకీర్తనలను స్వరపరచి ప్రజలకు అందించాలని, దీనికోసం స్వరకర్తలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సూచించారు. దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా కన్నడ భాషలో సంకీర్తనలు స్వరపరచడానికి స్వరకర్తలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top